రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టులు వేగవంతం చేయాలి 

23 Sep, 2021 04:57 IST|Sakshi

నిర్దేశిత గడువులోగా భూ సేకరణ పూర్తి కావాలి 

దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమీక్షలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, ఇతర సివిల్‌ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులపై బుధవారం ఆయన సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా ప్రాజెక్టులకు భూసేకరణ పనులను నిర్దేశిత గడువు ప్రకారం వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, మిగతా వ్యయాన్ని రైల్వే శాఖ భరించి ఆయా పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని కోరారు. కడప–బెంగళూరు రైల్వే లైను ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రతి నెల ప్రగతి సమీక్షలో సమీక్షిస్తున్నందున ఆ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.

సకాలంలో నిధులు వెచ్చించాలి 
దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్టులకు కాస్ట్‌ షేరింగ్‌ విధానంలో భరించాల్సిన నిధులను సకాలంలో వెచ్చించి ఆయా రైల్వే ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి యం.టి.కృష్ణబాబు.. భూసేకరణ, పెండింగ్‌ అంశాలను వివరించారు. అంతకుముందు విజయవాడ–ఖాజీపేట మధ్య 3వ రైల్వే లైన్‌ నిర్మాణం, కోటిపల్లి–నర్సాపురం, నడికుడి–శ్రీకాళహస్తి, గుంటూరు–గుంతకల్లు, కడప–బెంగళూరు, భద్రాచలం–కొవ్వూరు, నిడదవోలు–భీమవరం, భీమవరం–విజయవాడ రైల్వే లైను డబ్లింగ్, విద్యుదీకరణ పనులు, పలు ఆర్‌ఓబీల నిర్మాణం తదితర ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. 

మరిన్ని వార్తలు