ఆర్గానిక్‌ మహోత్సవ్‌ అదిరింది | Sakshi
Sakshi News home page

ఆర్గానిక్‌ మహోత్సవ్‌ అదిరింది

Published Mon, Jun 5 2023 3:50 AM

Impressive organic produce stalls in Organic Mahotsav - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆర్గానిక్‌ మహోత్సవ్‌లో రూ.140 కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదిరాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు నగరంలోని గాదిరాజు ప్యాలెస్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ సంయుక్తంగా ఈ భారీ మేళాను నిర్వహించాయి.

రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో రాష్ట్రంలో తొలిసారిగా దీనిని ఏర్పాటు చేశారు.

ఈ మేళాలో సేంద్రియ విధానంలో పండించిన వరి, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, బెల్లం, మామిడి పండ్లు, తేనె తదితర సేంద్రియ సహజ ఉత్పత్తులను 123 స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచారు. ప్రత్యేకంగా ఒక ఆర్గానిక్‌ ఫుడ్‌ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. సందర్శకులు వివిధ సేంద్రియ వంటకాలను ఆరగించి సంతృప్తి చెందారు.  

బహుళజాతి సంస్థల ప్రతినిధులు రాక 
దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు సింగపూర్‌ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్, బహుళజాతి సంస్థల ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు ప్రతినిధులు, చిరుధాన్యాల ఉత్పత్తి, సాగుదారులు, కొనుగోలుదారులు భారీగా హాజరయ్యారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహించారు. ఈ మేళాకు మూడు రోజుల్లో 22 వేల మందికి పైగా సందర్శకులు వచ్చారు.

12కు పైగా సంస్థలు రైతుల తరఫున రైతు సాధికార సంస్థతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి. వీటిలో బెంగళూరుకు చెందిన ఫలద ఆగ్రో ప్యూర్‌ అండ్‌ ష్యూర్‌ సంస్థ రూ.90 కోట్లు, సాగ్లిష్‌ హార్వెస్ట్‌ రూ.10 కోట్లు, సింగపూర్‌కు చెందిన జీఎన్‌ ఆర్గానిక్‌ రూ.10 కోట్లతో పాటు ఈ–మిల్లెట్స్, స్వచ్ఛ మిల్లెట్స్, బిగ్‌ బాస్కెట్, గాట్‌ కాటన్‌ తదితర సంస్థలు వెరసి రూ.140 కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు చేసుకున్నాయి.

ప్రకృతి వ్యవసాయ రైతులతో ప్రతినెలా ఉత్పత్తుల కొనుగోలుకు ముందుకొచ్చాయి. జీవనశైలి వ్యాధులకు దూరంగా ఉండాలంటే జీవన విధానం మార్చాలనే ఇతివృత్తంతో సేంద్రియ పంటలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆర్గానిక్‌ మహోత్సవ్‌ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. ఆర్గానిక్‌ మేళాకు హాజరైన ఆయా సంస్థల ప్రతినిధులకు నిర్వాహకులు సరి్టఫికెట్లు అందజేశారని రైతు సాధికార సంస్థ సీనియర్‌ థిమాటిక్‌ లీడ్‌ ప్రభాకర్‌ ‘సాక్షి’కి తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement