ఎందుకీ కారు కూతలు! పాత ఫొటోలతో కరెంట్‌ కోతలంటూ రాతలు | Sakshi
Sakshi News home page

ఎందుకీ కారు కూతలు! పాత ఫొటోలతో కరెంట్‌ కోతలంటూ రాతలు

Published Fri, Feb 25 2022 6:01 AM

Quality and uninterrupted power supply in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ( ఏపీఎస్పీడీసీఎల్‌ ) చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ హెచ్‌.హరనాధరావు స్పష్టం చేశారు. ‘ఎందుకీ కోతలు!’ శీర్షికన ఓ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని ఖండిస్తూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 

► కర్నూలు జిల్లా కోసిగి మండలంలో 160 కేవీఏ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఎల్టీ కేబుల్‌ మరమ్మతుల కారణంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఎటువంటి అంతరాయాలు లేవు.
► రైతులకు 9 గంటల పాటు విద్యుత్‌ అందడం లేదన్న కథనంలో నిజం లేదు. వ్యవసాయ విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేవు. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కొనసాగుతోంది.
► అనంతపురం జిల్లా మడకశిర మండలంలో మంగళవారం ఆర్టీపీపీలో కెపాసిటర్‌ ఓల్టేజ్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌ సమస్య కారణంగా సబ్‌ స్టేషన్లు ట్రిప్‌ కావడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ సరఫరా కొనసాగుతోంది.
► చిత్తూరు జిల్లాలో విద్యుత్‌ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేవు.
► అనంతపురం జిల్లాలో గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు లేవు. బుధవారం 18.227 ఎంయూల విద్యుత్‌ను సరఫరా చేశాం. ప్రతి నెలా రెండో శనివారం లేదా 3వ శనివారం సబ్‌ స్టేషన్లు, లైన్ల నిర్వహణ కోసం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది.
► ప్రస్తుతం రాష్ట్ర గ్రిడ్‌లో దాదాపు 45 శాతం సౌర, పవన, ఇతర వనరుల స్థాపిత విద్యుత్‌ ఉంది. వీటి నుంచి వచ్చే విద్యుత్‌ ’తప్పక సేకరణ’ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. సంవత్సరంలో దాదాపు ఆరు నెలలు ఈ వనరుల నుంచి విద్యుదుత్పత్తి అధికంగా ఉంటుంది. సౌర కేంద్రాల నుంచి సంవత్సరం మొత్తం ఉంటుంది కానీ పగటి పూట మాత్రమే లభ్యత ఉంటుంది.
► రోజువారీ గ్రిడ్‌ డిమాండ్‌లో కేవలం 4 గంటలు  (ఉదయం, సాయంత్రం పీక్‌ లోడ్‌ సమయంలో) మాత్రమే కొంత వరకూ విద్యుత్‌ కొరత ఏర్పడుతోంది. దీన్ని అధిగమించడానికి బహిరంగ మార్కెట్‌ లో ముందురోజు బిడ్డింగ్‌ విధానంలో సమకూర్చుకుంటున్నాం. ఈ విధానంలో అందుబాటులోకి రాకపోతే రోజువారీ మార్కెట్‌లో  కానీ అత్యవసర మార్కెట్‌లో కానీ విద్యుత్‌ సేకరించి కొనుగోలు చేస్తున్నాం.
► రాష్ట్రంలోని విద్యుత్‌ కేంద్రాల నుంచి అందుబాటులో ఉన్నంతవరకు ఎలాంటి బ్యాక్‌ డౌన్‌ లేకుండా విద్యుత్‌ సేకరిస్తున్నాం. ప్రస్తుతం ఏ విద్యుత్‌ కేంద్రాన్ని షట్‌ డౌన్‌ చేయడం లేదు. బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధర  ఉన్నా వినియోగదారుల సౌకర్యార్ధం ముఖ్యంగా వ్యవసాయదారుల కోసం ప్రస్తుత రబీ సీజన్‌లో ఒక్క సెంటు భూమికి కూడా సాగు నీటి కొరత తలెత్తకుండా  విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నాం.

