తోటలో పెంచుకుంటున్న కోడిని దొంగిలిస్తావా?

23 Apr, 2022 11:09 IST|Sakshi
బాలుడిని విద్యుత్‌ స్తంభానికి కట్టేసి దాడి చేస్తున్న తోట యజమాని  

చిల్లకూరు (తిరుపతి): జీవాలు మేపుకునేందుకు వెళ్తున్న గిరిజన బాలుడు తన తోటలో ఉన్న కోడిని దొంగిలించాడన్న అనుమానంతో తోట యజమాని ఆ బాలుడిని నిర్బంధించి, విద్యుత్‌ స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం, కడివేడు పంచాయతీలో చోటుచేసుకుంది. పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లవరపుకండ్రిగకు చెందిన బుర్రి రామకృష్ణ అనే వ్యక్తికి పంచాయతీ పరిధిలోని రాజగోపాల్‌రెడ్డి గిరిజన కాలనీ సమీపంలో నిమ్మ తోట ఉంది. అదే కాలనీకి చెందిన తల్లిదండ్రులు లేని మైనర్‌ బాలుడు తన అన్న వెంకటేశ్వర్లుతో కలిసి మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో శుక్రవారం మేకలు మేపేందుకు వెళ్తున్న సమయంలో సమీపంలోని నిమ్మ తోట యజమాని బాలుడిని పట్టుకుని తన తోటలో పెంచుకుంటున్న కోడిని దొంగిలిస్తావా? అంటూ విద్యుత్‌ స్తంభానికి కట్టేసి కొట్టాడు. దెబ్బలకు తాళ లేక కేకలు వేయడంతో కాలనీలోని వారు గుర్తించి అక్కడికి వచ్చి యజమానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అలాగే గ్రామానికి చెందిన సాయికృష్ణ అనే వ్యక్తి అక్కడికి చేరుకుని నచ్చజెప్పి బాలుడిని విడిపించాడు. దీంతో బాలుడి సమీప బంధువులతో కలసి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

చదవండి: (తీవ్రంగా కొట్టి చచ్చిపో అంటున్నాడని.. ఇప్పుడే పెళ్లి వద్దని..)

మరిన్ని వార్తలు