YSR District: శరవేగంగా విద్యుత్‌ పునరుద్ధరణ

2 Jun, 2022 14:10 IST|Sakshi

ఇటీవల పెనుగాలులు, వర్షానికి దెబ్బతిన్న  సబ్‌స్టేషన్లు, విద్యుత్‌ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు

తొమ్మిది పట్టణాలు, 43 మండలాలు, 319 గ్రామాలు ప్రభావితం

దెబ్బతిన్న 344 ట్రాన్స్‌ఫార్మర్లు, రెండు ఈహెచ్‌టీ, 42 – 33కేవీ సబ్‌స్టేషన్లు

44,772 వ్యవసాయేతర, 3894 వ్యవసాయ సర్వీసుల్లో విద్యుత్‌కు అంతరాయం

రూ. 5 కోట్లకు పైగానే నష్టం

యుద్ధ ప్రాతిపదికన పనులు

కడప కార్పొరేషన్‌: ఉమ్మడి వైఎస్‌ఆర్‌ జిల్లాలో పది రోజులుగా తీవ్ర పెనుగాలులు, వర్షాలకు విద్యుత్‌ శాఖకు తీవ్ర నష్టం ఏర్పడింది. గాలుల వల్ల విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా, విద్యుత్‌ స్తంభాలు, లైన్లు నేలకొరిగాయి. పెనుగాలులు, వర్షాల వల్ల 9 పట్టణాలు, 43 మండల కేంద్రాలు, 319 గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఫలితంగా రూ. 5 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.  దీంతో ఆ శాఖ అధికారులు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు.

14  ప్రత్యేక బృందాల సాయంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు.  ఇప్పటికే దాదాపు 90 శాతం పనులు పూర్తికాగా, మరో నాలుగు రోజుల్లో మిగతా పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. పెనుగాలులు, వర్షాల వల్ల రాయచోటిలో 2 ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్లు దెబ్బతినగా, రెండింటినీ పునరుద్ధరించారు. రాజంపేట, రాయచోటి పరిధిలో 33 కేవీ సబ్‌స్టేషన్లు– 42, 33కేవీ ఫీడర్లు– 10, 33కేవీ స్తంభాలు–18, 33కేవీ లైన్లు 6.5 కి.మీల మేర దెబ్బతినగా వీటిని వందశాతం పునరుద్ధరించారు. 

అలాగే జిల్లా వ్యాప్తంగా 11కేవీ ఫీడర్లు–292 దెబ్బతినగా అన్నింటికీ మరమ్మతులు చేశారు. 11కేవీ స్తంభాలు 872 దెబ్బతినగా 812ని కొత్తవి అమర్చారు. మరో 60 అమర్చాల్సి ఉంది. 11కేవీ విద్యుత్‌ లైన్‌ 51.15 కి.మీల మేర దెబ్బతినగా 44.19 కి.మీ పునరుద్ధరించారు. ఎల్‌టీ లైన్లు 42.45 కి.మీ పాడవగా, 37.86 కి.మీ పనులు పూర్తయ్యాయి. ఎల్‌టీ స్తంభాలు 839 దెబ్బతినగా, 794 స్తంభాలు నెలకొల్పారు. 45 స్తంభాలను మార్చాల్సి ఉంది. మొత్తం 344 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా 297 ట్రాన్స్‌ఫార్మర్లను మార్చారు, 47 పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వర్షాలు, గాలులకు 44772  వ్యవసాయేతర సర్వీసులు, 3894 వ్యవసాయ సర్వీసులకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇందులో వ్యవసాయేతర సర్వీసులన్నింటికీ విద్యుత్‌ పునరుద్ధరించగా, వ్యవసాయ సర్వీసులు 3539ని పూర్తి చేశారు. మరో 355 సర్వీసులకు విద్యుత్‌ ఇవ్వడానికి పనులు జరుగుతున్నాయి.  

24 గంటల్లోనే విద్యుత్‌ సరఫరా  
జిల్లాలో తీవ్రమైన గాలులు, వర్షాల వల్ల విద్యుత్‌ శాఖకు చెందిన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు దెబ్బతిన్నాయి. 24 గంటల్లోనే అన్ని కేటగిరీల వారికి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాము. పునరుద్ధరణ పనుల కోసం 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాము. ఇంకా కొన్ని  పనులు జరుగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో అన్ని పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఎక్కడైనా విద్యుత్‌ సమస్యలు ఉంటే 9440817440 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు.  
–ఎన్‌.శోభా వాలెంటీనా, పర్యవేక్షక ఇంజినీరు, ఏపీఎస్‌ పీడీసీఎల్‌ కడప సర్కిల్‌

మరిన్ని వార్తలు