కోతలు లేవు.. నాణ్యమైన కరెంట్‌
ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) పరిధిలోని విద్యుత్తు వినియోగదారులకు నాణ్యమైన కరెంట్‌ సరఫరా చేస్తున్నామని ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ఎస్‌.జనార్దనరావు ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎందుకీ.. కోతలు!’ శీర్షికతో ఓ దినపత్రిక ప్రచురించిన కథనంలో నిజం లేదని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యుత్‌ కోతలతో సాగు నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయనడం అవాస్తవమన్నారు. బుట్టాయగూడెం విద్యుత్‌ శాఖ అధికారులు లోడ్‌ రిలీఫ్‌ కోసం కోతలు విధిస్తున్నారనడం కూడా అవాస్తవమేనని, విద్యుత్‌  అధికారులు అటువంటి వివరణ ఏదీ ఇవ్వలేదని వెల్లడించారు. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు. వినియోగదారులందరికి నిరంతరాయంగా సరఫరా చేసేందుకు అవసరమైన సిబ్బంది, సామగ్రి 24 గంటలు అందుబాటులో ఉన్నాయన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఏర్పడిన అంతరాయాలను సరిదిద్ది త్వరితగతిన పునరుద్ధరిస్తున్నారని వివరించారు. విద్యుత్‌ అంతరాయాలు తలెత్తినప్పుడు వినియోగదారులు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912కు తెలియచేయాలని ఎస్‌ఈ కోరారు.

మడకశిరలో కరెంట్‌ కోతలు లేవు 
అనంతపురం జిల్లా మడకశిరలో బుధవారం కరెంట్‌ కోతలు విధించారన్న వార్తల్లో నిజం లేదని హిందూపురం డివిజన్‌ డీఈ డి.భూపతి స్పష్టం చేశారు. ఆర్టీపీపీలో సాంకేతిక సమస్యలతో మంగళవారం ఉదయం మాత్రం కొద్ది గంటలు సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. విద్యుత్‌ కోతలపై ఓ పత్రిక ప్రచురించిన కథనం నిరాధారమని మడకశిర ఏడీఈ వెంకటేశ్వర్లు చెప్పారు. 

ఆ ఫొటో... ఇప్పటిది కాదు
నా ఫ్యాక్టరీలో కరెంటు లేకపోవడంతో కార్మికులు ఖాళీగా కూర్చున్నట్లు ఓ పత్రికలో ఫొటో ప్రచురించారు. అసలు ఆ ఫొటో ఇప్పటిది కాదు. ఇటీవల కరెంట్‌ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదు. గురువారం ఓ ఛానల్‌ వాళ్లు వచ్చి విద్యుత్తు కోతల గురించి మాట్లాడాలని కోరారు. లేని వాటిని ఉన్నట్లు చెప్పడం అన్యాయం. అందుకు నేను ఒప్పుకోలేదు. బుధవారం కరెంటు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగలేదు. మంగళవారం మాత్రం రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఈమేరకు మాకు ముందుగానే సెల్‌ఫోన్‌కు సమాచారం ఇచ్చారు.
– ఆనంద్, టెక్‌ మనోరా ప్యాకింగ్‌ పరిశ్రమ యజమాని, మడకశిర

ఆగింది అరగంటే..
శ్రీకాకుళం జిల్లా పలాస–కాశిబుగ్గలో విద్యుత్తు కండెక్టర్‌ తెగిపోవడంతో బుధవారం సాయంత్రం 6.40 నుంచి 7.14 వరకు 34 నిమిషాల పాటు కరెంట్‌ సరఫరా ఆగిపోయింది. మరమ్మతుల అనంతరం సరఫరాను పునరుద్ధరించారు. ఇక్కడ కరెంట్‌ లేక రాత్రంతా గాడాంధకారం నెలకొందనే తరహాలో ఓ పత్రిక ఫోటోలు ప్రచురించింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement