విదేశాల నుంచి ఆక్సిజన్‌ కొనుగోలు

9 May, 2021 05:37 IST|Sakshi

తీసుకురావడానికి నేవీ సిద్ధం

రాష్ట్రం కొనుగోలు చేస్తున్న 25 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు.. అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ కొరత లేకుండా విదేశాల నుంచి లిక్విడ్‌ ఆక్సిజన్‌ కొనుగోలు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. ఏ దేశంలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ అందు బాటులో ఉన్నా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా మని నేవీ అధికారులు చెప్పారన్నారు. శనివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్, నేవీ (తూర్పు నౌకాదళం) కోవిడ్‌ కష్టకాలంలో రాష్ట్రానికి అండగా నిలిచాయని తెలిపారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరాలో తలెత్తే లోపాలను సరిదిద్దడానికి నేవీ అధికారులు నాలుగు స్పెషలిస్టు బృందాలను ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికే విశాఖ ఉక్కు యాజమాన్యం వెయ్యి ఆక్సిజన్‌ పడకలు ఇస్తామని తెలిపిందని, అందులో ఇప్పటికే 50 అప్పగించా రని, మరో 150 పడకలు మే 15 నాటికి ఇస్తారని చెప్పారు. నేవీ అధికారులు సైతం 200 పడకలు ఇవ్వ డానికి ముందుకొచ్చారని తెలిపారు. ఆ బెడ్లకు మెడికల్, పారామెడికల్‌ సిబ్బందిని విశాఖ జిల్లా కలెక్టర్‌ నియమిస్తారన్నారు. మరో 3 వారాల్లోగా రాష్ట్రం కొనుగోలు చేస్తున్న 25 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆయన ఏమన్నారంటే..

ప్రైవేటు ఆస్పత్రుల అక్రమాలపై కేసులు
ప్రతి జిల్లాలోనూ ఐదారు ఆస్పత్రులను క్లస్టర్‌గా విభజించి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు పెడుతున్నాం. నకిలీ రెమ్‌డెసివర్‌ కలిగి ఉన్నవారిపై చర్యలు తీసుకుంటున్నాం.

ముందుగా సెకండ్‌ డోస్‌ వారికే ప్రాధాన్యం
రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేస్తున్న వ్యాక్సిన్‌ సరఫరా ప్రారంభమైంది. వ్యాక్సిన్‌ మొదటి డోసు పంపిణీలో ఎవరూ ముందుకు రాకపోవడంతో, వార్డు/గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్న వారిని చైతన్య పరిచి టీకా వేశాం. ఇప్పుడు అందరూ ఒకేసారి టీకా కావాలని అంటున్నారు. కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌కు సరి పోతుంది. దానివల్ల కొత్తవారికి ఇవ్వలేకపోతున్నాం. ఈ విషయాన్ని కేంద్రానికి చెప్పాం. వ్యాక్సిన్‌ కోసం కేంద్రం రూపొందించిన కోవిన్‌ అప్లికేషన్‌లో మార్పు చేయాలని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్‌ ద్వారా టీకా పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాం. 

ఇస్రో వద్ద 100 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌..
గడిచిన 24 గంటల్లో 491 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ఆస్పత్రులకు సరఫరా చేశాం. కేసులు పెరుగుతున్న కారణంగా ఆక్సిజన్‌ కేటాయింపులు పెంచాలని, చెన్నై, బళ్లారి ప్లాంట్ల నుంచి సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరాం. ఇక్కడ నుంచి అయితే రవాణా సమయం కలిసొస్తుందని కేంద్రానికి తెలియజేశాం. నెల్లూరులోని సతీష్‌ ధావన్‌ (శ్రీహరికోట) అంతరిక్ష ప్రయోగశాలలో 90 నుంచి 100 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉన్నట్టు సమాచారం ఉంది. వాటిని కేటాయిస్తే నెల్లూరు జిల్లాకు మేలు జరుగుతుంది. 

