బుల్లి బుల్లి దీవులు.. కేరళను మించి సోయగాలు | Sakshi
Sakshi News home page

బుల్లి బుల్లి దీవులు.. కేరళను మించి సోయగాలు

Published Sun, Feb 27 2022 4:26 AM

Government of Andhra Pradesh Focus On Tourism development - Sakshi

సాక్షి, విశాఖపట్నం: కొండ కోనల నడుమ మన్యం అందాలు ఒకవైపు.. యాత్రికులను అబ్బురపరిచే పర్యాటక కేంద్రాల సోయగాలు మరోవైపు. ఆ అందాలకు మరింత వన్నెలద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. విశాఖ మన్యంలో కేరళ తరహాలో బ్యాక్‌ వాటర్‌ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మనోహరమైన సుజనకోట ప్రాంతంలోని చిన్న చిన్న దీవుల్లో కేరళను మించిన అందాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. 

సుజనకోట.. ప్రకృతి మేట 
బ్యాక్‌ వాటర్‌ ఉన్న ప్రాంతంగా ముంచంగిపుట్టు మండలం సుజనకోటను గుర్తించారు. సుజనకోటలోని మత్స్యగెడ్డ వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. జి.మాడుగులలో ప్రారంభమై.. హుకుంపేట, పెదబయలు మీదుగా ముంచంగిపుట్టు వద్ద జోలపుట్టు డ్యామ్‌లో కలుస్తుంది. ఒకవైపు పచ్చని దీవులు, మరోవైపు ఆకర్షణీయమైన సుందర ప్రదేశాలతో పర్యాటకులను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా సుజనకోట పంచాయతీలో మత్స్యగెడ్డ అందాలు కేరళను తలపిస్తుంటాయి. మెలికలు తిరుగుతూ ఎత్తయిన గిరుల మధ్య నుంచి మత్స్యగెడ్డ పాయలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ అందాలను చూసేందుకు నిత్యం వందలాదిగా పర్యాటకులు వస్తుంటారు. 

బ్యాక్‌ వాటర్‌ బోటింగ్‌.. ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ 
కేరళ పర్యాటకానికి పేరు తెచ్చింది బ్యాక్‌ వాటర్స్‌ అని అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే అనుభూతిని సుజనకోటలో పొందవచ్చు. మత్స్యగెడ్డ బ్యాక్‌వాటర్‌ను అభివృద్ధి చేస్తే.. కేరళ వెళ్లాల్సిన అవసరం లేదన్నట్లుగా అంతర్జాతీయ పర్యాటకుల్ని సైతం ఆకర్షిస్తుంది. బ్యాక్‌ వాటర్‌లో సేదతీరేలా బోటింగ్, ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేయాలని ఐటీడీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.2.50 కోట్లతో సుజనకోట అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేశారు. బ్యాక్‌వాటర్‌ అందాలను తిలకించిన తర్వాత.. దేశ, విదేశీ టూరిస్టుల అభిరుచికి అనుగుణంగా ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు. రెండు మూడు రోజులు ఇక్కడ ప్రకృతి ప్రేమికులు విహరించేందుకు వీలుగా కాటేజీలు నిర్మించనున్నారు. 

అడ్వెంచర్‌ టూరిజానికీ.. 
బ్యాక్‌ వాటర్‌ టూరిజంతో పాటు అడ్వెంచర్‌ టూరిజం అభివృద్ధి చేసేందుకు ఐటీడీఏ ప్లాన్‌ సిద్ధం చేసింది. బోటింగ్‌తో పాటు జిప్‌లైనర్‌ ద్వారా బ్యాక్‌ వాటర్‌ నుంచి కొండల వైపునకు వెళ్లేలా సాహస విన్యాసాలకు ఏర్పాట్లు చేయనున్నారు.

ఆమోదం తెలిపిన సీఎం జగన్‌ 
కేరళకు బ్యాక్‌ వాటర్స్‌ టూరిజం ఎంత పేరు సంపాదించి పెట్టిందో.. అదే మాదిరిగా విశాఖ మన్యం అందాలకు సుజనకోట కూడా అంతే పేరు తీసుకొస్తుంది. ఇక్కడ ఉండే ప్రకృతి కేరళ కంటే వైభవంగా ఆకట్టుకుంటుంది. పర్యాటకులు రాత్రిపూట బ్యాక్‌ వాటర్‌లో సేదతీరేలా ప్రాజెక్టు రూపొందిస్తాం. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. అరకు వచ్చే పర్యాటకులు సుజనకోట చేరుకునేందుకు రైల్వే స్టేషన్‌తో పాటు రోడ్డు మార్గం కూడా 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం కలిసొస్తుందని భావిస్తున్నాం. పర్యాటక మన్యహారంగా తీర్చిదిద్దేందుకు అన్నిరకాల ప్రణాళికలు సిద్ధం చేశాం. 
– రోణంకి గోపాలకృష్ణ, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ 

Advertisement
Advertisement