ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు జరిమానాల పెంపు

22 Oct, 2020 03:21 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా కాంపౌండింగ్‌ ఫీజులు 

రోడ్‌ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాల మేరకు నిర్ణయం

రోడ్డు ప్రమాదాల తగ్గింపే లక్ష్యం 

వాహనాల తయారీ లోపాలుంటే రూ.లక్ష జరిమానా

సాక్షి, అమరావతి: కేంద్రప్రభుత్వ చట్టానికి అనుగుణంగా.. మోటారు వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘించేవారిపై జరిమానాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది మోటారు వాహనాల చట్టాన్ని సవరించిన కేంద్రం.. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించనివారి నుంచి కాంపౌండింగ్‌ ఫీజులు భారీగా వసూలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. రోడ్‌ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ సైతం కేంద్రం సూచనలకు అనుగుణంగానే రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించే ఉద్దేశంతో కేంద్రం, సుప్రీంకోర్టు కమిటీ సూచనల మేరకు రాష్ట్రంలో జరిమానాలు పెంచారు. ఈ పెంపు బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ద్విచక్ర వాహనం, క్యాబ్‌లు, ఆటోలు, ఏడుసీట్ల సామర్థ్యం ఉన్న తేలికపాటి మోటారు వాహనాలు ఒక విభాగంగాను, భారీ వాహనాలు మరో విభాగంగాను ప్రభుత్వం జరిమానాలను పెంచింది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల తయారీలో మార్పులు, చేర్పులు చేస్తే డీలర్లకు, తయారీ సంస్ధలకు, అమ్మినవారికి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. 

ఇవీ జరిమానాలు
► డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందే అర్హత లేనివారికి వాహనం ఇస్తే రూ.10 వేలు, నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే రూ.5 వేలు, వేగంగా నడిపితే రూ.వెయ్యి, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10 వేలు.
► రేసింగ్‌ చేస్తూ మొదటిసారి పట్టుబడితే రూ.5 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.10 వేలు.
► రిజిస్ట్రేషన్, రెన్యువల్‌ లేకున్నా, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకున్నా మొదటిసారి రూ.2 వేలు, రెండోసారి రూ.5 వేలు. అదే భారీ వాహనాలకు మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.8 వేలు. పర్మిట్లేని వాహనాలు వాడితే రూ.10 వేలు.
► వాహనంతో అనధికారికంగా ప్రవేశిస్తే రెండు కేటగిరీలకు రూ.వెయ్యి.
► వాహనాల తనిఖీ విధులకు ఆటంకం కలిగించినా, సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా రూ.750, భారీ వాహనాలకు రూ.వెయ్యి.  అనుమతి లేని, అర్హతకంటే తక్కువ వయసు వారికి వాహనం ఇస్తే రెండు కేటగిరీలకు రూ.5 వేలు.  
► ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు, ఆపై టన్నుకు రూ.2 వేలు అదనం. వాహనం బరువు చెకింగ్‌ కోసం ఆపకపోతే రూ.40 వేలు. ఎమర్జెన్సీ (అంబులెన్స్‌లు, ఫైర్‌ సర్వీసులు) వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10 వేలు. 
► అనవసరంగా హారన్‌ మోగిస్తే మొదటిసారి రూ.వెయ్యి, రెండోసారి రూ.2 వేలు. రోడ్‌ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినా, శబ్ద, వాయు కాలుష్యం నియంత్రించకపోయినా తేలికపాటి వాహనాలకు రూ.1,500, భారీ వాహనాలకు రూ.3 వేలు.
► బీమాపత్రం లేకపోతే 2 కేటగిరీలకు మొదటిసారి రూ.2 వేలు, రెండోసారి రూ.4 వేలు. పబ్లిక్‌ లయబిలిటీ సర్టిఫికెట్‌ లేకపోతే మొదటిసారి రూ.2 వేలు, రెండోసారి రూ.4 వేలు. 

మరిన్ని వార్తలు