రామోజీ రాసిందే రశీదు!  | Sakshi
Sakshi News home page

రామోజీ రాసిందే రశీదు! 

Published Thu, Jun 22 2023 3:27 AM

Illegal collection of deposits in the name of surety - Sakshi

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ తమ సంస్థలో చిట్టీపాట పాడిన చందాదారులకు ఆ చిట్టీ మొత్తాన్ని చెల్లించకుండా కొంత మొత్తాన్ని తమ వద్ద డిపాజిట్‌గా ఉంచుకుంటోంది. ఈమేరకు ఓ రశీదు ఇస్తోంది. ఆ చిట్టీకి సంబంధించి మిగిలిన చందాల చెల్లింపునకు ష్యూరిటీగా ఆ మొత్తాన్ని తమ వద్ద డిపాజిట్‌గా ఉంచుతున్నట్లు చెబుతోంది! అలా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు చందాదారుల నుంచి రశీదు రూపంలో డిపాజి ట్లను సేకరిస్తోంది.

ఆ డిపాజిట్లపై 4–5 శాతం వడ్డీ చెల్లిస్తామంటోంది. కొన్ని దశాబ్దాలుగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సాగిస్తున్న ఆర్థిక అక్రమాల దందా ఇదీ! చందాదారులు మునుముందు చెల్లించాల్సిన చందా మొత్తానికి ష్యూరిటీగా ఆ నగదును అట్టి పెట్టుకుంటున్నట్లు మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ తరపున రామోజీరావు తమ పత్రికలో ఈనాడు అడ్డగోలుగా వాదిస్తున్నారు. ఆర్థిక సంస్థల నిర్వహణకు సంబంధించి ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలను ఉల్లంఘిస్తున్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాటవేస్తున్నారు. 

అవి అక్రమ డిపాజిట్లే...
ఏదైనా ఓ ఆర్థిక సంస్థ తమ ఖాతాదారుల నగదును తమ వద్ద అట్టిపెట్టుకుని దానిపై వడ్డీ చెల్లిస్తామని లిఖితపూర్వకంగా తెలిపితే వాటిని డిపాజిట్లుగానే పరిగణిస్తారు. అలా డిపాజిట్లు సేకరించాలంటే ఆర్బీఐ నిబంధనలను అనుసరించాలి. ఆ నిబంధనల ప్రకారం చిట్‌ఫండ్స్‌ సంస్థలు డిపాజిట్లు వసూలు చేయకూడదు. మార్గదర్శి మాత్రం చిట్‌ఫండ్స్‌ రశీదు ముసుగులో డిపాజిట్లను సేకరిస్తోంది.

ష్యూరిటీగా నగదు డిపాజిట్లు తీసుకోకూడదు
చిట్‌ఫండ్స్‌ సంస్థలు తమ వద్ద చిట్టీ పాడిన చందాదారుల నుంచి ష్యూరిటీ తీసుకునేందుకు కేంద్ర చిట్‌ ఫండ్స్‌ చట్టం అనుమతిస్తోంది. ఈమేరకు నిర్దిష్ట విధానాలను కూడా స్పష్టం చేసింది. జాతీయ / షెడ్యూల్డ్‌ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పత్రాలు, బంగారు ఆభరణాలు, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పత్రాలు, స్థిరాస్తి పత్రాలు, ముగ్గురు వ్యక్తుల హామీని ష్యూరిటీగా పరిగణించేందుకు అవకాశం ఉంది.

అంతేగానీ చిట్టీ పాట కింద తాము చెల్లించాల్సిన మొత్తంలోనే కొంత మొత్తాన్ని ష్యూరిటీగా అట్టిపెట్టుకోడానికి వీలులేదు. అలా కొంత మొత్తాన్ని చిట్‌ఫండ్‌ సంస్థలు తమ వద్ద ఉంచుకుంటే దాన్ని డిపాజిట్ల సేకరణగానే పరిగణిస్తారు. చిట్‌ఫండ్స్‌ సంస్థలు డిపాజిట్లను సేకరించడం చట్ట విరుద్ధం కాబట్టి అవి అక్రమ డిపాజిట్లే అవుతాయి. 

నల్లధనం దందానే...!
ష్యూరిటీ పేరుతో సేకరిస్తున్న డిపాజిట్లకు జారీ చేస్తున్న రశీదులో కూడా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. వాటిపై చందాదా రుడి పాన్‌ నంబరు పొందుపరచడం లేదు. చందాదారుల పాస్‌ పుస్తకంలో వారి బ్యాంకు ఖాతా వివరాలుగానీ ఆధార్‌ నంబరుగానీ ఉండటం లే దు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి సదరు వ్యక్తుల పాన్‌ కార్డ్, ఆధార్‌ నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆర్బీఐ స్పష్టం చేస్తోంది.

నల్లధనాన్ని అరికట్టేందుకు ఈమేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రశీదు రూపంలో అక్రమ డిపాజిట్ల ద్వారా భారీగా నల్లధనాన్ని చెలామణిలోకి తెస్తున్న ట్లు సీఐడీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అథారిటీ(ఈడీ)కి నివేదించారు. 

నా డిపాజిట్లు.. నా వడ్డీ!
దేశంలో బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ సంస్థలు తమ ఖాతాదారులకు చెల్లించాల్సిన వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు ఆర్‌బీఐ నిర్దిష్ట విధానాలను రూపొందించింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ మాత్రం రశీదు రూపంలో తమ చందాదారుల నుంచి వసూలు చేస్తున్న అక్రమ డిపాజిట్లకు వడ్డీ రేటును ఎలా నిర్ణయిస్తోందో ఆ రహస్యం రామోజీకే తెలియాలి! 6 నెలల నుంచి 12 నెలల వరకైతే 4 శాతం, ఏడాది పైబడితే 5 శాతం వడ్డీ చెల్లిస్తామని రశీదులో మార్గదర్శి పేర్కొంటోంది. వడ్డీ రేటును ఏ ప్రాతిపదికన నిర్ణయించారని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తే సమాధానం లేదు. 

అక్రమ డిపాజిట్ల కట్టడికే బీయూడీఎస్‌ చట్టం
దేశంలో వివిధ రూపాల్లో సాగుతున్న అక్రమ డిపాజిట్ల దందా కట్టడికి కేంద్ర ప్రభుత్వం 2019లో బ్యానింగ్‌ ఆఫ్‌ నాన్‌ రెగ్యులేటెడ్‌ డిపాజిట్‌ స్కీమ్స్‌( బీఎన్‌డీఎస్‌) చట్టాన్ని తెచ్చింది. ఆర్థిక సంస్థలు, చిట్‌ఫండ్స్‌ సంస్థలు, ఇతర సంస్థలు, వ్యక్తులు యథేచ్ఛగా వివిధ రూపాల్లో అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

నియంత్రణ లేని డిపాజిట్లపై కఠినంగా వ్యవహరించడమే కాకుండా వాటిని నిషేధించేందుకు చట్టం చేసింది. కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభు త్వం 2022లో మార్గదర్శకాలను జారీ చేసింది. సీఐడీ విభాగం ఆ చట్టం ప్రకారమే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమ డిపాజిట్లపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. దీంతో తమ బండారం బట్టబయలవుతోందని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ గగ్గోలు పెడుతోంది.  

రశీదుల ముసుగులో అక్రమ డిపాజిట్లు 
ఓ చందాదారుడి నుంచి రూ.2.20 లక్షలు డిపాజిట్‌ రూపంలో తీసుకున్న నగదుకు ప్రతిగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఇచ్చిన రశీదు ఇదీ! భవిష్యత్‌ చందాలకు సెక్యూరిటీ పేరుతో ఇలా దశాబ్దాలుగా అక్రమంగా డిపాజిట్లను సేకరి స్తోంది. ఆర్బీఐ నిబంధనలను లెక్క చేయకుండా, కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. – స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ,సీఐడీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ బాగోతం బట్టబయలైంది.

Advertisement
Advertisement