ఆయన పేరులో ‘రాజు’ ఉన్నా.. తీరు మాత్రం ... | Sakshi
Sakshi News home page

ఆయన పేరులో ‘రాజు’ ఉన్నా.. తీరు మాత్రం ...

Published Thu, Mar 7 2024 1:06 PM

MLC Indukuri Raghuraju Cheap Politics in vizianagaram - Sakshi

ఆది నుంచీ ఎమ్మెల్సీ రఘురాజు ఆధిపత్య ధోరణి 


శృంగవరపుకోట నియోజకవర్గంలో విచిత్ర రాజకీయం 


సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలపై తిరుగుబాటు 


20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవ్వరితోనూ కుదరని సయోధ్య 


పార్టీ విధానం కన్నా  సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం 


రఘురాజు వైఖరిపై విమర్శల వెల్లువ

ఆయన పేరులో ‘రాజు’ ఉన్నా.. తీరు మాత్రం నీచం. నమ్మిన వారికే వెన్నుపోటు పొడుస్తారు. ప్రజల మధ్య చిచ్చుపెడతారు. నిత్యం కుటిల రాజకీయాలు నెరపుతూ వివాదాలకు కేంద్రబిందువవుతారు. ఆ ప్రాంత అభివృద్ధికి అవరోధం కలిగిస్తారు. అనునిత్యం అహంకారధోరణి ప్రదర్శించే ఆయనను ఏ పల్లె నమ్మదు. చివరకు ఏ పార్టీ కూడా శాశ్వతంగా ఇముడ్చుకోదు. ఆయన రాజకీయ ప్రస్థానం ఆది నుంచీ అంతే అంటూ కొన్ని ఘటనలను ఎస్‌.కోట వాసులు ప్రస్తావించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: శృంగవరపుకోట జెడ్పీటీసీ సభ్యుడిగా 2001–06 కాలంలో ఇందుకూరి రఘురాజు రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అదే సమయంలో బొత్స ఝాన్సీలక్ష్మి విజయనగరం జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. సొంత సోదరుడిలా రఘురాజును ఆదరించారు. జిల్లాలో రాజకీయ దురంధరుడైన బొత్స సత్యనారాయణ కూడా అండదండలు అందించారు. ఇదే అదనుగా బొత్స శిష్యుడినంటూ రఘురాజు ఎస్‌.కోట అసెంబ్లీ నియోజకవర్గంలో చక్రం తిప్పారు. స్థాయికి మించి ఎమ్మెల్సీ పదవి పొందేవరకూ వెన్నుదన్నుగా నిలిచిన బొత్స కుటుంబానికే ఇప్పుడు రఘురాజు వెన్నుపోటు పొడిచాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

బొత్స ఝాన్సీలక్ష్మి ఎస్‌.కోట అసెంబ్లీ నియోజకవర్గం భాగంగా ఉన్న విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న సమయంలో తన భార్య సుబ్బలక్ష్మిని, అనుచర గణాన్ని టీడీపీలోకి పంపించేసిన వైనం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ తరహా తిరుగుబాటు ధోరణి కొత్తేమీ కాదని, గత రెండు దశాబ్దాలుగా ఎస్‌.కోట నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరున్నా వారికి సున్నం పెట్టడం అతనికి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సొంత డప్పు..   
తాను ఏ పారీ్టలో ఉన్నా తనది పార్టీ లైన్‌ (విధానం) కాదని, తనదంతా సొంత స్టైల్‌ అని ఇందుకూరి రఘురాజు ఎంతో గర్వంగా తరచూ వల్లిస్తుంటారు. శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎవ్వరు ఎమ్మెల్యేగా ఉన్నా, ఎవ్వరు అక్కడ అభ్యర్థులుగా ఉన్నా వారిని తన గుప్పెట్లో ఉంచుకోవాలనే ఆరాటం నిలువెల్లా కనిపిస్తూ ఉంటుంది. తన మాటల గారఢీకి లొంగకపోతే ఇక బెదిరింపుల పర్వం మొదలవుతుంది. ఇదే విధానంతో తన స్వగ్రామం బొడ్డవరతో పాటు పెద్దఖండేపల్లి, కిల్తంపాలెం, ముషిడిపాలెం గ్రామస్తులనూ శాసిస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. ప్రతిచోట రెండు వర్గాలుగా విడగొట్టి, అందులో ఒకరికి కొమ్ముకాస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటారనేది జగమెరిగిన సత్యం. రఘురాజు ఆధిపత్య ధోరణి, వెన్నుపోటు, దు్రష్పచారంతో ఇబ్బందిపడిన పార్టీ నాయకులు ఎందరో ఉన్నారు.  

శెట్టి గంగాధరస్వామి: 
గతంలో ఎస్టీ రిజర్వుర్డు నియోజకవర్గమైన ఎస్‌.కోట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యరి్థగా 1994, 1999 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేశారు. అంతకుముందు అనంతగిరి మండలంలో గిరిజనుల నాయకుడిగా, ఎంపీపీగా పనిచేశారు. ఈ రెండు దఫాలు ఓడిపోయినా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడిగా చురుగ్గా ఉండేవారు. 2001 సంవత్సరంలో ఎస్‌.కోట జెడ్‌పీటీసీగా రాజకీయాల్లోకి వచ్చిన రఘురాజుకు కొద్దిరోజుల్లోనే శెట్టి గంగాధర స్వామి ఎందుకో నచ్చలేదు. అడుగడుగునా ఆయన్ను ఇబ్బందిపెడుతూనే ఉండేవారు. ఇదెంతవరకూ వెళ్లిందంటే 2004 సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి పోటీచేయడానికి సిద్ధమైన గంగాధరస్వామికి ఆఖరి నిమిషంలో కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కకుండా చేశారు.  

అల్లు కేశవ వెంకట జోగినాయుడు: 
నియోజకవర్గాల పునరి్వభజన తర్వాత ఎస్‌.కోట జనరల్‌ నియోజకవర్గం అయ్యింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అల్లు కేశవ వెంకట జోగినాయుడుకు కాంగ్రెస్‌ అధిష్టానం టికెట్‌ ఇచ్చింది. ఇది రఘురాజుకు నచ్చలేదు. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాట్లాడినా వినలేదు. స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి ఓడిపోవడమే గాక జోగినాయుడు ఎన్నికగాకుండా దెబ్బతీశారు. ఫలితంగా టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి గట్టెక్కింది. ఫలితంగా నియోజకవర్గం అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రఘురాజుకే సీటు ఇచ్చింది. కానీ రెండోసారి కూడా ఓటమి తప్పలేదు.  

 కుంభా రవిబాబు: 
శెట్టి గంగాధరస్వామికి గాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ కుంభా రవిబాబుకు కాంగ్రెస్‌ అధిష్టానం 2004 ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చింది. గెలిచిన ఏడాది వరకూ రవిబాబు, రఘురాజు మధ్య సంబంధాలు బాగానే ఉండేవి. తర్వాత రఘురాజు ఎప్పటిలాగే ఆధిపత్యధోరణి, అహంకారం ప్రదర్శించడం మొదలెట్టారు. రవిబాబు పదవీకాలమంతా రఘురాజు తిరుగుబాటును ఎదుర్కోవడానికే సరిపోయింది. 2009 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అసలు రవిబాబు పనితీరు బాగోలేదని ఫిర్యాదు చేయడానికి రెండు బస్సుల్లో అనుచరులను రఘురాజు తీసుకెళ్లడం అప్పట్లో చర్చనీయాంశమైంది.  

 కడుబండి శ్రీనివాసరావు: 
రఘురాజు 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వైఎస్సార్‌సీపీలో చేరారు. కానీ వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఎస్‌.కోట టికెట్‌ను కడుబండి శ్రీనివాసరావుకు ఇచ్చింది. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనంలో కడుబండి శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారిపై ఘన విజయం సాధించారు. కానీ రఘురాజు తనకు ప్రాబల్యం ఉందని చెప్పుకుంటున్న నాలుగు గ్రామ పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. అయినప్పటికీ రఘురాజుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి చట్టసభలో కూర్చోబెట్టింది.

ఎమ్మెల్యే కడుబండి కూడా నియోజకవర్గంలో ఎవ్వరికీ ఇవ్వనంత ప్రాధాన్యం అతనికి ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అతను చెప్పిన అభ్యర్థులకే పార్టీ నుంచి మద్దతు పలికారు. ఇలా ఎంత గౌరవం ఇచ్చినా మళ్లీ అతనిలో ఆధిపత్య ధోరణి బయటకు వచ్చింది. కడుబండిని మార్చేయాలంటూ ఏకంగా ఉద్యమమే ప్రారంభించారు. తీరా కడుబండి శ్రీనివాసరావుకే మళ్లీ టికెట్‌ ఖరారు చేయడంతో తెరచాటు యుద్ధానికి తెరలేపారు. భార్య సుబ్బలక్షి్మని, కొంతమంది అనుచర గణాన్ని టీడీపీలోకి పంపించారు. ఈ ద్వంద్వ వైఖరిపై నియోజకవర్గం అంతా విమర్శలు వెల్లువెత్తడంతో రఘురాజు వర్గం దిద్దుబాటు చర్యలకు దిగింది. టీడీపీలో చేరిక వ్యవహారం రఘురాజుకు తెలియదని, ఆయనకు చెప్పకుండానే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లామని చెప్పడం కొసమెరుపు.   

Advertisement
Advertisement