నెల్లూరులో విషాదం.. క్లాస్‌రూంలో కుప్పకూలి విద్యార్థిని మృతి

7 Sep, 2022 18:44 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: జిల్లాలోని వింజమూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం పెనువిషాదం చోటు చేసుకుంది. పదమూడేళ్ల షేక్‌ సాజీదా అనే విద్యార్థిని.. తరగతి గదిలోనే ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూసింది. చిన్నవయసులోనే చిన్నారి కన్నుమూయడం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. 

ఏడో తరగతి చదువుతున్న సాజీదా.. క్లాస్‌ రూంలో టీచర్‌ ప్రశ్నలు అడగడంతో లేచి సమాధానాలు ఇస్తోంది. అయితే ఒక్కసారిగా ఆ చిన్నారి కుప్పకూలింది. వెంటనే స్కూల్‌ సిబ్బంది హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె కన్నుమూసినట్లు డాక్టర్లు ప్రకటించారు. గుండె పోటుతో సాజీదా మృతి చెందిదని ప్రాథమికంగా చెబుతున్నా.. పూర్తిస్థాయి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వస్తేనే మృతికి అసలు కారణం తెలుస్తుందని వైద్యులు స్పష్టత ఇస్తున్నారు. 

సమాధానాలు చెబుతూ హఠాత్తుగా ఆమె కుప్పకూలిందని.. ఫిట్స్‌ అనుకుని తాళాలు చేతిలో పెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందని బయాలజీ టీచర్‌ చెబుతున్నాడు. ఆ వెంటనే సహోద్యోగి సాయంతో ఆస్పత్రికి తరలించామని తెలిపాడాయన. మరోవైపు సాజీదాకు ఎలాంటి గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలూ లేవని సాజీదా కుటుంబం కన్నీళ్లతో చెబుతోంది. పదమూడేళ్ల వయసుకే గుండెపోటుతో మృతి చెందిందన్న వార్త.. స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

ఇదీ చదవండి: మానవత్వం మరిచి.. వదినపై కర్రలతో దాడి..

మరిన్ని వార్తలు