ఎన్ని గుంపులు వచ్చినా సరే.. సింహం రెడీగా ఉంది: కొడాలి నాని

9 May, 2022 21:05 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఏపీలో 2024లో అధికారంలోకి వస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు కలలు కంటున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. నాని సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీడీపీ ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా అధికారంలోకి రాలేదు. 2014లో సీఎం వైఎస్‌ జగన్‌ను అధికారంలోకి రానివ్వకుండా పార్టీ పెట్టి అభ్యర్థిని కూడా పెట్టకుండా చంద్రబాబును గెలిపించానని పవన్ పిచ్చి భ్రమలో ఉన్నారు. 2019లో నాలుగు పార్టీలను కలుపుకుని వ్యతిరేక ఓటు చీలకుండా చూశానని అనుకుంటున్నాడు.

పవన్ కళ్యాణ్‌ను అడ్డం పెట్టుకుని సీఎం జగన్‌ను అధికారంలోకి రాకుండా చూడాలని చంద్రబాబు కోరిక. ఉత్తుత్తి పుత్రుడు, దత్త పుత్రుడు.. చంద్రబాబు చెప్పినట్లు వాగుతుంటాడు. రాష్ట్ర ప్రజలు అమాయకులు, కళ్ళకు గంతలు కట్టాము.. అనుకుంటే అది మీ భ్రమ. మీరు కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా ఇక్కడ పోయేది ఏమీ లేదు. ఎన్ని గుంపులు వచ్చినా చెల్లా చెదురు చెయ్యడానికి సింహం రెడీగా ఉందన్నారు. చంద్రబాబు ఒక నమ్మకద్రోహి, మోసగాడు’’ అని నాని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: విపక్ష పార్టీలకు వారిలో వారికే స్పష్టత లేదు.. సజ్జల
 

మరిన్ని వార్తలు