జోరుగా ఇంటింటి సర్వే | Sakshi
Sakshi News home page

జోరుగా ఇంటింటి సర్వే

Published Sun, Sep 24 2023 4:24 AM

Jagananna Arogya Suraksha intinti Survey - Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వే ద్వారా పౌరులకు ఆరోగ్య పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే 28.87 లక్షల మంది పౌరులకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 16వ తేదీన కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్, ఏఎన్‌ఎంలు ఇంటింటికి వెళ్లి ఆ ఇంట్లో వారికి ఆరోగ్య పరీక్షలు చేయడం ప్రారంభించారు.

కేవలం నాలుగు రోజుల్లోనే అంటే ఈ నెల 19వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం 37,81,418 ఇళ్లలో సర్వే నిర్వహించారు. ఇందులో గ్రామాల్లో 18.28 లక్షల ఇళ్లు, పట్టణాల్లో 19.28 లక్షల ఇళ్లలో సర్వేను పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వే, ఆరోగ్య పరీక్షల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.

సర్వేను రోజు వారీగా పర్యవేక్షించడం ద్వారా మొత్తం కుటుంబాల్లో సర్వే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పౌరులకు ఆరోగ్య పరీక్షల తీరును రోజువారీ పర్యవేక్షించాలని సూచించారు. ఈ నెల 30వ తేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్న నేపథ్యంలో స్పెషలిస్ట్‌ డాక్టర్ల మ్యాపింగ్‌ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎస్‌ దిశా నిర్దేశం చేసిన అంశాలు ఇలా ఉన్నాయి. 

ఏర్పాట్లు బాగుండాలి 
ఆరోగ్య శిబిరాల వద్ద ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేదా అనే విషయాలను నిర్దారించుకోవడానికి ఈ నెల 25న మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలి. ఇంటింటి సర్వేపై వలంటీర్లు ఈ నెల 27వ తేదీన రెండవసారి సందర్శించేలా చర్యలు తీసుకోవాలి.  
ఇంటింటి సర్వే నాణ్యతతో నిర్వహించడంపై పర్యవేక్షణకు తగిన సిబ్బందిని నియమించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో పీహెచ్‌సీ పరిధిలో నలుగురు పర్యవేక్షణ సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. మూడు, నాలుగు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు ఒక్కో పర్యవేక్షకున్ని, పట్టణ పరిధిలో నాలుగైదు పీహెచ్‌సీలకు ఒక పర్యవేక్షకుడిని నియమించాలి. ఇందుకోసం మల్టీపర్పస్‌ హెల్త్‌ సూపర్‌ వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, రెవెన్యూ అసిస్టెంట్లను వినియోగించుకోవాలి.  
ఈ నెల 30న ఆరోగ్య శిబిరాల్లో అవసరమైన చికిత్సలు, మందులు అందించేందుకు అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలి. ఆరోగ్య శిబిరాల్లో 162 రకాల మందులు, 18 శస్త్రచికిత్స వినియోగ వస్తువులు, 14 రకాల ఎమర్జెన్సీ కిట్స్‌ అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య  శిబిరాలకు పీహెచ్‌సీలోని ఇద్దరు డాక్టర్లు, ఫ్యామిలీ డాక్టర్, ఇతర సిబ్బందితో పాటు స్పెషలిస్ట్‌ డాక్టర్లు హాజరు కానున్నారు. 

Advertisement
Advertisement