తూర్పు తీరం ఆడపడుచులు | Sakshi
Sakshi News home page

తూర్పు తీరం ఆడపడుచులు

Published Wed, Apr 12 2023 2:59 AM

Kakinada coast is the breeding center of olive ridley turtles - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: పుట్టింటిపై మమకారం మగ పిల్లలతో పోలిస్తే ఆడ పిల్లలకు మరింత ఎక్కువే. పెళ్లి చేసు­కుని అత్తారింటికి వెళ్లిపోయినా.. పుట్టిం­టిపై మమకారం వారిలో చెక్కు చెదరదు. నోరులేని మూగజీవాలకు కూడా జన్మస్థలంపై అంతటి మమ­కారం ఉంటుందంటే ఆశ్చర్యమే. సైబీ­రియా పక్షుల మాదిరిగా కేవలం సంతానోత్పత్తి కోసమే ఎన్ని వేల కిలోమీ­టర్ల దూరమైనా ప్రయా­ణించి  పుట్టింటికి వస్తాయి ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు.

పుట్టిన కొద్ది రోజులకే సముద్రంలో ఎంతో దూరం వెళ్లిపోయే ఈ తాబేళ్లు పదేళ్ల తరు­వాత సంతా­నోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ఈదు­కుంటూ.. తాము పుట్టిన ప్రాంతానికే చేరుకుంటాయి. ఇలా రాగల­గటం వాటి జ్ఞాపక శక్తికి నిద­ర్శన­మంటారు. ఆలివ్‌ రిడ్లే శాస్త్రీ­య నామం‘లెపి­డోచె­లిస్‌ ఒలి­వేసియా’.గ్రీన్‌ టర్టి­ల్, లెదర్‌ బ్యాగ్, గ్రీన్‌సీ టర్టిల్, హాక్‌చి­ల్‌సీ వంటి జాతుల తాబేళ్లు ఉన్నప్పటికీ ఆలివ్‌ రిడ్లే రకం తాబేళ్లు తూర్పు తీరానికి ఎక్కువగా వస్తున్నాయి. 

ఆ మూల నుంచి.. ఈ మూల వరకు
ఒడిశాలోని బీతర్కానిక తీరం నుంచి.. తమిళనాడు సరిహద్దులోని తడ వరకు విస్తరించి ఉన్న సముద్ర తీరం వరకు ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు సంతానోత్పత్తి కోసం వస్తుంటాయి. అందులోనూ కాకినాడ తీరానికే వీటి రాక అధికం. ఇసుక, నీరు తేటగా ఉండటంతోపాటు 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలపై ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు ఆసక్తి చూపు­తాయి. వివిధ సముద్రాల్లో ఉండే ఈ తాబేళ్లు సంపర్కం కోసం ఏటా నవంబర్, డిసెంబర్‌ నెలల్లో బంగాళాఖాతంలోకి చేరుతాయి. ఆ తరువా­త ఆడ తాబేళ్లు మాత్రమే గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తాయి.

జనవరి రెండోవారం నుంచి ఏప్రిల్‌ మొదటివారం వరకు ఇవి గుడ్లు పెట్టే సీజన్‌. ఈ తాబేళ్లు జీవితమంతా సముద్రంలోనే గడు­పుతాయి.గుడ్లు పెట్టడానికి మాత్రం భూమి మీదకు వస్తాయి. నదులు సము­ద్రంలో కలిసే చోటు వీటి సంతానో­త్పత్తికి అనువుగా ఉంటుంది. తీరంలోని ఇసుకలో బొరియలు తవ్వి ఒక్కో తాబేలు 100 నుంచి 150 వరకు గుడ్లు పెడు­తున్నాయి. గుడ్లు పెట్టేశాక తల్లి సముద్రంలోకి వెళ్లిపో­తుంది. ఆ గుడ్లలోంచి 45–55 రోజుల్లో పిల్ల­లు బయట­కొస్తాయి. వీటిని ఏపీ ఆటవీ శాఖ సంరక్షిస్తోంది.

కళ్లు తెరిచిన పిల్లల­ను సూ­ర్యుడు ఉద­యించే వేళ అధికారులు సము­ద్రంలోకి విడిచిపెడుతు­న్నా­రు. వెలు­తురు అంటే ఇష్టపడే తాబేలు పిల్లలు సూర్యుడు ఉద­యించేట­ప్పుడు ఆ కిర­ణాలవైపు పరు­గులు తీస్తూ సము­ద్రంలో కలిసి­పోతాయి. ఈ ప్రక్రి­య నెల రోజులుగా కాకినాడ తీరంలో అటవీ రేంజర్‌ ఎస్‌.వరప్రసాద్‌ పర్యవేక్షణలో జరుగుతోంది. ఇప్ప­టికే 8వేల పిల్లల­ను సముద్రంలోకి విడిచి పెట్టారు.

సమతుల్యతలో కీలకం
కళ్లు తెరిచిన పిల్లలు సముద్రంలోకి వెళ్లిన పదేళ్లకు కౌమార దశకు వస్తాయి. సంపర్కం తరువాత తనకు జన్మనిచ్చిన తీరా­న్ని గుర్తుంచుకుని గుడ్లుపెట్టేందుకు తిరిగి అక్కడి­కే వస్తాయి. సముద్రం జలా­ల్లో వాతా­వరణ సమతుల్యతను పరి­రక్షించడంలో వీటి పాత్ర కీలకం. సము­ద్రంలో మత్స్య సంపదను మింగేస్తున్న జెల్లీ ఫిష్‌­లను ఆలివ్‌ రిడ్లేలు ఆహారంగా తీసు­కుంటాయి. మత్స్య సంపదకు రక్షణగా ఉండ­టం, సముద్ర జలాలలో కాలుష్యం నివా­రించి శుభ్రంగా ఉంచడంలో వీటి పాత్ర అమోఘం. 
– ఎస్‌.వరప్రసాద్, రేంజర్, కోరంగి అభయారణ్యం

మేధస్సులో ఆడ తాబేళ్లు దిట్ట
తెలివితేటల్లో ఆడ తాబేళ్లు దిట్ట. ఆడ తాబేళ్లు గుడ్లు పెట్టడానికి ముందు ఇసుక తేటగా.. చదునుగా.. అలికిడి లేని, సముద్ర అలలు తాకని ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటాయి. గుడ్లు పెట్టే ప్రాంతంలో 30 సెంటీమీటర్ల మేర గొయ్యి తవ్వి గుడ్లు పెట్టి.. ఇసుకతో కప్పేస్తాయి.

తవ్విన గోతిలో అడుగు భాగం (పునాది) గట్టిగా ఉండాలని శరీర బరువు (సుమారు 50 కేజీలు)తో అరగంట పాటు పైకి, కిందకు పడుతూ లేస్తూ  చదును చేసి గుడ్లు పెడతాయి. గుడ్లను శత్రుజీవులు గుర్తించకుండా చుట్టుపక్కల డమ్మీగా నాలుగైదు గోతుల్ని తవ్వి ఇసుకతో కప్పేస్తాయి. నక్కలు, కుక్కలు, కాకులకు గుడ్లు పెట్టిన ప్రాంతం తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ఆలివ్‌ రిడ్లే తెలివితేటలు అమోఘం.
 

Advertisement
Advertisement