నిర్దిష్టంగా చెప్పకుండా ఆరోపణలా?

22 Oct, 2020 04:13 IST|Sakshi

ఎన్నికల నిర్వహణ కమిషన్‌ పరిధిలోని వ్యవహారం

ప్రభుత్వంపై ఆరోపణలు కమిషన్‌కు అలవాటుగా మారాయి

రెండు గంటల్లోనే కమిషన్‌ ఖాతాకు నిధులు జమ చేశాం

హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వ న్యాయవాది

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం సహకరించడం లేదని, నిధులు విడుదల చేసి తగిన సహకారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. కాగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఎన్నికల కమిషన్‌కు అలవాటుగా మారిందని ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌ హైకోర్టుకు బుధవారం నివేదించారు. రెండు గంటల్లోనే కమిషన్‌ ఖాతాలో నిధులు జమ చేశామని తెలిపారు. ప్రభుత్వం ఏ విషయంలో సహకరించడం లేదు? ఎలాంటి సహకారం కావాలి? అనే విషయాలను నిర్దిష్టంగా చెప్పకుండా ఆరోపణలు చేయడం దారుణమన్నారు.

ఎన్నికల కమిషన్‌కు సహాయ, సహకారాలు అందిస్తూనే ఉన్నామని తెలిపారు. ఈ సమయంలో హైకోర్టు స్పందిస్తూ... ప్రతి దానికీ ప్రభుత్వాన్ని అడుక్కోవాలా? అని వ్యాఖ్యానించింది. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌కు సహకరించడం ప్రభుత్వ బాధ్యత కాదా? అని ప్రశ్నించింది. అయితే న్యాయస్థానం అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, ప్రభుత్వానికి తన బాధ్యతలు స్పష్టంగా తెలుసని, తమ స్థాయిలో సహకరిస్తూనే ఉన్నామని సుమన్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందడం లేదు? ఏ రకమైన సహకారం కావాలి? అనే అంశాలను వివరిస్తూ అదనపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని నిమ్మగడ్డను ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

కమిషన్‌ ఖాతాలో రూ.39.64 లక్షలు జమ..
ఎన్నికల కమిషన్‌కు రూ.40 లక్షలు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నిధులు విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పాటు ఎన్నికల నిర్వహణ విషయంలో సహాయ, సహకారాలను అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ సోమవారం స్వయంగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా మంజూరైన నిధులను రెండు గంటల్లో కమిషన్‌ ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ క్రమంలో బుధవారం విచారణ సందర్భంగా రూ.40 లక్షలకుగాను రూ.39.64 లక్షలు జమ అయినట్లు నిమ్మగడ్డ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మిగిలిన రూ.36 వేలు ఎందుకు నిలిపివేశారో తెలుసుకుని చెబుతానన్నారు. దీంతో ఈ వ్యాజ్యంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు