‘స్పందన’ ఫిర్యాదుతో అక్రమ మైనింగ్‌ బట్టబయలు | Sakshi
Sakshi News home page

‘స్పందన’ ఫిర్యాదుతో అక్రమ మైనింగ్‌ బట్టబయలు

Published Wed, Jun 21 2023 5:37 AM

Illegal mining exposed with Spandana complaint - Sakshi

సాక్షి, అమరావతి: స్పందనలో అందిన ఫిర్యాదు ఆధా­రంగా నిర్వహించిన తనిఖీల్లో శ్రీపొట్టి శ్రీ­రాములు నెల్లూరు జిల్లాలో రూ.వందల కోట్ల విలు­వైన అక్రమ మైనింగ్‌ వ్యవహారం బట్టబ­య­లైంది. రోడ్డు మెటల్‌ తవ్వకాల కోసం లీజుకున్న తీసుకున్న భూమిలో స్టోన్‌ క్రషర్, వే బ్రిడ్జిలు, క్వార్టర్లు నిర్మించడంతోపాటు పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేశారు. ఒక్క టన్ను మెటల్‌ తవ్వకున్నా తవ్వినట్లుగా స్థానిక మైనింగ్‌ అధికారులు పర్మిట్లు జారీ చేసేశారు.

చుట్టుపక్కల గడువు ముగిసిన లీజు ప్రాంతాల్లో యధేచ్చగా తవ్వకాలు జరిపారు. రాఘవేంద్ర, గురు రాఘవేంద్ర స్టోన్‌ క్రషర్స్‌ దాదాపు 12 లక్షల క్యూబిక్‌ మీటర్ల రోడ్‌ మెటల్‌ను అక్రమంగా తవ్వి భారీగా సొమ్ము చేసుకున్నట్లు తేలింది. వీటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.200 కోట్లు కాగా మార్కెట్‌ విలువ రూ.600 కోట్లకు పైమాటే ఉంది. 

ప్రత్యేక బృందం తనిఖీలు 
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం గట్టుపల్లి, అన్నవరంలో రోడ్డు మెటల్‌ తవ్వ­కాలు అక్రమంగా జరుగుతున్నట్లు గత నెలలో కలె­క్టరేట్‌కు స్పందన ద్వారా ఫిర్యాదు అందింది. స్థాని­క­ంగా రెండు గ్రామాల్లో తవ్వకాలపై ఫిర్యా­దులు వెల్లు­­వెత్తడంతో నిగ్గు తేల్చేందుకు మైనింగ్‌ శాఖా­ధి­కా­రులు ప్రతాప్‌రెడ్డి, రామకృష్ణప్రసాద్, శివ­పార్వతి, గోవిందరావు, షేక్‌ అబ్దుల్లా సభ్యులుగా మైనింగ్‌ శాఖ ఒక ప్రత్యేక బృందాన్ని నియమించింది. వారం రోజులపాటు విస్తృతంగా తనిఖీలు 
జరి­పిన బృందం అక్రమాలు నిజమేనని తేల్చింది. ఈ­మేరకు మైనింగ్‌ శాఖ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించింది. 

జలదంకి మండలం గట్టుపల్లిలో సర్వే నెంబర్‌ 10, 15లో గురు రాఘవేంద్ర స్టోన్‌ క్రషర్స్‌కు 9.8 ఎకరాలను రోడ్‌ మెటల్‌ తవ్వకాల కోసం 2008లో మైనింగ్‌ శాఖ లీజుకిచ్చింది. అయితే ఆ భూమిలో తవ్వకాలు జరపకుండా స్టోన్‌ క్రషర్‌ యూనిట్‌ ఏర్పాటు చేశారు.

పెట్రోల్‌ బంకులు, వే బ్రిడ్జిలు, సర్వెంట్‌ క్వార్టర్లను నిర్మించారు. ఒక్క టన్ను ఖనిజం తవ్వకపోయినా మైనింగ్‌ అధి­కారులు 28 వేల క్యూబిక్‌ మీటర్ల రోడ్‌ మెటల్‌ను తవ్వినట్లు పర్మిట్లు జారీ చేయడం గమ­నార్హం. ఇతర ప్రాంతాల్లో తవ్విన ఖనిజం కోసం ఈ పర్మిట్లు ఉపయోగించారు. లీజు ప్రాంతాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసినట్లు స్పష్ట­మైంది. వేరే చోట తవ్విన 700 క్యూబిక్‌ మీటర్ల­కుపైగా రోడ్‌ మెటల్‌ను అక్కడ నిల్వ చేశారు. 

 జలదంకి మండలం అన్నవరం గ్రామం 851 సర్వే నెంబర్‌లో రాఘవేంద్ర స్టోన్‌ క్రషర్స్‌ లీజు గడువు ముగిసిపోయినా తవ్వకాలు నిర్వహిస్తోంది. అక్కడ సుమారు 5 లక్షలకుపైగా క్యూబిక్‌ మీటర్ల రోడ్డు మెటల్‌ను అక్రమంగా తవ్వినట్లు తేల్చారు. అదే గ్రామంలో కొండారెడ్డి, సుగు­ణమ్మ, చంద్రశేఖర్‌రెడ్డి పేర్లతో గతంలో పలు రోడ్డు మెటల్‌ లీజులున్నాయి. వాటి లీజు గడువు ఎప్పుడో ముగిసిపోయింది.

అయితే వాటిలో పాగా వేసిన గురు రాఘవేంద్ర కంపెనీ అందులో కూడా యథేచ్చగా తవ్వకాలు జరిపింది. సుమారు 7 లక్షల క్యుబిక్‌ మీటర్ల రోడ్‌ మెటల్‌ను తవ్వినట్లు తనిఖీ బృందం నిర్థారించింది. మొత్తం 12 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర అక్రమ తవ్వకాలు జరిపినట్లు తేలింది. అన్నవరంలో అక్రమంగా తవ్విన రోడ్డు మెటల్‌ను గట్టుపల్లిలో ఏర్పాటు చేసిన క్రషర్‌కి తరలించి విక్రయించారు. ఈ అక్రమ తవ్వకాల మొత్తం విలువ రూ.140 కోట్లుగా తనిఖీ బృందం నివేదిక సమర్పించింది.

అయితే స్టోన్‌ క్రషింగ్‌ యూని­ట్‌ను తాము పెద్దగా వినియోగించలేదని రాఘ­వేంద్ర స్టోన్‌ క్రషర్స్‌ యాజమాన్యం వాదించింది. దీంతో ట్రాన్స్‌కో నుంచి విద్యుత్తు వినియోగం లెక్కలు సేకరించగా 89 లక్షల యూనిట్లు వాడి­నట్లు తేలింది. ఒక టన్ను ఖనిజం ఉత్పత్తికి 2.5 యూనిట్లు వినియోగం అవుతుంది. ఈ లెక్కన రూ.200 కోట్ల మేర ఆ యూనిట్‌లో రోడ్డు మెటల్‌ను ప్రాసెస్‌ చేసినట్లు తేలింది. రాఘవేంద్ర, గురు రాఘవేంద్ర స్టోన్‌ క్రషర్స్‌ సంస్థలు అక్రమ తవ్వకాలు నిర్వహించినట్లు స్థానిక రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థాని­కులు స్టేట్‌మెంట్లు ఇచ్చారు.

Advertisement
Advertisement