రూ.55,656.87 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

రూ.55,656.87 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇవ్వాలి

Published Mon, Feb 8 2021 5:22 AM

Polavaram Project Authority seeking the Central Govt For Investment approval - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌) ఇవ్వాలని కోరుతూ కేంద్ర జల్‌శక్తి శాఖకు ప్రతిపాదనలు పంపేందుకు పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ) సిద్ధమైంది. భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూమికి నష్టపరిహారం, నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని, ఇందుకే రూ.33,168.23 కోట్లు ఖర్చు అవుతాయని వివరించనుంది. జలాశయం, కాలువలు, విద్యుత్కేంద్రం వ్యయం రూ.22,380.63 కోట్లని తెలుపనుంది. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కోసం ఇప్పటిదాకా రూ.6,583.11 కోట్లు ఖర్చు చేశారని, ఇంకా రూ.26,585.12 కోట్లు అవసరమని వివరించనుంది.

వీటిని పరిగణనలోకి తీసుకుంటే 2010–11 ధరలతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) టీఏసీ(సాంకేతిక సలహా మండలి) ఆమోదించిన ప్రకారం.. మొత్తం రూ.55,656.87 కోట్లు (అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లు, పీపీఏ ఖర్చులు రూ.108 కోట్లు)కు పెట్టుబడి అనుమతి ఇచ్చి, ఆ మేరకు నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర జల్‌ శక్తి శాఖకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించినట్లు పీపీఏ అధికారవర్గాలు తెలిపాయి. పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం 2010–11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లు కాగా.. కేంద్ర ప్రభుత్వం 2013లో కొత్తగా భూసేకరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీనివల్ల భూసేకరణ వ్యయం, నిర్వాసితులకు పునరావాసం కల్పించే వ్యయం మూడింతలు పెరిగింది. స్టీలు, సిమెంటు, ఇంధనం ధరలు పెరగడం, సీడబ్ల్యూసీ డిజైన్‌ మార్చడం వల్ల పనుల పరిమాణం పెరిగింది. దాంతో అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.55,656.87 కోట్లకు సీడబ్ల్యూసీ సవరించింది.

కేంద్రం నుంచి రావాల్సింది రూ.35,623.79 కోట్లు
పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు కేంద్ర జల్‌ శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కాగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు అంటే 2014 ఏప్రిల్‌ 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,730.71 కోట్లను ఖర్చు చేసింది. విభజన చట్టం ప్రకారం 2014 ఏప్రిల్‌ 1 తర్వాత ప్రాజెక్ట్‌ నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని వంద శాతం భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్‌ పనులకు రూ.12,393.48 కోట్లను ఖర్చు చేస్తే.. కేంద్రం రూ.10,741.46 కోట్లను రీయింబర్స్‌ చేసింది. ఇంకా రూ.1,652.02 కోట్లను రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. తాజా ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్‌ నీటిపారుదల వ్యయం రూ.51,095.96 కోట్లు. 2014 ఏప్రిల్‌ 1కి ముందు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం, ఆ తర్వాత కేంద్రం రీయింబర్స్‌ చేసిందీ.. మొత్తం రూ.15,472.17 కోట్లను మినహాయిస్తే, నీటిపారుదల విభాగం వ్యయం కింద ఇంకా రూ.35,623.79 కోట్లను కేంద్రం విడుదల చేయాల్సి ఉంటుంది. 

Advertisement
Advertisement