Fact Check: గిరిజనులను గుండెల్లో పెట్టుకున్నారు!  

12 Feb, 2024 04:57 IST|Sakshi

అడవి బిడ్డలను ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

అయినా ఈనాడులో ‘పచ్చ’ కళ్ల రామోజీ అబద్ధపు రాతలు 

గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ కంటే అధిక ధరలు చెల్లింపు 

మద్దతు ధర నిర్ణయానికి అపెక్స్‌ కమిటీ ఏర్పాటు 

సాగు పెట్టుబడికి ప్రభుత్వ సాయంతోపాటు ముందస్తు రుణాలు 

అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్‌ 

ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ కోసం ప్రత్యేక చర్యలు 

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్షేమ పాలనపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈనాడు రామోజీ రోజుకో అబద్ధాన్ని వల్లెవేస్తూ గిరిజనుల సంక్షేమానికి అగ్రపాధాన్యమిచ్చిన వైస్సార్‌సీపీ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు.

అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తుల కోనుగోలులో రికార్డు సృష్టిస్తున్న గిరిజన సహకార సంస్థ(జీసీసీ) వైఎస్‌ జగన్‌ హయాంలో గిరిజనులకు అంతర్జాతీయ మార్కెట్‌ ధరల కంటే అధికంగా చెల్లిస్తున్నా కబోది రామోజీ ‘గుండెల్లో పెట్టుకుంటానని.. గుదిబండగా మారారు!’ అంటూ ఈనాడులో అబద్ధాలు అచ్చేశారు.

గిరిజన ఉత్పత్తులకు మద్దతు ధర కోసం ప్రత్యేకంగా అపెక్స్‌ కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా,  కమిటీ సిఫార్సులకు అనుగుణంగా కొనుగోళ్లు, అమ్మకాలు జరిగేలా జగన్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్‌ కల్పించడంతోపాటు ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిన జగన్‌ ప్రభుత్వం గిరిజన రైతులను ప్రోత్సహిస్తోంది.  

ఆరోపణ: ఆదాయం చూడడమే తప్ప ఆదుకోరా? 
వాస్తవం: కాఫీకి అంతర్జాతీయంగా చెల్లించే ధర కంటే ఎక్కువకు జీసీసీ కొనుగోలు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో ముడి కాఫీ రూ.215, చెర్రీ ముడి కాఫీకి రూ.130 చెల్లించేవారు. ఏజెన్సీలో పండించే కిలో ముడి కాఫీకి రూ.280, చెర్రీ ముడి కాఫీకి రూ.145 ఇస్తున్నారు. కొనుగోళ్ల సమయంలో కేంద్ర కాఫీ బోర్డు సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు.

నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పార్చ్‌మెంట్‌ కాఫీ 10, చెర్రీ కాఫీ 10.5 తేమతో కొనుగోలు చేసేలా నిర్ణయించారు. ప్రైవేటు వ్యాపారుల బారిన పడి గిరిజన రైతులు నష్టపోకుండా కొనుగోలు సిబ్బందికి జీసీసీ తేమ శాతం నిర్ధారణ పరికరాలు అందించింది. ఖచ్చితమైన తేమ శాతం నిర్ధారించి కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇచ్చింది.

ముడి కాఫీ కొనుగోలు రిపోర్ట్‌ను జీసీసీ మేనేజర్లు ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే గిరిజన రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో 1000 మెట్రిక్‌ టన్నుల ముడి కాఫీ సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా ఇంతవరకు 340 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. అకాల వర్షాలతో కాఫీ దిగుబడి తగ్గడం వల్ల గత సీజన్‌ కంటే ఈ ఏడాది కొనుగోలు తగ్గింది.  

ఆరోపణ: మిగిలిన వాటికి ‘మద్దతు’ కరువే? 
వాస్తవం: మిగిలిన ఉత్పత్తులకు జీసీసీ మద్దతు ధర ప్రకటించి జీసీసీ కొనుగోలు చేస్తోంది. ప్రస్తుత సీజన్‌లో జీసీసీ కిలో కరక్కాయలు రూ.15 నుంచి రూ.18, ఎండు ఉసిరి రూ.90, రాజ్మా రూ.90కి జీసీసీ కొనుగోలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధరల్లో పిక్క చింతపండు రూ.23 నుంచి రూ.28 మాత్రమే ఉంటే జీసీసీ పిక్క చింతపండు రూ.32 నుంచి రూ.40, పిక్క తీసిన చింతపండు రూ.63 ధర ప్రకటించి కొనుగోలు చేస్తోంది. 

ఆరోపణ: లాభాలే పరమావధా? 
వాస్తవం: ఏజెన్సీ కాఫీకి మంచి గుర్తింపు తెచ్చిన ‘అరకు వ్యాలీ కాఫీ’ పేరుతో జీసీసీ బ్రాండింగ్‌ చేస్తోంది. ఫిల్టర్‌ కాఫీ, ఇన్‌స్టంట్‌ కాఫీ రకాలను జీసీసీ నెట్‌వర్క్‌ ద్వారా విక్రయిస్తోంది. వీటి గరిష్ట రిటైల్‌ ధర నిర్ణయించే సమయంలో ముడి కాఫీ ధర, శుద్ధీకరణ, తయారీ, ప్యాకింగ్, రవాణా ఖర్చులు, డిస్ట్రిబ్యూటర్, రిటైల్‌ మార్ట్‌లను పరిగణనలోకి తీసుకుంటారు. ఇవేమీ తెలియనట్టుగానే వీటి అమ్మకాల ద్వారా జీసీసీ అధిక లాభాలు గడిస్తున్నట్టు ఈనాడు రోత రాతలు రాయడం దారుణం.

శ్రీశైలం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల అడవుల్లో గిరిజనుల నుంచి సేకరిస్తున్న తేనెను రాజమహేంద్రవరం, చిత్తూరులోని జీసీసీ తేనె శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసి ‘గిరిజన్‌‘ బ్రాండ్‌తో మార్కెటింగ్‌ చేస్తోంది. కేజీ తేనెను రూ.200 చెల్లించి కొనుగోలు చేస్తోంది. తేనెకు గరిష్ట రిటైల్‌ ధర నిర్ణయంలో ముడి తేనె ధర, శుద్ధీకరణ ఖర్చు, శుద్ధికరణలో తరుగుదల, బాట్లింగ్, ప్యాకింగ్, రవాణా ఖర్చులు, డిస్ట్రిబ్యూటర్, రీటైల్‌ మార్ట్‌లు, నాణ్యత ప్రమాణాల పరీక్షలకు అయ్యే ఖర్చులు పరిగణనలోకి తీసుకుని ధర నిర్ణయిస్తారు.

అయితే తేనే విక్రయాల్లో జీసీసీ లాభాలు గడిస్తున్నట్టు ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది. అలాగే ప్రైవేటు వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేసేలా జీసీసీ అనేక చర్యలు చేపట్టింది. మద్దతు ధర నిర్ణయించడం వల్ల ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి ఎక్కువ ధరకు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి.  

ఆరోపణ: రుణాలిచ్చింది 160 మందికే? 
వాస్తవం: గిరిజన రైతులకు పెట్టుబడి సాయం, యంత్ర పరికరాలు అందించి ప్రోత్సహిస్తున్నారు. దీనికితోడు జీసీసీ గిరిజన రైతుల వ్యవసాయానికి, కాఫీ సాగుకు రుణాలు మంజూరు చేస్తోంది. గతేడాది తీసుకున్న రుణాలు చెల్లించిన వారికి తిరిగి రుణాలు ఇస్తున్నారు.

2016–17 నుంచి 2022–23 వరకు జీసీసీ ద్వారా 4,839 మంది గిరిజన కాఫీ రైతులకు రూ.528.28 లక్షల రుణాలు ఇచ్చారు. వీటిలో ఇంకా రూ.252.86 లక్షల బకాయిలు వసూలు కావాల్సి ఉంది. ప్రస్తుత సీజన్‌లో రూ.22.80 లక్షల రుణాలు మంజూరు చేశారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega