ఆరోగ్యశ్రీలో 13.74 లక్షల మందికి ఉచిత వైద్యం | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీలో 13.74 లక్షల మందికి ఉచిత వైద్యం

Published Fri, Jun 25 2021 5:32 AM

Over 13.74 lakhs patients get benefit of Aarogyasri - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద రెండేళ్లలో ఏకంగా 13.74 లక్షల మంది పేదలు, సామాన్యులకు ఉచిత వైద్య చికిత్సలు అందాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మే 31వ తేదీ వరకు  ఇంత పెద్ద సంఖ్యలో ఉచిత వైద్య చికిత్సలు అందడం ఇదే తొలిసారి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.3,400.18 కోట్లు వ్యయం చేసింది. గత చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య శ్రీని పూర్తిగా నీరు కార్చేసింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో ఈ పథకం కింద చికిత్స చేయడానికి ఆస్పత్రులు నిరాకరించేవి.  ఏటా కనీసం రూ.500 కోట్లు కూడా కేటాయించలేదు.

చంద్రబాబు సర్కారు నీరు కార్చిన ఆరోగ్య శ్రీ పథకానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఊపిరి పోశారు. తెల్ల రేషన్‌ కార్డుతో ఆరోగ్య శ్రీ కార్డు లింక్‌ను ఉప సంహరించడమే కాకుండా, పేదలతో పాటు వార్షిక ఆదాయం రూ.5 లక్షల్లోపు గల సామాన్య  ప్రజలకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేశారు. తద్వారా రాష్ట్రంలోని 95 శాతం కుటుంబాలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. చికిత్స వ్యయం రూ.1000 దాటితే వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ వర్తింప చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. తరచూ సమీక్షలతో ఈ పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి బిల్లులు చెల్లించే ఏర్పాటు చేశారు.

లక్షన్నర మంది కోవిడ్‌ రోగులకు ఉచిత చికిత్స
గత ఏడాది కోవిడ్‌–19ను కూడా వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఇటీవల బ్లాక్‌ ఫంగస్‌ను కూడా చేర్చారు. ప్రభుత్వ నిర్ణయం పేదలు, సామాన్యులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మే ఆఖరు వరకు వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద 1.55 లక్షల మందికి పైగా కోవిడ్‌ రోగులకు ఉచిత వైద్య చికిత్సలు అందించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.435.87 కోట్లు వ్యయం చేసింది. ఈ పథకాన్ని గతంలో వెయ్యి చికిత్సలకే పరిమితం చేస్తే, సీఎం జగన్‌ 2,434 వ్యాధులు, ఆపరేషన్లకు పెంచారు. అంతే కాకుండా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందేలా వీలు కల్పించారు. తద్వారా రాష్ట్రంలో పేదలు, సామాన్యులను వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ సంజీవనిలా ఆదుకుంటోంది.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement