కృష్ణాలో స్థిరంగా వరద.. శాంతించిన గోదావరి

28 Jul, 2021 02:45 IST|Sakshi
శ్రీశైలం వద్ద 876 అడుగులకు చేరిన నీటిమట్టం

శ్రీశైలంలోకి 3.98 లక్షల క్యూసెక్కులు రాక 

మొదలైన జల విద్యుత్‌ ఉత్పత్తి 

ఆల్మట్టిలోకి పెరిగిన వరద 

కుడి గట్టు కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి కృష్ణా బోర్డు అనుమతి 

ప్రకాశం బ్యారేజీ నుంచి 20 వేల క్యూసెక్కులు సముద్రంలోకి.. 

‘ధవళేశ్వరం’ నుంచి 4.21 లక్షల క్యూసెక్కులు విడుదల  

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌/ధవళేశ్వరం: కృష్ణా నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతుండగా.. గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.98 లక్షల క్యూసెక్కుల ప్రవాహ జలాలు చేరుతున్నాయి. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్‌ దిగువకు 35,315 క్యూసెక్కులు విడుదల చేస్తోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో కుడి గట్టు కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలన్న ఏపీ సర్కార్‌ ప్రతిపాదనను కృష్ణా బోర్డు ఆమోదించింది.

శ్రీశైలం ప్రాజెక్టు సీఈ మురళీనాథ్‌రెడ్డి సూచనల మేరకు మంగళవారం రాత్రి నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తిని మొదలుపెట్టామని విద్యుత్‌ కేంద్రం సీఈ సుధీర్‌ తెలిపారు. ప్రస్తుతం శ్రీశైలంలో 876.89 అడుగుల్లో 172.66 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లో నీటి మట్టం 539.7 అడుగులకు పెరిగింది. నీటి నిల్వ 187.70 టీఎంసీలకు చేరుకుంది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో మంగళవారం భారీ వర్షాలు కురవడంతో ఎగువన ఆల్మట్టిలోకి కృష్ణా వరద ప్రవాహం 3.92 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. తుంగభద్రలోనూ వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టులో తెలంగాణ సర్కార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న నీటికి కట్టలేరు, వైరా, మున్నేరు వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 26,011 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 5,977 క్యూసెక్కులను విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 20,034 క్యూసెక్కులను 27 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

పోలవరం వద్దకు 2.65 లక్షల క్యూసెక్కులు
గోదావరిలో వరద మంగళవారం మరింత తగ్గింది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 2,65,670 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో 42 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. స్పిల్‌ వేకు ఎగువన వరద నీటి మట్టం 30.32 మీటర్లకు తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,32,010 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. గోదావరి డెల్టా కాలువలకు 10,500 క్యూసెక్కులు వదలి.. మిగులుగా ఉన్న 4,21,510 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

మరిన్ని వార్తలు