తుంగభద్ర జలాలపై కర్ణాటక, ఏపీ ఉన్నతస్థాయి భేటీ

17 Oct, 2022 05:10 IST|Sakshi

రేపు బెంగళూరులో రెండు రాష్ట్రాల జల వనరుల ముఖ్య కార్యదర్శులు, ఈఎన్‌సీల సమావేశం

తుంగభద్ర డ్యామ్‌లో 105.78 టీఎంసీలకు తగ్గిన నీటి నిల్వ

నవలి వద్ద రిజర్వాయర్‌ నిర్మిస్తామంటున్న కర్ణాటక

అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తెలుగు రాష్ట్రాలు

సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాశయంలో బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన 230 టీఎంసీలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంపై చర్చించేందుకు బెంగళూరు వేదికగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక జల వనరుల శాఖల ముఖ్య కార్యదర్శులు, ఈఎన్‌సీలు మంగళవారం భేటీ కానున్నారు. తుంగ«భద్ర డ్యామ్‌కు ఎగువన కర్ణాటక సర్కార్‌ ప్రతిపాదిస్తున్న నవలి రిజర్వాయర్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న హెచ్చెల్సీ సమాంతర కాలువ అంశంపై ప్రాథమికంగా చర్చించనున్నారు.

ఈ సమావేశంలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తదుపరి చర్యలు తీసుకుంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి.  తుంగభద్ర డ్యామ్‌ను 133 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 1953లో నిర్మించారు. డ్యామ్‌ వద్ద 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్‌ ట్రిబ్యునల్‌ కర్ణాటకకు 151.49, ఆంధ్రప్రదేశ్‌కు 72, తెలంగాణకు 6.51 టీఎంసీలను కేటాయించింది. పూడిక వల్ల డ్యామ్‌లో నీటి నిల్వ 105.78 టీఎంసీలకు తగ్గింది. దీంతో డ్యామ్‌లో నీటి లభ్యత ఆధారంగా మూడు రాష్ట్రాలకు దామాషా పద్ధతిలో జలాలను తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది.

వాటా జలాలను వాడుకోవడానికే..
డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడం వల్ల మూడు రాష్ట్రాలు ఏటా సగటున 167 నుంచి 175 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతున్నామని కర్ణాటక సర్కార్‌ చెబుతోంది. పూడిక తీయడానికి రూ.12,500 కోట్లు వ్యయం అవుతుందని లెక్కలు వేస్తోంది.

దానికి బదులుగా తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన నది నుంచి వరద కాలువ తవ్వి నవలి వద్ద కొత్తగా 52 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మిస్తామని చెబుతోంది. దీంతోపాటు విఠల్‌పుర చెరువు సామర్థ్యాన్ని 4.52 టీఎంసీలకు పెంచి శివపుర చెరువు సామర్థ్యాన్ని 1.56 టీఎంసీలకు పెంచి ఎడమ కాలువ కింద ఆయకట్టును స్థిరీకరిస్తామని.. తుంగభద్ర డ్యామ్‌లో నిల్వ ఉన్న నీటితో మిగతా వాటా జలాలను వాడుకోవచ్చునని కర్ణాటక ప్రతిపాదిస్తోంది.

ఈ రిజర్వాయర్‌ పనులకు రూ.9,500 కోట్ల వ్యయం అవుతుందని.. దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలు భరించాలని తుంగభద్ర బోర్డు సమావేశాల్లో కోరుతూ వస్తోంది. దీన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యతిరేకిస్తున్నాయి. అప్పర్‌ భద్ర, సింగటలూరు ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే కేటాయించిన నీటి కంటే అధికంగా కర్ణాటక వాడుకుంటోందని.. నవలి వద్ద రిజర్వాయర్‌ నిర్మిస్తే తమ హక్కులకు విఘాతం కలుగుతుందని స్పష్టం చేస్తున్నాయి.

తుంగభద్ర హెచ్చెల్సీ(ఎగువ కాలువ)కు సమాంతరంగా వరద కాలువ తవ్వి.. వరద రోజుల్లో వాటా (32.5 టీఎంసీలు) తరలిస్తామని..  డ్యామ్‌లో నిల్వ నీటిని మూడు రాష్ట్రాలు పంచుకోవడం ద్వారా పూర్తిస్థాయిలో వాటా జలాలను వాడుకోవచ్చని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతూ వస్తోంది.

సీఎం జగన్‌ను చర్చలకు ఆహ్వానించిన కర్ణాటక సీఎం
నవలి రిజర్వాయర్‌ నిర్మాణానికి అంగీకరించాలని, వాటా జలాలను మాత్రమే వాడుకుంటామని, దీనివల్ల ఎవరికీ నష్టం ఉండదని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లకు ఆరు నెలల క్రితం కర్ణాటక సీఎం బొమ్మై లేఖలు రాశారు.  ఇదే అంశంపై నాలుగు రోజుల క్రితం సీఎం వైఎస్‌ జగన్‌తో కర్ణాటక సీఎం బొమ్మై ఫోన్‌లో చర్చించారు. తుంగభద్ర జలాల వినియోగంపై చర్చలకు ఆహ్వానించారు.

తొలుత రెండు రాష్ట్రాల జల వనరుల శాఖల కార్యదర్శుల స్థాయిలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిద్దామని, ఆ సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. ఇద్దరు సీఎంలు తీసుకున్న నిర్ణయం మేరకే మంగళవారం రెండు రాష్ట్రాల జల వనరుల శాఖల ఉన్నతాధికారులు సమావేశమవుతున్నారు.  

మరిన్ని వార్తలు