Sakshi News home page

కళసాకారం.. 

Published Sun, Apr 14 2024 3:56 AM

New Art with Pictures for AP Govt School: Artist Vijay and Swathi - Sakshi

ప్రభుత్వ బడులకు పండుగొచ్చింది. స్కూళ్లు పిల్లలతో కళకళలాడుతున్నాయి. ఐదేళ్ల క్రితం ఎవరూ కలలో కూడా ఊహించనిదీ విప్లవాత్మక మార్పు.మార్పులో మేము సైతం అంటూ పాలుపంచుకుంది హైదరాబాద్‌ కు చెందిన యువ ఆర్టిస్ట్‌ విజయ్,స్వాతి జంట.  పిల్లల నవ్వులతో మమేకమైంది.. బడి ప్రాంగణాలే కాన్వాసుగా వారి ఆటపాటలే కుంచెలుగా మలచి వర్ణచిత్రాలను  ‘రంగ’రించింది. పాఠశాలకు జీవం ఉట్టిపడే చిత్రాలతో కొత్త కళ తెచ్చింది. ఆ యువ ఆర్టిస్టు జంటతో ‘సాక్షి’ ముచ్చటించింది. వారి మాటల్లోనే.. 

అలా మొదలైంది: మేం ఇద్దరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం వాటితో అనుబంధం ఉంది. గత 2017లో ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని మాకు చేతనైన విధంగా రంగులద్దాం. ఆ సమయంలో ఎవరైనా చొరవ తీసుకుని అన్ని స్కూళ్లకు ఇలాగే రంగులద్దితే ఎంత బావుండో అనుకున్నాం. పూజారి కోరిందీ దేవుడు ఇచ్చిందీ ఒకటే అన్నట్టు  ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌లో లార్జ్‌స్కేల్‌ ఆర్ట్‌ వర్క్స్‌ కోసం మమ్మల్ని చింతూరు ఐటీడీఎ పీవో అప్రోచ్‌ అయ్యారు. అలా 2020లో జులై నెలలో నాడు–నేడు కోసం మా వర్క్‌ స్టార్ట్‌ అయింది.  అది కేవలం మా బొమ్మల వరకే కాదనీ, మొత్తం పాఠశాలల రూపు రేఖలే మార్చే కార్యక్రమం అనీ తెలిశాక మా ఆనందం రెట్టింపయింది.

మా కల నిజం అవుతోందని సంబరపడ్డాం. ఆర్ట్‌ వర్క్‌ కోసం రోజుల తరబడి ఆయా స్కూళ్లలో గడిపాం. పిల్లలు చదువుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు.. హ్యాపీగా ఫీలైన జాయ్‌ మూమెంట్స్‌ని క్యాప్చర్‌ చేసి వాటినే ఆర్ట్‌ వర్క్స్‌గా మలిచాం. తద్వారా  పిల్లలు మరింతగా వాటితో కనెక్ట్‌ అయ్యారు. వాళ్లని వాళ్లు 30–30 స్కేల్‌ ఆర్ట్‌ వర్క్‌లో చూసుకుని థ్రిల్‌ అయ్యేవారు. పదే పదే చూసుకోవడం, పేరెంట్స్‌కి, ఫ్రెండ్స్‌కీ  చూపించే సమయంలో వాళ్ల  ముఖంలో సంతోషం అమూల్యం. మాటల్లో వర్ణించలేం. అలా హెడ్‌ మాస్టర్, టీచర్లు, స్టాఫ్‌.. మా స్కూల్‌కు బెస్ట్‌ ఆర్ట్‌ వర్క్‌ చేయండి అంటూ అడిగి మరీ చేయించుకున్నారు. చాలా వరకూ ట్రైబల్‌ ఏరియా స్కూల్స్‌లో చేశాం. ప్రతీ స్కూల్‌లో వర్క్‌ ముగించుకుని వచ్చేటప్పుడు చుట్టాలను వదిలి వెళ్తున్న ఫీలింగ్‌ కలిగింది. ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవ విజయంలో మాకు కూడా చిన్న పాత్ర ఉండడం జీవితంలో మేం మర్చిపోలేని మధుర జ్ఞాపకం.  – సత్యార్థ్‌ 

నాడు అలా.. 
ఇకపై ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే నాడు–నేడుకు ముందు, ఆ తర్వాత అని విభజించి మాట్లాడాల్సిందే. సర్కారు బడులంటే టాయిలెట్స్‌ కనిపించవు, పైనా కిందా గచ్చు పెచ్చులూడుతూ ఉంటుంది. వానపడితే పుస్తకాలు బల్లల కింద దాచుకోవాలి. ఫ్యాన్లు శబ్ధాలు చేస్తాయి తప్ప తిరగవు. బాగా పాఠాలు చెప్పే టీచర్లు కరువు. ప్రాంగణం పందులు, పశువులకు ఆలవాలం. అందువల్లే పిల్లలను చేర్చలేని దుస్థితి.  

నేడు ఇలా..  
బెస్ట్‌ బెంచీలు, గ్రీన్‌ బోర్డ్స్, ఫ్లోరింగ్, ఫ్యాన్స్, టాయిలెట్స్, క్రీడా పరికరాలతో సహా ప్లే గ్రౌండ్, పుస్తకాలు, బ్యాగ్స్, ట్యాబ్స్‌.. పూటకో మెనూతో మధ్యాహ్న భోజనం.. ఇలా కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా చక్కటి వసతులు సమకూరాయి. పిల్లలు, టీచర్లలో నవోత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే జాయిన్‌ చేయాలి అనే పరిస్థితి వచ్చింది.   

Advertisement
Advertisement