త్వరలో ఏలేరు–తాండవ ప్రాజెక్టుల అనుసంధానం

20 Jul, 2023 04:22 IST|Sakshi

విశాఖకు నీటి తరలింపులో ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు 

క్షేత్రస్థాయి పరిశీలన చేసిన నీటిపారుదల ఉన్నతాధికారులు 

నాతవరం (అనకాపల్లి జిల్లా): ర్షాకాలం తర్వాత ఏలేరు–తాండవ అనుసంధానం పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్, గోదావరి డెల్టా సిస్టం చీఫ్‌ ఇంజనీర్‌ ఆర్‌.సతీష్ కుమార్‌ చెప్పారు. నాతవరం మండలం జిల్లేడుపూడిలో ఏలేరు సొరంగం వద్ద తాండవ ప్రాజెక్టు కాల్వలను ఉత్తర కోస్తా సీఈ ఎస్‌.సుగుణాకరరావుతో కలిసి బుధవారం ఆయ­న పరిశీలించారు. ఏలేరు, తాండవ ప్రాజెక్టుల అనుసంధానానికి ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు రూ.470 కోట్ల 5 లక్షలను కేటాయించి  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నంలో పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం రిజర్వాయర్‌ నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్, జీవీఎంసీ, ఇక్కడి పరిశ్రమలకు రోజుకు 95 జీఎండీల నీరు సరఫరా అవుతోంది. అనుసంధానం పనులు ప్రారంభించడానికి నీటి సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇబ్బంది ఎదురుకాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు నీటిపారుదల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు.

అనంతరం ఏలేరు, తాండవ ప్రాజెక్టు అధికారులతో పా­టు జీవీఎంసీ, విస్కో అధికారులకు అనుసంధానం పనులపై ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సతీష్­కుమార్‌ దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్రలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టు పనులను రూ.1,100 కోట్లతో పూర్తి చేస్తున్నామని ఉత్తర కోస్తా సీఈ ఎస్‌.సుగుణాకరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వంశధార ప్రాజెక్టు లిఫ్ట్‌ పనులు రూ.150 కోట్లతో జరుగుతున్నాయన్నారు. హిరమండలంలో బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌ పెండింగ్‌ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు.

రూ.123 కోట్లతో విజయనగరం జిల్లా తోటపల్లి బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌ పనులు చేస్తున్నామన్నారు. తారకరామ రిజర్వాయర్‌తో పాటు పలు ప్రాజెక్టులకు మరమ్మ­తులు చేస్తున్నామని వివరించారు. ధవళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ జి.శ్రీనివాసరావు, ఈఈ భాస్కరరావు, డీఈ వినోద్‌కుమార్, విస్కో సలహాదారు, విశ్రాంత ఎస్‌ఈ జగన్మోహన్‌రావు, తాండవ ప్రాజెక్టు డీఈ జె.స్వామినాయుడు, జేఈలు శ్యామ్‌కుమార్, వినయ్‌కుమార్, ఆర్‌.పాత్రుడు, రామకృష్ణ, నాగబాబు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు