Medical PG Seats Recruitment Process Begins - Sakshi
Sakshi News home page

వైద్యవిద్య పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభం

Published Sat, Jul 22 2023 5:06 AM

Medical PG Seats Recruitment Process Begins - Sakshi

సాక్షి, అమరావతి: 2023–24 విద్యాసంవత్సరానికి వైద్యవిద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రవేశాలకు సంబంధించి మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) షెడ్యూల్‌ విడుదల చేసింది. 50 శాతం ఆల్‌ ఇండియా కోటా సీట్లు, డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 100 శాతం సీట్లకు ఈ నెల 27 నుంచి ఆగస్టు ఒకటో తేదీ మధ్య నీట్‌–పీజీ అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నెల 28 నుంచి ఆగస్టు రెండో తేదీ మధ్య వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు మూడు, నాలుగు తేదీల్లో సీట్లు కేటాయిస్తారు. ఏడో తేదీ నుంచి 13వ తేదీలోగా కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

ఆగస్టు 16వ తేదీకి తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగుస్తుంది. 17వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 6వ తేదీ వరకు రెండోవిడత, 7వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య మూడోవిడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్ట్రే వేకెన్సీ రౌండ్‌ కౌన్సెలింగ్‌ సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 10వ తేదీ మధ్య ఉంటుంది. 

రాష్ట్రంలో సీట్లకు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి
2023–24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య, డెంటల్‌ కళాశాలలు, స్విమ్స్‌ తిరుపతిలో రాష్ట్ర కోటా పీజీ, ఎండీఎస్‌ సీట్ల భర్తీకి డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెడికల్‌ పీజీ ప్రవేశాల కోసం http://pgcq.ysruhs.com/  ఎండీఎస్‌ ప్రవేశాల కోసం  https://mdscq. ysruhs.com/  వెబ్‌సైట్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకో వాలి.

శనివారం (నేడు) ఉదయం 11 గంటల నుంచి ఈ నెల 31వ తేదీ సాయంత్రం ఆరు గంటల్లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నీట్‌ పీజీ–2023, ఎండీఎస్‌–2023లో అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చు. నియమ, నిబంధనల్లో సందేహాల నివృత్తికి 8978780501, 7997710168, 9391805238, 9391805239, సాంకేతిక సమస్యలపై 7416563063, 7416253073, 90634 00829, పేమెంట్‌ గేట్‌వేపై స్పష్టత కోసం 8333883934 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని రిజిస్ట్ర్‌రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి తెలి పారు. అభ్యర్థనలను appgadmissions2021 @gmail. comM మెయిల్‌ కూడా చేయవచ్చని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement