ఏపీలో ఎంఎస్‌ఎంఈ ఉద్యోగాలు భారీగా పెరిగాయి

31 Dec, 2023 05:03 IST|Sakshi

కేంద్ర మంత్రి భానుప్రతాప్‌ సింగ్‌ వెల్లడి

2021–22లో 12.29 లక్షల మందికి ఉపాధి కల్పన

2022–23లో 27.27 లక్షల మందికి ఉపాధి కల్పన

రాష్ట్రంలో మొత్తం 6.99 లక్షల ఎంఎస్‌ఎంఈలు 

వైఎస్‌ జగన్‌ పాలనలోనే కొత్తగా 5.06 లక్షల ఎంఎస్‌ఎంఈల ఏర్పాటు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ తీసు­కున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఎంఎస్‌­ఎంఈల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కల్పన ఏటేటా భారీగా పెరుగుతోందని కేంద్ర ఎంఎస్‌ఎంఈల శాఖ సహాయ మంత్రి భానుప్రతాప్‌సింగ్‌వర్మ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. 2021–22వ ఆర్థిక సంవత్సరంలో ఏపీలో ఎంఎస్‌ఎంఈల ద్వా­రా 12,29,335 మందికి ఉద్యోగాలను కల్పించగా.. 2022–23లో ఏకంగా 27,27,273 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కేంద్ర మంత్రి భానుప్రతాప్‌సింగ్‌ తెలిపారు.

ఎంఎస్‌ఎంఈల ద్వారా అత్యధిక ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ 7వ స్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ పాలనలోని ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 5.06 లక్షల ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటయ్యాయి. గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,93,530 ఎంఎస్‌ఎంఈలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ సంఖ్య 6,99,881కు పెరిగిందని కేంద్ర మంత్రి భానుప్రతాప్‌సింగ్‌ తెలిపారు. దేశంలో 2021–22లో 6,222 ఎంఎస్‌ఎంఈలు మూతపడగా.. ఏపీలో 113 మాత్రమే మూతపడ్డాయని చెప్పారు. 2022–23లో దేశంలో 13,290 ఎంఎస్‌ఎంఈలు మూతపడగా ఏపీలో 261 మాత్ర­మే మూతపడ్డాయని వివరించారు.

కోవిడ్‌ కష్ట సమయంలో సైతం ఎంఎస్‌ఎంఈల కార్యకలాపాలు ని­లి­చిపోకుండా సీఎం జగన్‌ రీస్టార్ట్‌ ప్యాకేజీ, వైఎస్సా­ర్‌ నవోదయం తదితర పథకాలతో చేదోడువాదోడుగా నిలిచారు. అలాగే చంద్రబాబు హయాంలో ఎంఎస్‌ఎంఈలు, స్పిన్నింగ్‌ మిల్లులకు ప్రోత్సాహకాలు విడుదల చేయకుండా బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను కూడా సీఎం జగన్‌ చెల్లించారు. మరో రూ.­2,087 కోట్ల ప్రోత్సాహకాలనూ విడుదల చేశారు. సీఎం జగన్‌ అందిస్తున్న ప్రోత్సాహంతో భారీగా ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటవుతున్నాయి. స్థాని­కులకు భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. 

>
మరిన్ని వార్తలు