మరో అధికారిని నియమించగానే ‘సీమ’ ఎత్తిపోతల పరిశీలన | Sakshi
Sakshi News home page

మరో అధికారిని నియమించగానే ‘సీమ’ ఎత్తిపోతల పరిశీలన

Published Mon, Aug 9 2021 4:51 AM

Krishna Board disclosed in an interim report to NGT - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సీఈ దేవేందర్‌రావు స్థానంలో అదే స్థాయి కలిగిన మరో అధికారిని నియమించాక కమిటీని ఏర్పాటు చేసి రాయలసీమ ఎత్తిపోతలను పరిశీ లించి నివేదిక ఇస్తామని జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) దక్షిణ మండల బెంచ్‌(చెన్నై)కు కృష్ణా బోర్డు తెలిపింది. ఎత్తిపోతలపై తుది నివేదిక సమర్పించేందుకు మూడు వారాల గడువు ఇవ్వాలని కోరుతూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే శుక్రవారం ఎన్జీటీకి మధ్యంతర నివేదిక అందజేశారు.

మధ్యంతర నివేదికలో ప్రధానాంశాలు ఇవీ..
► రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టనున్న ప్రదేశాన్ని పరిశీలించి వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని మార్చి 4న ఎన్జీటీ ఆదేశాలు జా రీ చేసింది. ఇందుకు అనుగుణంగా ఎత్తిపోతల పరిశీలనకు కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ని ర్ణయించాం. సీడబ్ల్యూసీ ప్రతినిధిని నియమించాలని కోరగా కృష్ణా–గోదావరి బేసిన్‌ ఆర్గనైజేషన్‌(కేజీబీవో)లో సీఈగా ఉన్న పి.దేవేం దర్‌రావును నియమించింది. ఆయనతోపాటు కృష్ణా బోర్డు అధి కారులతో సీమ ఎత్తిపోతల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేశాం.
► జూలై 23న ఎన్జీటీ జారీ చేసిన ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఈనెల 5న పర్యటించాలని భావించాం. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన పి.దేవేందర్‌రావును కమిటీలో నియమించడంపై ఈనెల 3న ఎన్జీటీ వద్ద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఈనెల 4న ఎన్జీటీ స్పందిస్తూ రెండు రాష్ట్రాలతో సంబంధం లేని అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి ఎత్తిపోతలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 
► ఈ పరిణామాల నేపథ్యంలో మరో అధికారిని సీడబ్ల్యూసీ నియమించిన వెంటనే కమిటీని ఏర్పాటు చేసి సీమ ఎత్తిపోతలను పరిశీలించి నివేదిక ఇస్తాం.

Advertisement
Advertisement