వేసవిలోనూ పెన్నా బేసిన్‌లో జలరాశి

15 Apr, 2023 04:38 IST|Sakshi

రిజర్వాయర్లలో 151.94 టీఎంసీల నిల్వ

గతేడాది ఇదే రోజుకు 134.74 టీఎంసీలు 

పెన్నా బేసిన్‌ చరిత్రలో ఈ స్థాయి నిల్వ ఇదే ప్రథమం 

తాగు నీటికి, రబీలో పంటలకు పుష్కలంగా నీరు 

ఖరీఫ్‌కు ముందస్తుగా నీటి విడుదలకు మార్గం సుగమం 

సాక్షి, అమరావతి: పెన్నా నది పరీవాహక ప్రాంతం (బేసిన్‌)లోని రిజర్వాయర్లలో వేసవిలోనూ పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నాయి. శుక్రవారానికి రిజర్వాయర్లలో 151.94 టీఎంసీలు ఉన్నాయి. పెన్నా బేసిన్‌లోని రిజర్వాయర్ల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 239.59 టీఎంసీలు. అంటే.. ఖరీఫ్‌ పూర్తయి, రబీ పంటలు కోత దశలో ఉన్న సమయంలో పెన్నా రిజర్వాయర్ల సామర్ధ్యంలో ఇప్పటికీ 63.42 శాతం నీరు నిల్వ ఉండటం గమనార్హం.

సోమశిల రిజర్వాయర్‌లో 78 టీఎంసీలకుగానూ 52.62 టీఎంసీలు, కండలేరులో 68.3 టీఎంసీలకుగాను 38.65 టీఎంసీలు, గండికోటలో 26.85 టీఎంసీలకుగాను 25.37 టీఎంసీలు, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలకుగాను 8.16 టీఎంసీలు, వెలిగల్లు ప్రాజెక్టులో 4.64 టీఎంసీలకుగాను 4.41 టీఎంసీలు జలాలు ఉన్నాయి.

పెన్నా బేసిన్‌ చరిత్రలో ఏప్రిల్‌ రెండో వారంలో ఈ స్థాయిలో నీరు ఉండటం ఇదే ప్రథమమని అధికారవర్గాలు తెలిపాయి. రిజర్వాయర్లలో గతేడాది ఇదే రోజుకు 134.74 టీఎంసీలు.. 2021లో 127.6 టీఎంసీలు నిల్వ ఉండేవి. కర్ణాటకలో వర్షాఛాయ ప్రాంతమైన నంది కొండల్లో జన్మించే పెన్నా నది.. జయమంగళి, కుందేరు, సగిలేరు, చిత్రావతి, బాహుదా, పించా, పాపాఘ్ని వంటి ఉప నదులను కలుకుకొని శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రవహించి.. ఊటుకూరు వద్ద సముద్రంలో కలుస్తుంది.

వర్షఛాయ ప్రాంతంలో ఉన్న ఈ నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోడంతో 2019 వరకూ పెన్నాలో ప్రవాహం పెద్దగా ఉండేది కాదు. కానీ.. గత నాలుగేళ్లుగా బేసిన్‌లో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా నది ఉరకలెత్తింది. చిన్న, మధ్య తరహా, భారీ ప్రాజెక్టులు నిండటంతో ఖరీఫ్‌లో భారీ ఎత్తున రైతులు పంటలు సాగుచేసుకున్నారు. రబీలోనూ నీరు పుష్కలంగా ఉండటంతో రైతులు అదే రీతిలో పంటలు సాగుచేసుకున్నారు.

ప్రస్తుతం రబీ పంటలు కోత దశలో ఉన్నాయి. నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నందున పెన్నా బేసిన్‌లో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఉండవని అధికారవర్గాలు చెప్పాయి. గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ ఖరీఫ్‌లో పంటల సాగుకు ముందస్తుగా నీటిని విడుదల చేయవచ్చని తెలిపాయి.  

మరిన్ని వార్తలు