Sakshi News home page

19 నుంచి జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు 

Published Mon, Nov 14 2022 5:41 AM

Jagananna Swarnotsava cultural celebrations from 19th November - Sakshi

తిరుపతి అర్బన్‌: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి వారితో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు జరపబోతున్నట్లు మంత్రి ఆర్కే రోజా చెప్పారు. సంబరాల్లో భాగంగా క్రీడల పోటీలను జోనల్, రాష్ట్ర స్థాయిల్లో జరపబోతున్నట్లు చెప్పారు. తిరుపతిలోని ఓ హోటల్‌లో ఆదివారం ఆమె సంబరాల పోస్టర్లను ఆవిష్కరించారు.

తిరుపతి జోన్‌ కళాకారులకు మహతి కళాక్షేత్రంలో నవంబర్‌ 19, 20, 21 తేదీల్లో, గుంటూరు జోన్‌ వారికి 24, 25, 26 తేదీల్లో శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో, రాజమండ్రి జోన్‌ వారికి 29, 30, డిసెంబర్‌ 1 తేదీల్లో శ్రీవేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో పోటీలు నిర్వహిస్తామన్నారు. విశాఖ జోన్‌ వారికి డిసెంబర్‌ 7,8,9 తేదీల్లో ఉడా చిల్డ్రన్స్‌ థియేటర్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్‌ 19, 20 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తామని తెలిపారు.

కూచిపూడి, ఆంధ్ర నాట్యం, భరత నాట్యం, జానపద కళారూపాలు తదితర కళా రంగాల్లో జోనల్, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తామని, ప్రతి విభాగంలో జోనల్‌ స్థాయి విజేతల గ్రూప్‌నకు రూ.25 వేలు, సోలో కి రూ.10 వేలు, రాష్ట్ర స్థాయి విజేతలకు గ్రూప్‌నకు రూ.లక్ష, సోలోకి రూ.50 వేలను సీఎం జన్మదినం రోజున అందజేస్తామన్నారు. ఆసక్తి గలవారు  https://culture.ap.gov.in/  వెబ్‌సైట్‌లో పేర్లను ఈ నెల 15 లోపు నమోదు చేసుకోవాలని కోరారు.  

Advertisement
Advertisement