రైతుల్లో గందరగోళం సృష్టించకండి | Sakshi
Sakshi News home page

రైతుల్లో గందరగోళం సృష్టించకండి

Published Sun, Aug 29 2021 4:30 AM

Kurasala Kannababu Comments On Yellow Media - Sakshi

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఖరీఫ్‌లో డిమాండ్‌కు తగినట్టుగా అన్ని జిల్లాల్లోనూ అన్ని రకాల ఎరువులూ అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు  స్పష్టం చేశారు. ఈనాడు సహా పలు పత్రికల్లో సత్యదూరమైన వార్తలు ప్రచురిస్తూ రైతులను గందరగోళంలోకి నెట్టేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ఈ అంశంపై తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకే) యూరియా నిర్ధారిత ధరలకే విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ సీజన్‌లో ప్రధానమైన యూరియా, కాంప్లెక్స్‌ ఎరువుల నిల్వలు రైతులకు కావాల్సిన దానికన్నా అధికంగా ఉన్నాయని తెలిపారు. ప్రతి రైతుకూ అవసరాలకు అనుగుణంగా ఎరువులు ఇవ్వాలనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేశామన్నారు.

ఆర్‌బీకేలతో పాటు బయటి మార్కెట్‌లో  ఎరువులను నిర్ధారిత ధరలకే విక్రయిస్తున్నారని చెప్పారు. గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టి రైతులను ఆర్థికంగా పరిపుష్టం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.  ఎంఆర్‌పీ మించి విక్రయిస్తున్న ఎరువుల డీలర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, వారి లైసెన్సు రద్దు చేసేందుకు  వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఈ తరుణంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ కొన్ని పత్రికలు పిచ్చి రాతలు రాస్తూ రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. రైతులు నమ్మవద్దని కోరారు. ఫాం–1 లైసెన్సులను మాన్యువల్‌గా కాకుండా ఈ–ఆఫీసు విధానంలో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఎరువుల సంబంధిత సమస్యలు ఎదురైతే ఆయా వ్యవసాయాధికారులకు లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ 155251కు ఫిర్యాదు చేయవచ్చునని మంత్రి కన్నబాబు చెప్పారు. రాష్ట్రంలో ఎరువుల లభ్యత వివరాలను ఆయన వెల్లడించారు. 

Advertisement
Advertisement