ఒక్కసారిగా మారిపోయిన సీన్‌.. అక్కడ ఎకరం కోటి రూపాయలపైనే.. | Sakshi
Sakshi News home page

Real Boom: ప్రభుత్వం నిర్ణయంతో మారిపోయిన సీన్‌.. సెంటు భూమి రూ.15 లక్షలు 

Published Wed, Jul 20 2022 7:35 PM

Land Prices Rise Heavily In Sathya Sai District Puttaparthi - Sakshi

సాక్షి, పుట్టపర్తి(సత్యసాయి జిల్లా): పుట్టపర్తి... సత్యసాయి నడయాడిన ప్రాంతం. ఆధ్యాత్మిక కేంద్రంగా అంతర్జాతీయంగా భాసిల్లిన ప్రదేశం. దేశవిదేశీ భక్తులతో కళకళలాడిన పట్టణం. ఇక్కడ సెంటు స్థలం రూ.లక్షల్లో పలికేది. కానీ సత్యసాయి భౌతికంగా దూరమయ్యాక ప్రాభవం తగ్గింది. విదేశీ అతిథుల రాక తగ్గగా వెలవెలబోయింది.  వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం శ్రీసత్యసాయి పేరుతో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇప్పుడు మళ్లీ కాంతులీనుతోంది.
చదవండి: చెంప ఛెళ్లుమనిపించిన మహిళా హెచ్‌ఎం.. అసలు ఏం జరిగిందంటే? 

చుట్టూ కొండ ప్రాంతాలు. ఎటు చూసినా భూములు. ఓ వైపు చెరువు. మరో వైపు నది. ఇంకో వైపు గుట్టలు.. పుట్టపర్తి పేరు చెబితే కళ్లముందు కనిపించే దృశ్యమిది. అయితే పుట్టపర్తిని శ్రీ సత్యసాయి పేరుతో  జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో స్వరూపమే మారిపోయింది. గతంలో సత్యసాయిబాబా భక్తులతో రద్దీగా కనిపించినా అభివృద్ధి ప్రశాంతి నిలయం వరకే పరిమితమైంది. సత్యసాయి శివైక్యం తర్వాత ప్రాభావం మసకబారుతూ వచ్చింది. కానీ జిల్లా కేంద్రం ప్రకటనతో అభివృద్ధి కొంతపుంతలు తొక్కుతోంది.

రహదారుల వెంట అభివృద్ధి పరుగులు 
పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్లే మార్గంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. మామిళ్లకుంట వరకు నాలుగు లేన్ల మార్గం ఉండగా రియల్‌ ఎస్టేట్‌ రంగం రెక్కలు విప్పుకుంది. బెంగళూరు వైపు పెడబల్లి వరకు.. ధర్మవరం వైపు కొత్త చెరువు వరకు భూములకు రేట్లు పెరిగాయి. సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ సమీపంలోనే ఏపీఐఐసీ వంద ఎకరాలకుపైగా భూమిని సేకరించింది. ప్రస్తుతం మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల భూములకు డిమాండ్‌ పెరగడంతో ధరలు రెట్టింపు అయ్యాయి.

కొత్తచెరువు చుట్టూ రోడ్డు పక్కన సెంటు రూ.10 లక్షలు పలుకుతోంది. గతంలో ఇక్కడ రూ.4 లక్షలు మించి పలికేది కాదు. 
మామిళ్లకుంట క్రాస్‌లో సెంటు రూ.10 లక్షలు పైగానే ఉంది. ఇక్కడ కూడా గతంలో సెంటు స్థలం రూ.3 లక్షలు మాత్రమే ఉండేది. 
సూపర్‌ స్పెషాలిటీ చుట్టూ కిలోమీటరు మేర సెంటు ధర ప్రస్తుతం రూ.10 లక్షలు పలుకుతోంది. గతంలో సెంటు రూ.4 లక్షలు మించి పలికేది కాదు.  
విమానాశ్రయం సమీపంలో భూములు డబుల్‌ రేటు పలుకుతున్నాయి. ప్రస్తుతం సెంటు  రూ.15 లక్షల వరకూ పలుకుతోంది.

అభివృద్ధికి సర్కారు అండ
పుట్టపర్తి ప్రాంత వాసులు గతంలో వర్షాధార పంటలు మాత్రమే పండించే వారు. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ జలకళతో చాలామంది రైతుల భూముల్లో రెండో పంట పండిస్తున్నారు. అంతేకాకుండా బిందు, తుంపర సేద్య పరికరాలు రాయితీతో అందిస్తుండటంతో చాలా మంది భూములనే నమ్ముకుని సంతోషంగా జీవిస్తున్నారు. నీటి సౌకర్యం... దిగుబడులు బాగా పెరగడంతో పొలాల ధరలూ భారీగా పెరిగాయి. ఆయా గ్రామాల్లో ఎకరా రూ.కోటి వరకు ధర పలుకుతోంది.

గతంలో అభివృద్ధి అంతా ఒకేవైపు..
గతంలో పుట్టపర్తి బస్టాండు చుట్టుపక్కల మాత్రమే అభివృద్ధి జరిగింది. ప్రశాంతి నిలయం ఉండటంతో అక్కడక్కడే పెద్ద పెద్ద భవనాలు వెలిశాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి అనుకూలంగా అక్కడే నివాసాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం జిల్లా కేంద్రం కావడంతో పుట్టపర్తి చుట్టూ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎటు వైపు చూసినా భూముల ధరలు పెరిగాయి. దీనికి తోడు మున్సిపల్, పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులు కూడా ఎత్తైన భవనాలకు బదులు విశాలమైన భవనాలను ఎక్కువ విస్తీర్ణంలో కట్టుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా పట్టణం నలువైపులా నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.

అద్దె ఇళ్లకూ డిమాండ్‌
జిల్లా కేంద్రంగా ప్రకటించడం.. ప్రభుత్వ కార్యాలయాలు తరలి రావడం.. ఉద్యోగులు చేరుకోవడంతో పాటు పలు వ్యాపారాల కోసం పుట్టపర్తికి వలస వచ్చేవారి సంఖ్య అధికమైంది. దీంతో అద్దె ఇళ్లకు భారీ డిమాండ్‌ పెరిగింది. గతేడాదిలో రూ.2 వేలకే ఇల్లు అద్దెకు దొరికేది. ప్రస్తుతం రూ.5 వేలు పెట్టినా సౌకర్యాలు అంతలా లేవు. అపార్ట్‌మెంట్లలో సింగిల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌కు రూ.5 వేలు, డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌కు రూ.10 వేల దాకా అద్దె  ఇవ్వాల్సి వస్తోంది. అయినా ఖాళీగా ఉండే ఇళ్లు కనిపించడం లేదు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement