ఇక కొండలపై మొక్కల పెంపకం | Sakshi
Sakshi News home page

ఇక కొండలపై మొక్కల పెంపకం

Published Mon, Jul 10 2023 4:58 AM

Plantation on hills - Sakshi

సాక్షి, అమరావతి : గ్రామీణ ప్రాంతాల్లోని కొండలపై ఈ వర్షాకాలంలో ఒకే రోజు కోటి పండ్ల మొక్కలు నాటేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధమైంది. ఉపాధి హామీ పథకంలో.. కొండలపై మొక్క బతికేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కో మొక్కపై కేవలం అర్థరూపాయి ఖర్చుతో అధికారులు ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. సాధారణంగా మొక్కల పెంపకంలో ఒక్కో మొక్క నాటాలంటే.. గుంత తీసేందుకు కనీసం రూ.25, మొక్క కొనుగోలుకు రూ.25 నుంచి రూ.50.. ఇలా ఒక్కో మొక్కకే రూ.50 నుంచి 100 దాకా ఖర్చవుతుంది.

అయితే సీడ్‌ బాల్స్‌ విధానంలో ఒక్కో మొక్కపై కేవలం అర్థరూపాయి మాత్రమే ఖర్చుపెట్టేలా కొండలపై ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సేంద్రియ ఎరువులతో కూడిన షోషకాలు ఎక్కువగా ఉండే మట్టిని సిద్ధం చేసుకుని.. ఆ మట్టిని ఉండలు ఉండలుగా చేస్తారు.

ఒక్కో ఉండలో నాటాల్సిన మొక్కకు సంబంధించిన విత్తనాన్ని ఉంచుతారు. ఎలాంటి నేలలోనైనా నామమాత్రపు తేమకే ఆ విత్తనం మొలకెత్తేలా ఆ మట్టి ఉండలు(సీడ్స్‌ బాల్స్‌) అత్యంత నాణ్యంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. విత్తనం, మట్టి ఉండల తయారీకి అయ్యే ఖర్చు కూడా ఒక్కో దానికి అర్ధరూపాయి లోపే ఉంటుందంటున్నారు.   

కనీసం వెయ్యి కొండల్లో పదివేల చొప్పున..  
ఈ వర్షాకాలంలో కొండలపై కోటి మొక్కలు పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న గ్రామీణాభివృద్ధి శాఖ.. రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు మండలానికి రెండేసీ కొండలను ఎంపిక చేసుకోనుంది. మండలానికి కనీసం ఒక్క కొండపైనైనా ఈ సీడ్‌ బాల్స్‌ విధానంలో మొక్కల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

ఇలా రాష్ట్రంలో 660 మండలాల్లో కనీసం వెయ్యి కొండల్లో ఒక్కో కొండపై పది వేల చొప్పున మొక్కల పెంపకాన్ని చేపడతారు. ఉపాధి హామీ పథకం, వాటర్‌హెడ్‌ కార్యక్రమాల్లో భాగంగా గతంలో కూలీల ద్వారా వర్షం నీరు నిల్వలకు స్ట్రెంచ్‌ల తవ్వకం జరిపిన కొండలను ఎక్కువగా ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు.

కాగా, సీతాఫలం, ఉసిరి, రేగు వంటివాటితో పాటు కుంకుడు, వెలగ వంటి వాటినే ఈ మొక్కల పెంపకం కార్యక్రమంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు. నీడకు పనికొచ్చే వేప, కానుగ మొక్కలను కూడా పెంచుతారు. కొండల గుర్తింపు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. వర్షాకాలం మధ్య కల్లా కార్యక్రమాన్ని చేపడతామని అధికారులు వెల్లడించారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement