అనంతపురంలో ప్రారంభమైన పోక్సో కోర్టు | Sakshi
Sakshi News home page

అనంతపురంలో ప్రారంభమైన పోక్సో కోర్టు

Published Sun, Aug 28 2022 5:17 AM

POCSO court opened in Ananthapur - Sakshi

అనంతపురం క్రైం: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో బాలలపై లైంగిక నేరాల కేసులను విచారించే పోక్సో కోర్టును హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు శనివారం అనంతపురం శ్రీనగర్‌ కాలనీలోని బీఆర్‌ అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌ భవనంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ ఎం.గంగారావు, జస్టిస్‌ బి.శ్యాంసుందర్‌ తదితరులు హాజరయ్యారు. కోర్టు హాల్, చైల్డ్‌ ఫ్రెండ్లీ రూం, స్టాఫ్‌ రూం, న్యాయమూర్తి చాంబర్, అడ్మినిస్ట్రేషన్‌ సెక్షన్‌లను హైకోర్టు న్యాయమూర్తులు పరిశీలించారు.

అనంతరం హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలోనే ఇన్‌చార్జ్‌ న్యాయమూర్తి రాజ్యలక్ష్మి మూడు కేసులకు సంబంధించి వడ్డే శ్రీరాములు (అనంతపురం), ఈశ్వరయ్య (గోరంట్ల), మధు(యల్లనూరు)లను విచారించి ఆ కేసులను వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కేసలి అప్పారావు మాట్లాడుతూ.. పోక్సో కేసులు నమోదైనంతగా శిక్షలు పడడం లేదని, బాలల హక్కుల కమిషన్‌ అందుకు తగుచొరవ తీసుకుని దోషులకు శిక్ష పడేలా చూస్తుందని అన్నారు.

కార్యక్రమంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, జిల్లా జడ్జి శ్రీనివాస్, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్, అనంతపురం జిల్లా అదనపు ఎస్పీలు నాగేంద్రుడు, హనుమంతు, దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, బాలల హక్కుల కమిషన్‌ సభ్యులు ఎం.లక్ష్మిదేవి, జీ సీతారాం, అనంతపురం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement