ఔషధాల ధరల పెంపు | Sakshi
Sakshi News home page

ఔషధాల ధరల పెంపు

Published Fri, Apr 1 2022 4:55 AM

Increase in drug prices - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వివిధ రకాల ఔషధాల ధరలను కేంద్రం పెంచింది. ఈ మేరకు 872 రకాల మందుల ధరలను సవరిస్తూ గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. దీంతో కోట్లాది మందిపై భారం పడనుంది. గతంలో ఈ మందులన్నీ నిర్ణయించిన ధరకే అమ్మాలని (ప్రైస్‌ సీలింగ్‌) ఎన్‌పీపీఏ (నేషనల్‌ ఫార్మ ప్రైజింగ్‌ అథారిటీ) నిర్ణయించింది. తాజాగా.. ఎన్‌పీపీఏ ఈ 872 రకాల మందులకు 10 శాతం మేర రేట్లు పెంచుకోవచ్చని అనుమతిచ్చింది. పెంచిన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 

వీటి ధరలు పెరగనున్నాయి..
ఇక తాజాగా రేట్లు పెంచిన ఔషధాల్లో నిత్యం కోట్లాది మంది వాడే పారాసిటమాల్‌ (జ్వరం), మెట్‌ఫార్మిన్‌ (షుగర్‌) ఇన్సులిన్‌ (షుగర్‌)కు వాడేవి ఉన్నాయి. ధరల పెంపుదలవల్ల కోట్లాది మంది నెలసరి ఖర్చు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక.. ఖరీదైన యాంటిబయోటిక్స్‌ మందులపైనా భారం పడనుంది. 


ముడిసరుకు పెరిగిందని..
కరోనా మహమ్మారి దెబ్బకు మందుల్లో వాడే ముడిసరుకు ధరలు అమాంతం పెరిగాయని, దీనివల్ల రేట్లు పెంచక తప్పలేదని ఎన్‌పీపీఏ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎన్‌పీపీఏ పరిధిలోని 872 మందుల ధరలు పెంచామని, అంతకంటే ఎక్కువ వసూలు చేసినట్లయితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో హెచ్చరించింది. మరోవైపు.. ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఏటా 10 కోట్ల పారాసిటమాల్‌ మాత్రలు వినియోగమవుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేస్తోంది. పారాసిటమాల్‌ ధరలు పెరగడంతో ప్రభుత్వంపైనా భారం పడనుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement