Papikondalu: Police Base Camp Protecting The Forest - Sakshi
Sakshi News home page

Papikondalu: అడవి తల్లికి గూర్ఖాలుగా బేస్‌ క్యాంప్‌ సిబ్బంది

Published Tue, Nov 9 2021 8:05 AM

Papikondalu: Police Base Camp Protecting The Forest At Buttaigudem - Sakshi

బుట్టాయగూడెం(పశ్చిమ గోదావరి జిల్లా): అరణ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ నిత్యం సవాళ్లతో సావాసం చేసే అడవి తల్లి బిడ్డలు వారు. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆ అడవిలో వణ్య ప్రాణుల సంరక్షణ, వేటగాళ్ల నుంచి విలువైన వృక్ష సంపదను రక్షించడమే వారి పని. పాపికొండల అభయారణ్యంలోని అణువణువూ జల్లెడ పట్టే బేస్‌ క్యాంప్‌ సిబ్బంది కుటుంబాలకు దూరంగా.. అడవి తల్లికి గూర్ఖాలుగా తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిసున్న బేస్‌క్యాంప్‌ సిబ్బందిపై ప్రత్యేక కథనం..  

ఐదు బేస్‌ క్యాంప్‌లు ఏర్పాటు
పాపికొండల అభయారణ్యం ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 1,012.86 చదరపు కిలోమీట్ల మేర విస్తరించింది. మొత్తం 1,01,200 హెక్టార్ల అటవీప్రాంతాన్ని 2008లో కేంద్రప్రభుత్వం జాతీయ పార్కుగా ప్రకటించింది. అటవీ సంరక్షణతో పాటు వన్యప్రాణి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మగుడి సమీపంలో ఒకటి, పోలవరం మండలం టేకూరు ప్రాంతంలో, గడ్డపల్లి సమీపంలో, పాపికొండల అభయారణ్య శివారు ప్రాంతంలో మరో రెండు బేస్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేసి వాటిలో 25 మంది సిబ్బందిని నియమించారు. వీరంతా అటవీ, వన్యప్రాణి సంరక్షణ కోసం పగలూ రాత్రీ తేడాలేకుండా శ్రమిస్తున్నారు.

తగ్గిన స్మగ్లింగ్‌
బేస్‌ క్యాంప్‌ల ఏర్పాటుతో అటవీప్రాంతంలో స్మగ్లింగ్‌ తగ్గుముఖం పట్టింది. గతంలో స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా అటవీసంపదను తరలించేవారు. ప్రస్తుతం బేస్‌క్యాంప్‌లు ఏర్పాటు చేయడం వల్ల అక్రమ రవాణా అరికట్టారు. బేస్‌ క్యాంప్‌ సిబ్బంది రాత్రీ, పగలూ గస్తీ కాయడం వల్ల వన్యప్రాణులకు రక్షణ పెరిగిందని ఆ శాఖ అధికారులు అంటున్నారు.

రాత్రి వరకూ అడవిలో గస్తీ
బేస్‌క్యాంప్‌ సిబ్బంది అటవీప్రాంతంలో ఏర్పాటు చేసిన మంచె లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇళ్లల్లో ఉంటారు. వంట వార్పు మొత్తం అక్కడే. అప్పుడప్పుడు ఇళ్లకు వెళ్లడం తప్ప అడవే వారికి ప్రపంచం. అడవితల్లికి అండగా ఉంటూ చెట్లు నరికివేతకు గురికాకుండా,  వన్యప్రాణుల్ని సంరక్షిస్తుంటారు. ఉదయం 6 గంటలకే నిద్రలేచి వంటావార్పూ సిద్ధం చేసుకుని అడవిలోకి బయల్దేరతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అటవీప్రాంతంలో తిరుగుతూ జంతువుల కదలికలను గుర్తిస్తారు. ఒక్కోసారి రాత్రి వరకూ అటవీప్రాంతంలోనే ఉంటారు.

అడవిని నరుకుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి స్మగ్లర్ల ఆటకట్టిస్తారు. అడవిలో సాయంత్రం కాగానే పూర్తిగా నిర్మానుష్యంగా మారుతుంది. చీకటి పడగానే చిరుతలు, ఎలుగుబంట్లతో పాటు పలు జంతువుల అరుపులు వినిపిస్తుంటాయి. ఒక్కోసారి అవి పక్కనుంచి వెళ్తుంటాయి. రోజూ ఎన్నో జంతువులు కనిపిస్తాయి. అయినా వాటి మధ్య ధైర్యంగా బేస్‌క్యాంప్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. బేస్‌క్యాంప్‌ సిబ్బందిని అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా నియమిస్తారు. 25 కిలోమీట్ల వాకింగ్‌ టెస్ట్, హెల్త్‌ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ద్వారా నియమిస్తారు.

అడవి సింహాల్లా..
అటవీ ప్రాంతంలో బేస్‌ క్యాంప్‌ సిబ్బంది వన్యప్రాణుల మధ్య అడవి సింహాల్లా తిరుగుతుంటారు. ఒక్కోసారి రాత్రిపూట కూడా అడవికి కాపలా కాస్తారు. దీంతో స్మగ్లింగ్‌ తగ్గింది. పాపికొండల అభయారణ్యంలో ప్రస్తుతం 25 మంది బేస్‌క్యాంప్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 
– ఎస్‌ఎస్‌ఆర్‌ వరప్రసాద్, పాపికొండల వైల్డ్‌లైఫ్‌ మేనేజ్‌మెంట్‌ అధికారి 

జంతువులు కనిపిస్తే దాక్కుంటాం
మేము దట్టమైన అటవీప్రాంతంలో తిరుగుతున్న సమయంలో మాకు అనేక అడవి జంతువులు కనిపిస్తాయి. ఆ సమయంలో అవి వెళ్ళిపోయే వరకూ చాటున దాక్కుంటాం. గొర్రగేదెలు, లేళ్లు, ఎలుగుబంట్లు వంటివి మాకు కనిపిస్తుంటాయి. వాటి సంరక్షణ మా బాధ్యత కనుక వాటికి కనిపించకుండా పహారా కాస్తాం. 
– సోయం వెంకటేశ్వరరావు, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది, కొరుటూరు

చేతి కర్ర, కత్తే ఆయుధం
దట్టమైన అటవీప్రాంతంలో పహారా కాసే సమయంలో మా చేతిలో కర్ర, కత్తి మాత్రమే ఉంటాయి. అవే ఆయుధాలు. అవి కూడా ముళ్ల చెట్లు తొలగించడానికే తప్ప జంతువులకు హాని చేయడానికి కాదు. రాత్రీ, పగలూ తేడా లేకుండా కర్రతో శబ్దం చేస్తూ తిరుగుతుంటాం. 
– యండపల్లి బుచ్చన్న దొర బేస్‌ క్యాంప్‌ సిబ్బంది, సరుగుడు

కష్టానికి తగ్గ జీతం ఇవ్వాలి
మాలో డిగ్రీ వరకూ చదివిన వారు కూడా ఉన్నారు. మా గ్రామాలు అటవీప్రాంతంలో ఉండటం వల్ల బేస్‌ క్యాంప్‌లో చేరాం. ప్రస్తుతం మాకు జీతం, భోజన ఖర్చులు కలిపి నెలకు రూ. 10 వేల వరకూ ఇస్తున్నారు. మా కష్టానికి తగ్గట్లు జీతాలు పెంచాలి. అడవిలో ఉంటున్న రోజుల్లో మా భోజనానికే ఎక్కువ ఖర్చు అవుతుంది. 
– కొండ్ల సుధీర్, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది, పోలవరం

Advertisement
Advertisement