నిమ్స్‌లో తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స | Sakshi
Sakshi News home page

నిమ్స్‌లో తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స

Published Thu, Dec 2 2021 5:49 AM

Lung transplant treatment for first time in NIMS Hospital - Sakshi

హైదరాబాద్‌: అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలను కలిగిన నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్‌)లో తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లోనే మొట్టమొదటి సారిగా నిమ్స్‌ సిటీ సర్జన్‌ డాక్టర్‌ ఎం.అమరేష్‌ రావు వైద్య బృందం విజయవంతంగా ఆపరేషన్‌ నిర్వహించింది. ఏపీలోని కర్నూలుకి చెందిన డి.శేఖర్‌ కుమార్తె కళ్యాణి (17)కి కొంతకాలంగా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. బాత్రూమ్‌కు కూడా ఆక్సిజన్‌ లేకపోతే వెళ్లలేని పరిస్థితి. ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా క్షీణదశకు చేరుకోవడంతో సెప్టెంబర్‌11న నిమ్స్‌లో చేరింది. ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని వైద్యులు నిర్థారించారు.

ఇందుకు ఏపీ ప్రభుత్వం కూడా సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చింది. కళ్యాణికి ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్‌ చేసేందుకు నిమ్స్‌ వైద్యులు సమాయత్తమై ఊపిరితిత్తుల దాత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ తాడ్‌బన్‌కు చెందిన సుశీల(47) గత నెల 27న బోయినపల్లిలో రోడ్‌ క్రాస్‌ చేస్తుండగా బైక్‌ వచ్చి ఢీ కొట్టింది.  మెరుగైన చికిత్స కోసం ఆమెను మాదాపూర్‌లోని మెడికవర్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌గా ప్రకటించారు.

జీవన్‌దాన్‌ కార్యక్రమంలో ఆమె అవయవాలను దానం చేసేందుకు బంధువులు ముందుకు వచ్చారు. ఈ విషయం తెలిసి జీవన్‌దాన్‌ కో–ఆర్డినేటర్‌ సుశీల అవయవాలను సేకరించారు. ఆమె ఊపిరితిత్తులను నిమ్స్‌ ఆస్పత్రికి గ్రీన్‌ చానల్‌ ద్వారా తరలించారు. హైదరాబాద్‌ పోలీసుల సహకారంతో ఊపిరితిత్తులను మాదాపూర్‌ నుంచి పంజగుట్ట నిమ్స్‌ ఆస్పత్రికి 11 నిమిషాల్లోనే అంబులెన్స్‌లో చేర్చారు. బుధవారం ఉదయం 7.51 నిమిషాలకు అంబులెన్స్‌ నిమ్స్‌ మిలీనియం బ్లాక్‌కు చేరుకుంది. అక్కడ కళ్యాణికి ఊపిరితిత్తుల మార్పిడి చేయడానికి నిమ్స్‌ వైద్యులు సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఊపిరితిత్తుల మార్పిడిని మొదలుపెట్టి 8 గంటల పాటు శ్రమించి ఆపరేషన్‌ను  విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం కళ్యాణి అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు డాక్టర్‌ అమరేష్‌రావు తెలిపారు.  

Advertisement
Advertisement