కుప్పం కాలువ పనులు షురూ | Sakshi
Sakshi News home page

కుప్పం కాలువ పనులు షురూ

Published Wed, Nov 9 2022 4:16 AM

Kuppam canal works started Andhra Pradesh - Sakshi

బి.కొత్తకోట: అనంత వెంకటరెడ్డి (ఏవీఆర్‌) హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండో దశ పనుల్లో భాగమైన కుప్పం ఉపకాలువ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. గత మూడున్నరేళ్లుగా పనులు నిలిపేసిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్ ను రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ఈ పనులను పాత ఒప్పందానికే ఆర్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి అప్పగించింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.25 కోట్లు ఆదా అవుతాయి. పనులు కూడా ఆరు నుంచి 9 నెలల్లో పూర్తికానున్నాయి. 

క్షేత్ర స్థాయిలో పుంజుకుంటున్న పనులు 
అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం నుంచి పుంగనూరు ఉపకాలువ ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో కుప్పం ఉపకాలువ మొదలవుతుంది. ఈ ఉపకాలువ గుడిపల్లె మండలంలోని పరమ సముద్రం చెరువు వద్ద ముగుస్తుంది. పనులపై గత ప్రభుత్వం శీతకన్ను వేయగా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో క్షేత్రస్థాయిలో పనులు వేగం పుంజుకున్నాయి. ఈ పనులు పూర్తయ్యాక ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలించనున్నారు. 

అదనపు పనుల పేరుతో నిధులను కొల్లగొట్టి.. 
కుప్పం ఉపకాలువ పనులకు 2015లో రూ.413.27 కోట్లకు టెండర్లు పిలిచింది. దీంతో రూ.430.27 కోట్లకు హెచ్‌ఈఎస్‌–ఆర్‌కే–కోయా జాయింట్‌ వెంచర్‌ సంస్థ పనులు దక్కించుకుంది. మధ్యలో ఈ పనుల్లో నాటి టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్టŠస్‌కు నాటి టీడీపీ ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించింది. 2016 అక్టోబర్‌ నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నప్పటికీ పూర్తి చేయలేదు.

టీడీపీ ప్రభుత్వం.. కాంట్రాక్టు సంస్థకు అదనపు పనుల పేరుతో రూ.122.75 కోట్లు మంజూరు చేస్తూ 2018 సెప్టెంబర్‌ 7న జీవో నంబర్‌ 626 జారీ చేసింది. మళ్లీ కాలువ గట్ల మీద మట్టిపనులు చేశారని 2019 జనవరి 28న జీవో 68 జారీ చేసి రూ.21.95 కోట్లు అదనంగా ఇచ్చింది. ఈ నిధులను తీసుకున్న కాంట్రాక్టు సంస్థ ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులను నిలిపివేసింది. పనులు చేపట్టాలని ఎన్ని నోటీసులు ఇచ్చినా కదలిక లేకపోవడంతో పనుల నుంచి ఆ సంస్థను ప్రభుత్వం తప్పించింది.  

వేగంగా పనులు పూర్తి చేసేందుకు.. 
హెచ్‌ఈఎస్‌–ఆర్‌కే–కోయా జాయింట్‌ వెంచర్‌ సంస్థ పనులు చేయకపోవడంతో ఆ పనులను సత్వరమే పూర్తి చేయించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పలు సంస్థలతో సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ గత ఒప్పంద విలువకే పనులు చేసేందుకు ముందుకు రావడంతో రూ.117.17 కోట్ల విలువైన పనులను అప్పగించారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.25 కోట్ల మేర ఆదా అయ్యింది.

కాలువకు సంబంధించి 4.800 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 101 స్ట్రక్చర్స్‌ నిర్మాణ పనులు, 8,32,141 క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు, 40,360 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు, మూడు ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పెండింగ్‌ పనులు, రోడ్‌ కటింగ్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. మొత్తం ఒప్పంద విలువ రూ.430.27 కోట్లు అయినా గత ప్రభుత్వం అదనంగా రూ.144.7 కోట్లు పెంచుకోవడంతో పనుల అంచనా విలువ రూ.574.97 కోట్లకు చేరింది.

2019 వరకు 79.62 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన రూ.117.17 కోట్ల పనులను ప్రస్తుతం పూర్తి చేయనున్నారు. దీనిపై ప్రాజెక్టు మదనపల్లె సర్కిల్‌ ఎస్‌ఈ సీఆర్‌ రాజగోపాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేయించి కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తరలించాలన్న ఆశయంతో ఉందని చెప్పారు. పనులను వేగంగా పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనిపై సీఈ హరినారాయణరెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వెల్లడించారు.   

Advertisement
Advertisement