ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమృద్ధిగా ‘నైరుతి’ వానలు | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమృద్ధిగా ‘నైరుతి’ వానలు

Published Tue, Apr 16 2024 5:45 AM

Impact of Southwest Monsoon in Andhra Pradesh - Sakshi

ఐఎండీ అంచనాల్లో వెల్లడి  

చల్లటి కబురు చెప్పిన వాతావరణ విభాగం

ఈ ఏడాది పంటలకు మరింత మేలు  

సాక్షి, విశాఖపట్నం: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంపై ఐఎండీ సోమవారం ముందస్తు అంచనాలను విడుదల చేసింది. రాష్ట్రంలో సాధారణానికి మించి అధికంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఎండలు, వడగాడ్పులతో అల్లాడుతున్న ప్రజలకు ఐఎండీ చెప్పిన కబురు ఉపశమనం కలిగించింది. గత ఏడాది ఎల్‌నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో అరకొర వర్షాలే కురిశాయి. ఫలితంగా పంటలు దెబ్బతిన్నాయి. రానున్న నైరుతి సీజన్‌లో రాష్ట్రంలో సాధారణంకంటే అధిక వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ ఎస్‌.స్టెల్లా తెలిపారు. ఈ వానలు పంటలకు ఎంతో మేలు చేయనున్నాయి. అన్నదాతలకు ఊరట ఇవ్వనున్నాయి.  

నైరుతి రాకపై మే నెలలో స్పష్టత  
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగమనం ఎప్పుడనే విషయమై మే నెల మధ్య నాటికి స్పష్టత రానుంది. సాధారణంగా జూన్‌ ఒకటో తేదీ నాటికి ఈ రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. గత ఏడాది ఎనిమిది రోజులు ఆలస్యంగా జూన్‌ ఎనిమిదిన కేరళను తాకాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాలకు నెమ్మదిగా విస్తరించాయి. దీంతో వర్షాలు సకాలంలో కురవకపోవడమే కాదు.. సమృద్ధిగాను కురవలేదు.  

కొనసాగుతున్న వడగాడ్పులు  
రాష్ట్రంలో వడగాడ్పులు కొనసాగుతున్నాయి. పలు­చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 40–44 డిగ్రీల వరకు నమోదయ్యాయి. 38 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 75 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. రానున్న మూడురోజులు ఇవి మరింతగా  ప్రభావం చూపనున్నాయి. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలున్నాయి. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 43.9 డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 43.3, అల్లూరి జిల్లా ఎర్రంపేటలో 43.1, పల్నాడు జిల్లా మాచెర్ల, విజయనగరం జిల్లా రాజాంలలో 42.8, అనకాపల్లి జిల్లా గాదిరాయిలో 42.7 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మంగళవారం 63 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 130 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలో 22, శ్రీకాకుళం 15, పార్వతీపురం మన్యం 13, అనకాపల్లి 4, అల్లూరి సీతారామరాజు 3, కాకినాడ 3, తూర్పు గోదావరి 2,  ఏలూరు జిల్లాలో ఒక మండలంలో తీవ్ర వడగాడ్పులు వీస్తాయి. తూర్పు గోదావరి జిల్లాలో 17, కాకినాడ 16, శ్రీకాకుళం జిల్లాలో 14, ఏలూరు 13, అనకాపల్లి 12, అల్లూరి సీతారామరాజు 11, కోనసీమ 9, కృష్ణా 7, ఎనీ్టఆర్‌ 7, గుంటూరు 7, విజయనగరం 5, పల్నాడు 4, విశాఖపట్నం 3, పశ్చిమ గోదావరి 3,  పార్వతీపురం మన్యం జిల్లాలో 2 మండలాల్లో  వడగాడ్పులు వీయనున్నాయి. బుధవారం 38 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 135 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణసంస్థ తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement