భయపెడుతున్న ‘బ్లాక్‌ ఫంగస్‌’ | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న ‘బ్లాక్‌ ఫంగస్‌’

Published Mon, May 24 2021 3:21 AM

People in AP are more afraid of black fungus cases than corona virus - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ కంటే బ్లాక్‌ ఫంగస్‌ కేసులంటేనే జనం భయపడిపోతున్నారు. వివిధ సామాజిక మాధ్యమాలతో పాటు ఎలక్ట్రానిక్, ప్రింట్‌ మీడియాలో బ్లాక్‌ ఫంగస్‌పై వస్తున్న వార్తలు, వ్యాధి సోకిన వారి ఫొటోలు చూసి తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న ఓ మధుమేహ బాధితుడు బ్లాక్‌ ఫంగస్‌ గురించి ఆందోళన చెందుతుండటంతో చక్కెర స్థాయిలు తీవ్రంగా పెరుగుతున్నాయని.. అతనికి చికిత్స చేస్తున్న డాక్టర్‌ చెప్పారు.

కరోనా చికిత్స పొందుతున్న వందలాది మంది మధుమేహ బాధితులు అతి తక్కువగా నమోదయ్యే బ్లాక్‌ ఫంగస్‌ జబ్బుకు వణికిపోతున్నారు. ఇదిలా ఉండగా బాగా పేరున్న ఫార్మసీ ఔట్‌లెట్ల నుంచి చిన్న మెడికల్‌ షాపు వరకూ కొత్త దందా మొదలెట్టాయి. ఏడెనిమిది రకాల మందులు ఒక కవర్‌లో పెట్టి జనానికి పప్పు బెల్లాల్లా అమ్ముతున్నాయి. ఒక్కో కిట్‌కు రూ.700 నుంచి రూ.800 వరకూ వసూలు చేస్తున్నాయి. వాటిలో స్టెరాయిడ్స్‌ ఉండటం వల్ల స్వల్ప లక్షణాలున్న వారు కూడా మోతాదుకు మించి వాడుతుండటంతో వారికి తెలియకుండానే వారిలో షుగర్‌ లెవల్స్‌ పెరిగిపోతున్నాయి. కొంతమంది అమాయకులు కరోనా రాకుండా ఉండేందుకని ఈ మందులు మింగుతున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. నిపుణుల సూచన లేకుండా ఇలాంటివి వాడకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

చాలా అరుదుగా వచ్చే వ్యాధి 
కరోనా రాకుండానే చాలామంది ఇళ్లకు మందులు తెచ్చుకుని వాడుతున్నారు. ఇది చాలా ప్రమాదం. కొంతమంది వైద్యులు కూడా ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్‌ ఇస్తున్నారు. ఇవి ప్రాణాధార మందులు కావచ్చుగానీ.. ఆ తర్వాత ప్రమాదాన్ని కొనితెస్తున్నాయి. మధుమేహం ఉన్నవారికి అత్యంత జాగ్రత్తగా స్టెరాయిడ్స్‌ వాడాల్సిన అవసరం ఉంది. బ్లాక్‌ ఫంగస్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం చేయొచ్చు. లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇది చాలా అరుదుగా వచ్చేవ్యాధి. భయపడాల్సిన అవసరం లేదు.
– డా.బి.చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరోఫిజీషియన్‌ 

Advertisement

తప్పక చదవండి

Advertisement