పీటీ వారెంట్‌పై విచారణను నిరోధించలేం | Sakshi
Sakshi News home page

పీటీ వారెంట్‌పై విచారణను నిరోధించలేం

Published Thu, Oct 5 2023 4:05 AM

The investigation cannot be prevented on a PT warrant - Sakshi

సాక్షి, అమరావతి: ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో జరిగిన ఆర్థిక అక్రమాలపై నమోదు చేసిన కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌పై విచారణ జరపకుండా ఏసీబీ కోర్టును నిరోధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే నిరాకరించిన విషయాన్ని సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌తో పాటు సీఐడీ దాఖలు చేసిన పోలీసు కస్టడీ పిటిషన్‌పై కూడా వాదనలు కొనసాగుతున్నాయని ఏజీ వివరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వొద్దని అభ్యర్థించారు. దీనికి హైకోర్టు స్పందిస్తూ.. గురువారం ఉదయం నుంచే చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వింటామని తెలిపింది.

ఇరుపక్షాలూ ఆరోజే వాదనలు పూర్తి చేయాలని స్పష్టం చేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కంచిరెడ్డి సురేష్‌ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో అక్రమాలపై నమోదు చేసిన కేసులో సీఐడీ చంద్రబాబును 25వ నిందితునిగా చేర్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ సురేష్‌ రెడ్డి బుధవారం మరోసారి విచారణ జరిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ ఎండీ తరఫున తాను న్యాయవాదిగా ఉన్నప్పుడు వాదనలు వినిపించానని, అందువల్ల ఈ కేసును విచారించడంపై ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలని ఇరుపక్షాల న్యాయవాదులను కోరారు.

తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబు న్యాయవాదులు స్పష్టంగా చెప్పడంతో విచారణ కొనసాగించారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ అగర్వాల్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలకు, వాటిలో లోటుపాట్లకు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును బాధ్యుడిగా చేయడానికి వీల్లేదన్నారు. టెరాసాఫ్ట్‌ సంస్థకు టెండర్‌ ఖరారు చేసిన కమిటీలో, పనులు అప్పగించిన కమిటీలో చంద్రబాబు సభ్యుడు కాదన్నారు. సీఐడీ 2021లో కేసు నమోదు చేసి, ఇన్నాళ్లూ మౌనంగా ఉందన్నారు. ఏనాడూ చంద్రబాబుకు నోటీసు ఇవ్వలేదని, మొన్నటి వరకు నిందితునిగా కూడా చేర్చలేదని తెలిపారు. అకస్మాత్తుగా ఆయన్ని 25వ నిందితునిగా చేర్చా­రని తెలిపారు.

తమ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం వెలువరించేంత వరకు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరపకుండా ఉత్తర్వులివ్వాలని కోరారు. అగర్వాల్‌ అభ్యర్థనపై ఏజీ శ్రీరామ్‌ అభ్యంతరం తెలిపారు. సుప్రీంకోర్టును సైతం ఇదే రకమైన కోరిక కోరారని, అందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందని ఏజీ చెప్పారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరారు. ఏసీబీ కోర్టులో బెయిల్, పోలీసు కస్టడీ పిటిషన్లపై విచారణ ముగిసిందా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. లేదని శ్రీరామ్‌ తెలిపారు. ఏజీ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పీటీ వారెంట్‌ విషయంలో ఏసీబీ కోర్టును నిరోధిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement