పోలీసు కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై.. ఒకేరోజు విచారణ జరుపుతాం | Sakshi
Sakshi News home page

పోలీసు కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై.. ఒకేరోజు విచారణ జరుపుతాం

Published Tue, Sep 26 2023 4:22 AM

Police Custody And Bail Petitions Will Be Heard On The Same Day - Sakshi

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని ఏసీబీ ప్రత్యేక న్యాయ­స్థానం స్పష్టంచేసింది. అలాగే, చంద్రబాబును మరో ఐదు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా అదేరోజు విచారణ జరుపుతామని తేల్చిచెప్పింది.

ఈ రెండు వ్యాజ్యాలపై ఒకేసారి తీర్పు వెలువరిస్తామని కోర్టు తెలిపింది. వాస్తవానికి.. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం కోర్టు విచారణ జరపాల్సి ఉంది. అయితే, రెండ్రోజుల పోలీసు కస్టడీలో విచారణకు చంద్రబాబు ఏమాత్రం సహకరించకపో­వడంతో మరో ఐదురోజుల పాటు ఆయనను కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది.  ఈ సమయంలో చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాదులు ప్రమోద్‌కుమార్‌ దూబే, దమ్మాల­పాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ.. తమ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టాల్సిందేనని పట్టుబట్టారు.

తాము బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసి చాలా రోజులైందన్నారు. దీంతో సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, స్పెషల్‌ పీపీ యడవల్లి నాగ వివేకానంద, హైకోర్టు అదనపు పీపీ దుష్యంత్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, పోలీసు కస్టడీ పిటిషన్‌ దాఖలు చేసినప్పుడు ముందు దాని­పైనే విచారణ జరపాల్సి ఉంటుందన్నారు. పోలీసు కస్టడీ పిటిషన్‌ను తేల్చిన తరువాత బెయిల్‌పై విచారణ జరపవచ్చని తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో ఆరు రోజులపాటు తమ పోలీసు కస్టడీపై ఏసీబీ కోర్టు విచారణ జరపలేని పరిస్థితి వచ్చిందన్నారు.

పైగా.. చంద్రబాబు రెండ్రోజుల కస్టడీలో సీఐడీ విచారణకు ఏమాత్రం సహకరించలేదన్నారు. అందుకే ఆయనను మరో ఐదు రోజులపాటు కస్టడీ కోరుతున్నామని.. ముందు తమ పోలీసు కస్టడీ పిటిషన్‌పై తేల్చి, ఆ తరువాత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరపవచ్చునని వారు సూచించారు. ఆ మేర మెమో దాఖలు చేశామన్నారు. పోలీసు కస్టడీ పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నప్పుడు ముందు దానినే విచారించి ఆ తరువాత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరపాలని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

బాబు లాయర్లపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు..
అయితే, దీనిని చంద్రబాబు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ముందు తమ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరపాలన్నారు. సీఐడీ దాఖలు చేసిన మెమోపె ఏదో ఒక నిర్ణయం వెలువరించాలని వారు పట్టుబట్టారు. మెమోను ఆమోదించడమో, తిరస్కరించాడమో చేస్తూ ఉత్తర్వులు జారీచేయాల్సిందేనన్నారు. దీనిపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.

కోర్టును ఇలాగే చేయాలని పట్టుబట్టలేరని వారికి తేల్చిచెప్పింది. ఈ కోర్టును కార్నర్‌ చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఏం చేయాలన్నది తమ విచక్షణపై ఆధారపడి ఉంటుందని వారికి కోర్టు తేల్చిచెప్పింది.

మొదటి నుంచీ ఈ కేసులో ఇలాగే పట్టుపడుతున్నారని తెలిపింది. దీంతో బాబు న్యాయవాదులు వెనక్కి తగ్గారు. తమ ఉద్దేశం అది కాదన్నారు. అటు పోలీసు కస్టడీ, ఇటు బెయిల్‌ పిటిషన్‌పై ఒకేరోజు విచారణ జరుపుతామని న్యాయస్థానం వారికి తేల్చిచెప్పింది. రెండింటిలోనూ ఒకేసారి తీర్పు వెలువరి­స్తానంటూ విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. పోలీసు కస్టడీ పిటిషన్‌లో కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబు న్యాయవాదులను ఆదేశించింది.

Advertisement
Advertisement