ఆక్సిజన్‌ ప్లాంట్ల బాధ్యత నౌకాదళానికి..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, బోధనాసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ల నిర్వహణ బాధ్యతను తూర్పు నౌకాదళానికి (ఈఎన్‌సీ) అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, సరఫరా బాధ్యతను ఈఎన్‌సీ తీసుకోనుంది. ఈ మేరకు స్టీల్‌ప్లాంట్, తూర్పు నౌకాదళాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు శనివారం భేటీ అయ్యారు. ముందుగా స్టీల్‌ప్లాంట్‌లోని ఆక్సిజన్‌ యూనిట్లను పరిశీలించారు. అనంతరం తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రంలో ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. 
స్టీల్‌ప్లాంట్‌లో ఆక్సిజన్‌ యూనిట్స్‌ను పరిశీలిస్తున్న ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు  

ముఖ్యంశాలివీ..
► ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, బోధనాస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ బాధ్యత ఈఎన్‌సీ నిర్వహించనుంది. 
► ఆక్సిజన్‌ ప్లాంట్లలో లీకేజీ సమస్యల పరిష్కారం, ప్లాంట్‌ల పర్యవేక్షణ, అక్కడ తీసుకోవాలి్సన బాధ్యతల్ని నౌకాదళం నిర్వర్తించనుంది.
► ఇందుకోసం తూర్పు నౌకాదళం నాలుగు బృందాలు ఏర్పాటు చేయనుంది. ఒక్కో బృందం 3 నుంచి 4 జిల్లాల్ని పర్యవేక్షిస్తుంది.
► అత్యవసరమైతే ఈ బృందాల సహకారంతో యుద్ధ విమానాలు, నేవల్‌ హెలికాప్టర్లను కూడా ఆక్సిజన్‌ సరఫరాకు వినియోగించనున్నారు.
► సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా మొదలైన దేశాల నుంచి వస్తున్న 25 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ సిలిండర్లను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసే బాధ్యత తీసుకునేందుకు ఈఎన్‌సీ అంగీకరించింది.
► లిక్విడ్‌ ఆక్సిజన్‌ కంటైనర్లతో పాటు డీ–టైప్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, కోవిడ్‌ సంబంధిత వైద్య పరికరాలు, మందులు సరఫరా చేసేందుకు నౌకాదళ వాహనాలు వినియోగించాలని నిర్ణయించారు.
► విశాఖలోని ఐఎన్‌ఎస్‌ కళింగ ఆస్పత్రిలో కోవిడ్‌ చికిత్స కోసం 10 ఆక్సిజన్‌ బెడ్స్‌తో పాటు 60 సాధారణ పడకలు ఏర్పాటు చేసేందుకు తూర్పు నౌకాదళాధికారులు అంగీకరించారు.
► విశాఖలోని కంచరపాలెం సమీపంలో ఉన్న నేవీ షెడ్‌లో 150 పడకల తాత్కాలిక కోవిడ్‌ హాస్పిటల్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నేవీ స్పష్టం చేసింది. 
► కోవిడ్‌ పేషెంట్లకు ఇబ్బందులు తలెత్తకుండా 200 డీ–టైప్‌ ఆక్సిజన్‌ సిలెండర్లను సరఫరా చేయనున్నారు.

స్టీల్‌ప్లాంట్‌లో ఆక్సిజన్‌తో 50 పడకలు..
► కోవిడ్‌ మహమ్మారిని కట్టడి చేసేందుకు స్టీల్‌ప్లాంట్‌ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకరించారు.
► స్టీల్‌ప్లాంట్‌లోని గురజాడ కళాక్షేత్రంలో ఆక్సిజన్‌ సౌకర్యంతో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు విశాఖ ఉక్కు కర్మాగారం అధికారులు అంగీకరించారు.
► మే 15 నాటికి అదనంగా 150 పడకలు, 30 నాటికి 250, జూన్‌ నాటికి 600 పడకలు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు