Kalivi Kodi rarest bird in the world found in Lankamala Forests of Kadapa district - Sakshi
Sakshi News home page

లంకమల అడివిలో కానరాని కలివి కోడి..  ట్విక్‌–టూ.. ట్విక్‌–టూ అరుపులేవి!

Published Mon, Nov 21 2022 4:03 AM

Kalivi Kodi rarest bird in the world - Sakshi

వైఎస్సార్‌ జిల్లాలో ఓ వైపు శేషాచలం.. మరోవైపు నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. అదే జిల్లాలోని సిద్ధవటం–బద్వేలు ప్రాంత అడవిని ‘లంకమల’గా పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని ఓ పక్షి ‘ట్విక్‌–టూ.. ట్విక్‌–టూ’ అని అరుస్తోంది. ఎంత అన్వేషించినా దాని జాడ మాత్రం కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో పెరిగే కలివి పొదల్లో నివసించే ఈ నిశాచర పక్షిని ‘కలివి కోడి’ అని పిలుస్తున్నారు. ఈ పక్షి జాతి పూర్తిగా అంతరించిపోయిందని ప్రపంచం పక్షిశాస్త్ర నిపుణులు తేల్చేయగా.. ఇప్పటికీ సిద్ధవటం అటవీ ప్రాంతంలోని పొదల్లో ఇవి సజీవంగా ఉన్నాయని ఎస్వీ యూనివర్సిటీ బృందం చెబుతోంది. రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీతో కలివి కోడి జాడను కనిపెట్టవచ్చంటోంది. కలివికోడి ఆవాసం కోసం సిద్ధవటం ప్రాంతంలో సుమారు 3 వేల ఎకరాలను రూ.28 కోట్లతో సేకరించి 177 కెమెరాలతో పరిశోధకులు అన్వేషిస్తున్నారు. 

సాక్షి, అమరావతి: ‘కలివి కోడి’.. నిజానికి ఇది కోడి కాదు. కానీ.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి. రంగు రంగుల ఈకలు.. చిన్నపాటి ఆకారం.. వినసొంపైన కూతలతో ఆకట్టుకునే కలివి కోడి (జర్డాన్స్‌ కోర్సర్‌) సంక్షోభంలో పడింది. అత్యంత అరుదైన ఈ పక్షి అంతరించిపోతున్న జాతుల్లో మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రంలోని లంకమల అడవుల్లో తప్ప ప్రపంచంలో మరెక్కడా కలివి కోడి కనిపించదు. ఇది వందేళ్ల క్రితమే అంతరించిపోయిందని ప్రపంచ పక్షి శాస్త్రవేత్తలు భావించినా.. లంకమల అడవుల్లో ఇంకా సంచరిస్తూనే ఉందని అడపాదడపా వార్తలు వెలువడుతున్నాయి. వైఎస్సార్‌ జిల్లా రెడ్డిపల్లి ప్రాంతంలోని చిట్టడవుల్లో వీటి జాడ కనిపించడంతో ఆ ప్రాంతాన్ని లంకమల్లేశ్వర అభయారణ్యం పేరిట కలివికోడి నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది.  

రెండేళ్లపాటు శోధించినా.. 
కలివి కోళ్ల ఆచూకీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.50 కోట్లు ఖర్చు చేసి రెండేళ్లపాటు అలుపెరగని ప్రయత్నాలు జరిపినా ఫలితం కనిపించలేదని ఎస్వీ వర్సిటీ జువాలజీ విభాగానికి చెందిన మాణిక్యం తెలిపారు. అన్నీ కాలాలు, అన్ని ప్రాంతాల్లో శోధించి, పరిశోధనలు చేస్తే తప్ప కలివి కోడి పూర్తిగా అంతరించిందని చెప్పలేమంటున్నారు. లంకమల అభయారణ్యంలోని వీటి ఆవాసాలను పోలిన ఆవాసాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని సమగ్ర సర్వే చేస్తే ఈ పక్షి జాతిని గుర్తించే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ పక్షి కోసం అన్వేషణను కొనసాగించి.. వీటిని  పరిరక్షించడం అందరి బాధ్యతని పక్షి ప్రేమికులు చెబుతున్నారు.  

పదేళ్ల క్రితం కడపటి చూపు 
కలివి కోడిని 1848లో పెన్నా నది పరీవాహక ప్రాంతంలో థామస్‌ జర్డాన్స్‌ మొదటిసారి కనుగొన్నారు. 1985 జనవరి 5న అట్లూరు మండలం రెడ్డిపల్లె వాసి చిన్న ఐతన్నకు ఈ పక్షి కనిపించగా.. దాన్ని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. ఈ విషయం తెలిసి ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ వెంటనే వచ్చి ఆ పక్షిని పరిశీలించారు. 1998 నుంచి 2002 వరకు తిరుపతి ఎస్‌వీ విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర విభాగం పరిశోధకులు ప్రొఫెసర్‌ నందకుమార్, అమీర్‌బాషా, మారం రాజశేఖర్‌ బృందం దాదాపు 8 పక్షులను గుర్తించింది.

వీటి ఆవాసాన్ని రిమోట్‌ సెన్సింగ్‌ విధానంలో పరిశీలించి ఏ పరిసరాల్లో ఎక్కువగా ఉంటాయి, వాటి అభివృద్ధికి అక్కడ చేయాల్సిన మార్పులు ఏమిటనేది ఆ బృందం సూచించింది. ఆ తర్వాత 2002లో కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం, రాయల్‌ సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ బర్డ్స్‌ సహకారంతో బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ కలివి కోడి పాద ముద్రను, కూతను నమోదు చేసింది. ఈ పక్షి ‘ట్విక్‌–టూ.. ట్విక్‌–టూ’ అంటూ అరుస్తుంది.   

పగలు నిద్రించి.. రాత్రి వేటాడుతుంది 
వీటి జాడ 2002 తర్వాత కనిపించలేదు. ఈ పక్షుల సమగ్ర గణన సైతం జరగలేదు. రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీతో వీటి ఆవాసాల్లో గత రెండు దశాబ్దాలుగా వచ్చిన మార్పులను గమనిస్తే.. అరుదైన ఈ పక్షి జాతి ఉనికిని తెలుసుకునే అవకాశం ఉంటుందని తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీ జువాలజీ ప్రొఫెసర్‌ ఎం.రాజశేఖర్‌ అభిప్రాయపడ్డారు.  

ఈ పక్షి ముదురు గోధుమ రంగులో.. పొడవాటి కాళ్లతో ఉంటుంది. మెడలో రెండు వెండి గొలుసుల వంటి చారలతో ఉంటుంది. ఇతర పక్షుల్లా ఎత్తుకు ఎగరలేవు. పగటిపూట నిద్రపోతూ.. రాత్రి పూట ఆహార సేకరణ కోసం బయటకు వస్తాయి. 2 నుంచి 10 అడుగుల ఎత్తు వరకు కలివి పొదలు (ముళ్లతో ఉండేవి) వీటి ఆవాసాలు. పొదల మాటున దాగి ఉంటూ వాటి మధ్యలోని ఖాళీ ప్రదేశాల నుంచి ఆహారాన్ని సేకరిస్తాయి. చెదలు, పురుగులు, చీమలు, కీటకాలను తింటూ పంట పొలాలకు వ్యాధుల రాకుండా సంరక్షించడంతో పాటు పర్యావరణ సమతుల్యతకు ఇవి దోహదపడతాయి. ఇవి గులక రాళ్లను సేకరించి.. వాటి మధ్యలో గుడ్లు పెట్టి ఇతర జంతువులు గుర్తించకుండా జాగ్రత్తపడతాయి.   

Advertisement

తప్పక చదవండి

Advertisement