రాష్ట్రంలో మోస్తరు వర్షాలు 

3 Nov, 2022 05:20 IST|Sakshi
తూపిలిపాళెం సముద్ర తీరంలో కురుస్తున్న భారీ వర్షం

నేడు, రేపు కొనసాగే అవకాశం 

దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఎక్కువ ప్రభావం   

సాక్షి, విశాఖపట్నం/వాకాడు (తిరుపతి): కోస్తా, తమిళనాడు, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోంది.

వీటి ప్రభావంతో రానున్న రెండు రోజులపాటు ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. బుధవారం రాష్ట్రంలోని నెల్లూరు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నెల్లూరుజిల్లా తోటపల్లి గూడూరులో 4.3, తిరుపతి జిల్లా కోటలో 3.6, అనంతపురం జిల్లా గుంతకల్లులో 3.2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. 

తీరంలో రెడ్‌ అలర్ట్‌ 
రెండు రోజులుగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాకాడు సముద్ర తీరంలో వర్షాలతోపాటు చలి గాలులు, అలల ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో తీరప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి.

చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలాలకు చెందిన రెవెన్యూ, పోలీసు, మెరైన్‌ అధికారులు ఇప్పటికే తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. అలాగే లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులు తమ వేట నిలిపేసి సామాగ్రిని ఒడ్డున భద్రపరిచారు. మెరైన్‌ పోలీసులు తీరంలో నిఘా ఉంచారు. 

మరిన్ని వార్తలు