సాగర్‌ వైపు కృష్ణమ్మ పరవళ్లు

29 Jul, 2021 03:21 IST|Sakshi
శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తడంతో దిగువకు పరుగులు తీస్తున్న కృష్ణమ్మను చూసేందుకు వచ్చిన ప్రజలు

శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.61 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

882.1 అడుగుల్లో 199.27 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

60 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల

రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ముందే నిండిన శ్రీశైలం ప్రాజెక్టు

సాగర్‌ కూడా ఈ ఏడాది ముందే నిండే అవకాశం

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌/ఆలూరు/జూపాడు బంగ్లా: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.61 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో ప్రాజెక్టు వద్ద నీటిమట్టం 882.1 అడుగులకు చేరింది. నీటి నిల్వ 199.27 టీఎంసీలకు చేరుకుంది. దీంతో బుధవారం సాయంత్రం 7 గంటలకు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చేతుల మీదుగా ఒక గేటును పది అడుగుల మేర ఎత్తి 30 వేల క్యూసెక్కులను సాగర్‌కు విడుదల చేశారు. ఆ తర్వాత మరో గేటును పది అడుగుల మేర ఎత్తి మరో 30 వేల క్యూసెక్కులను విడుదల చేశారు.

ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 35 వేలు, కుడి గట్టు కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 31 వేలు.. వెరసి 1.26 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్‌ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 884.5 అడుగులకు చేరాక.. అదే నీటి మట్టాన్ని నిర్వహిస్తూ దిగువకు విడుదల చేసే ప్రవాహాన్ని పెంచేందుకు ఒక్కో గేటు తెరుస్తామని సీఈ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు. 2007 తర్వాత జూలైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం ఇదే తొలిసారి. జూలై 28న గేట్లను ఎత్తేయడం ఇదే ప్రథమం. 2020లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఆగస్టు 19న ఎత్తేయగా.. 2019లో ఆగస్టు 9న గేట్లను ఎత్తేశారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ముందే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం గమనార్హం.

పోతిరెడ్డిపాడు నుంచి 12 వేల క్యూసెక్కులు విడుదల
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద బుధవారం 880.10 అడుగుల నీటిమట్టం నమోదైంది. నీటి విడుదలను 12వేల క్యూసెక్కులకు పెంచినట్టు అధికారులు తెలిపారు. ఆ నీటిని బనకచర్ల నీటి నియంత్రణ సముదాయం నుంచి తెలుగు గంగ కాలువకు మళ్లిస్తున్నారు.  

మరిన్ని వార్తలు