తక్షణం పంటనష్టం అంచనాలు | Sakshi
Sakshi News home page

తక్షణం పంటనష్టం అంచనాలు

Published Sun, Nov 14 2021 4:16 AM

Kurasala Kannababu Comments On Immediate crop damage estimates - Sakshi

సాక్షి, అమరావతి: వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు పంట దెబ్బతిన్న ప్రతీ రైతును ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు. పంట నష్టం అంచనాల రూపకల్పనపై 13 జిల్లాల వ్యవసాయ శాఖాధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. కన్నబాబు మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పంట నష్టం అంచనాలు తక్షణమే సిద్ధం చెయ్యాలన్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు, అధికారులు పర్యటించి దెబ్బతిన్న పొలాలు, తోటలను పరిశీలించి నష్ట తీవ్రత తగ్గించేలా రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు.

ఇందుకోసం జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. వ్యవసాయ సలహా మండళ్ల సభ్యులు గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా నిలవాలన్నారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో నష్టపోయిన శనగ రైతుల్ని గుర్తించి వారికి 80 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలని కన్నబాబు ఆదేశించారు. ఇక అత్యధికంగా తూర్పు, పశ్చిమ గోదావరి, వైఎస్సార్‌ కడప జిలాల్లో వరి పంట నష్టం ఎక్కువగా జరిగిందని, కడప జిల్లాలో రబీ శనగ పంట, నెల్లూరు జిల్లాలో వరి నారుమళ్లు దెబ్బతిన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. దెబ్బతిన్న రైతులను గుర్తించి ఈ–క్రాప్‌ ద్వారా వారికి సాయం అందేలా చూడాలని మంత్రి ఆదేశించారు. కాగా, ఎక్కువగా దెబ్బతిన్న జిల్లాల్లో పంట నష్టం అంచనాలు రూపొందించేందుకు, రైతులకు సహాయంగా ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులను నియమించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement