New Policy in South Central Railways, Goes Digital Now - Sakshi
Sakshi News home page

South Central Railways New Rules: ఆర్‌ఏసీ.. ఉండదిక వెయిట్‌ అండ్‌ సీ

Published Tue, Jul 26 2022 4:23 AM

New Policy in South Central Railways - Sakshi

సాక్షి, అమరావతి: రైళ్లలో రిజర్వేషన్‌ చార్ట్‌ సిద్ధమైన తరువాత ఆర్‌ఏసీ (రిజర్వేషన్‌ అగైనెస్ట్‌ క్యాన్సిలేషన్‌) జాబితాలో ఉన్న ప్రయాణికులకు బెర్త్‌లను పారదర్శకంగా కేటాయించేందుకు, కొందరు టీసీల అవినీతికి చెక్‌ పెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం రైల్వే టీసీలకు ‘హ్యాండ్‌ హెల్డ్‌ టెర్మినల్స్‌ (హెచ్‌హెచ్‌టీ)’ ట్యాబ్‌లు అందించాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా విజయవాడ డివిజన్‌ పరిధిలోని 16 రైళ్లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి.. టీసీలకు హెచ్‌హెచ్‌టీ ట్యాబ్‌లను అందించింది. ఆ రైళ్లలో రిజర్వేషన్‌ రద్దు, ఆర్‌ఏసీ జాబితాలో ఉన్నవారికి బెర్త్‌ల కేటాయింపు పక్కాగా చేసేందుకు మార్గం సుగమమైంది. సాధారణంగా టికెట్‌ రిజర్వ్‌ చేసుకున్న రైలు ప్రయాణికులకు ఆర్‌ఏసీ వస్తే ఒకటే కంగారు పుడుతుంది.

ఎవరు రిజర్వేషన్‌ క్యాన్సిల్‌ చేసుకున్నారో.. ఆ బెర్త్‌ ఎవరికి కేటాయిస్తారో కూడా తెలీదు. దాంతో రైల్వే స్టేషన్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచీ బెర్త్‌ కన్ఫర్మేషన్‌ కోసం టీసీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. టీసీ ప్లాట్‌ఫామ్‌ మీద ఉన్నా.. రైలులో ఉన్నా ఆయన వెంటపడుతూనే ఉంటారు. అయితే.. ఎందరు రిజర్వేషన్లు రద్దు చేసుకున్నారో.. వాటిని ఎవరికి ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారో కూడా ఎవరికీ తెలీదు. ఈ విషయంలో రైల్వే కార్యాలయాల్లో ఉండే ఉన్నతాధికారులకు సైతం నిర్దిష్టమైన సమాచారం ఉండదు. దానివల్ల వాటి కేటాయింపు అంతా టీసీల ఇష్టం మీద ఆధారపడి ఉంటోంది. కొందరు టీసీలు ప్రయాణికుల నుంచి డబ్బులు తీసుకుని ప్రాధాన్యత క్రమంలో లేని వారికి కూడా బెర్త్‌లు కేటాయిస్తూ ఉంటారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయడానికే హెచ్‌హెచ్‌టీ ట్యాబ్‌లను ప్రవేశపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.  

త్వరలో మరిన్ని రైళ్లలో.. 
గతంలో రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలోని టీసీలకు ఈ ట్యాబ్‌లను అందించారు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 16 రైళ్లలో టీసీలకు వీటిని అందించారు. రెండువైపులా తిరిగే 3 దురంతో ఎక్స్‌ప్రెస్‌లు (సికింద్రాబాద్‌–విశాఖ, సికింద్రాబాద్‌–నిజాముద్దీన్, సికింద్రాబాద్‌–లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌), 5 సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు (శాతవాహన, పినాకిని, రత్నాచల్, కాగజ్‌ నగర్, విజయవాడ ఇంటర్‌ సిటీ)లలో వీటిని ప్రవేశపెట్టారు. త్వరలో మరిన్ని రైళ్లలోని టీసీలకూ హెచ్‌హెచ్‌టీ ట్యాబ్‌లను అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.  

పారదర్శకత కోసమే.. 
► ఈ హెచ్‌హెచ్‌టీ ట్యాబ్‌లతో టీసీలు బెర్త్‌ల కేటాయింపును పరిశీలిస్తారు. రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు వస్తే ఆ ట్యాబ్‌లోనే టిక్‌ పెడతారు. ఆ వివరాలన్నీ రైల్వే జోనల్, డివిజనల్‌ కార్యాలయాలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.  
► రిజర్వేషన్‌ రద్దు చేసుకున్న వివరాలు కూడా ఆ ట్యాబ్‌లలో అందుబాటులో ఉంటాయి.  
► రద్దు చేసుకున్న బెర్త్‌లను ఆర్‌ఏసీలో వరుస క్రమంలో ఉన్నవారికే కేటాయించాలి. ఆ వెంటనే ట్యాబ్‌లో టిక్‌ పెట్టాలి.  
► ఎవరైనా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే జోనల్, డివిజనల్‌ కార్యాలయాల్లోని ఉన్నతాధికారులు ఆన్‌లైన్‌ ద్వారా గుర్తిస్తారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారు.  
► ఈ విధానంతో బెర్త్‌ల కేటాయింపు పూర్తి పారదర్శకంగా సాగుతుంది. ఎక్కడా లంచాలకు.. ఇతర అక్రమాలకు అవకాశం ఉండదు.  
► రిజర్వేషన్‌ బోగీలలో అనధికారికంగా ఎవరూ ప్రయాణించడానికి అవకాశం ఉండదు. ఎవరూ ఎలాంటి సాకులు చెప్పేందుకు కూడా వీలుండదు.  
► ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది తరచూ తనిఖీలు చేస్తూ రిజర్వేషన్‌ బోగీలలో అనధికారికంగా ఉన్నవారిపై చర్యలు తీసుకుంటారు. 

Advertisement
Advertisement