దళిత ఎమ్మెల్యేలను కించపరుస్తున్నారు: మేరుగు నాగార్జున

16 Sep, 2022 05:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: శాసన సభలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను అగౌరవపరిచేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. స్పీకర్‌ పోడియం వద్దకు వచ్చి అధికార పార్టీ సభ్యులను, సభా నాయకుడిని ఏకవచనంతో మాట్లాడుతున్నారని, సభలో దళిత సభ్యులను, సభను కించపరిచేలా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారని అన్నారు.

తనను ఉద్దేశించి దళితుడివా అని ప్రతిపక్ష సభ్యులు అనడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను తప్పు చేశానని స్పీకర్‌కి ఫిర్యాదు చేశారని, తానెక్కడా తప్పు మాట్లాడలేదని స్పష్టం చేశారు. ‘దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా..’ అని మాట్లాడిన చంద్రబాబు పార్టీ వారికి సిగ్గులేదని అంటే తప్పు ఏముందన్నారు. మంత్రి అంబటి మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు దళిత మంత్రి ఎదురుగా నిలబడి ప్లకార్డులు చూపిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అన్నారు. టీడీపీ సభ్యుడు బాల వీరాంజనేయస్వామి తీరు సరిగా లేదన్నారు. 

నా గురించి తప్పుగా మాట్లాడారు: టీడీపీ ఎమ్మెల్యే స్వామి  
టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ మంత్రి నాగార్జున తనను అనరాని మాటలు అన్నారని చెప్పారు. తన పుట్టుక గురించి మాట్లాడారని, రికార్డుల్లో చూడాలని అన్నారు. ఆయన తన గురించి ఏమీ మాట్లాడలేదని రికార్డుల్లో తేలితే రాజీనామా చేస్తానన్నారు. టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి గొడవ చేసేందుకు ప్రయతి్నంచారు. రికార్డులు చూడాల్సిందేనని స్వామి పట్టుబట్టడంతో స్పీకర్‌ చూస్తానని చెప్పారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.   

మరిన్ని వార్తలు