విత్తన నాణ్యతకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి: కన్నబాబు

23 Jul, 2021 19:16 IST|Sakshi

ఆర్‌బీకేల ద్వారా విత్తనోత్పత్తి

విత్తనం పండించే ప్రతి ఎకరాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాం

విత్తనోత్పత్తి, వ్యవసాయ పరిస్థితులపై మంత్రి కన్నబాబు సమీక్ష

సాక్షి, అమరావతి: ఆర్‌బీకేల ద్వారా విత్తనోత్పత్తి చేయనున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. విత్తన నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని మంత్రి తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన వన  శాఖల  ఉన్నతాధికారులతో  విత్తనోత్పత్తి, వర్షాల వల్ల నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై మంత్రి కన్నబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విత్తనాలు పండించే రైతులు, కంపెనీల వివరాలు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. 

విత్తనం పండించే ప్రతి ఎకరం రిజిస్ట్రేషన్ చేస్తామని, ప్రాచుర్యం పొందిన హైబ్రిడ్ విత్తనాల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని విత్తన హబ్‌గా చేసేందుకు సీడ్స్ నూతన పాలసీ తోడ్పడుతోందన్నారు. ఇతర రాష్ట్రాలకు సీడ్స్‌ మార్కెటింగ్ చేసేలా ప్రణాళికలు చేయాలన్నారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, రైతులకు అండగా నిలవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారని కన్నబాబు తెలిపారు.

‘‘జులై 22 వరకు 200.3 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సి ఉంటే 256 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అనంతపురం, చిత్తూర్, కడప లో వర్షాలు పడ్డాయి. పశ్చిమ గోదావరి, కృష్ణ, కర్నూలులో అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 55 మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో ముంపుకి గురయ్యాయి. వర్షం నిలిస్తే ఆ నీరు పోయే అవకాశం ఉంది. వర్షాలు తగ్గితే పూర్తిగా ఎన్యుమరేషన్ చేయాలి. వర్షాలు తగ్గిన వెంటనే పంట నష్టాలని పక్కాగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని’’ అధికారులను కన్నబాబు ఆదేశించారు. 

రైతులకు నష్టం జరిగితే తక్షణమే స్పందించాలన్నారు. ఈ వర్షాలు కూడా ఖరీఫ్ కు కలిసొచ్చే అంశమన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందితో వర్షాల వల్ల నెలకొన్న పరిస్థితులను టెలీ కాన్ఫెరెన్స్ ద్వారా మంత్రి కన్నబాబు అడిగి తెలుసుకున్నారు. ఏ రైతు ఈ వర్షాల వల్ల నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. అనంతపురం  జిల్లాలో ఆగస్టు 5 వరకు సబ్సిడీ వేరుశెనగ విత్తనాలను సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు. రైతులకు ఇచ్చే ప్రతి విత్తనం నాణ్యమైనదై ఉండాలని, ధ్రువీకరించినదై ఉండాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు. 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు