తెలుగులోనూ రైల్వే టికెట్‌ బుకింగ్‌ | Sakshi
Sakshi News home page

తెలుగులోనూ రైల్వే టికెట్‌ బుకింగ్‌

Published Sat, Apr 29 2023 3:24 AM

Railway ticket booking in Telugu too - Sakshi

సాక్షి, విశాఖపట్నం: జనరల్‌ టికెట్‌ కోసం ఆదరాబాదరాగా రైల్వేస్టేషన్‌కు చేరుకుని.. చాంతాడంత పొడవు ఉండే క్యూలైన్లలో నిలబడి.. ఈలోపు తాము ఎక్కాల్సిన రైలు వెళ్లిపోతుందేమోనని ఆదుర్దా పడేవారే ఎక్కువ. ఇలా ఇబ్బందులు పడే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ నాలుగేళ్ల క్రితం అన్‌ రిజర్వుడ్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ (యూటీఎస్‌)ను తీసుకొచ్చి న సంగతి తెలిసిందే.

యూటీఎస్‌ విధానంలో యాప్, వెబ్‌సైట్‌ ద్వారా రైలు టికెట్లు బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇంగ్లిష్‌లో మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీన్ని ప్రాంతీయ భాషలకు కూడా రైల్వే శాఖ విస్తరించింది. దీంతో తెలుగు సహా వివిధ ప్రాంతీయ భాషల్లోనూ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. సాధారణ (జనరల్‌) రైలు టికెట్లను దిగువ శ్రేణి ప్రయాణికులు ఎక్కువగా తీసుకుంటారని.. వీరి కోసం ప్రాంతీయ భాషల్లో యాప్‌ని తీసుకొస్తే వినియోగం మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

ఎలాంటి శ్రమ లేకుండా యాప్‌ నుంచే..
యూటీఎస్‌ యాప్‌ ద్వారా ఎలాంటి శ్రమ లేకుండా మొబైల్‌ ఫోన్‌ నుంచే జనరల్‌ టికెట్‌ పొందొచ్చు. అయితే టికెట్‌ బుక్‌ చేసుకోవడానికి ఇంగ్లిష్‌ మాత్రమే అందుబాటులో ఉండటంతో గ్రామీణులు, పెద్దగా చదువుకోనివారు ఇబ్బందులు ఎదు­ర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో సులభంగా యాప్‌ వినియోగించేలా ప్రాంతీయ భాషల్లోనూ టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, హిందీ, కన్నడం, మళయాలం, మరాఠీ, ఒడియా, తమిళ భాషల్లోనూ టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా జనరల్‌ టికెట్‌తో పాటు ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ కూడా కొనుగోలు చేయొచ్చు.

అలాగే సీజన్‌ టికెట్‌ బుకింగ్, రెన్యువల్‌ సైతం చేసుకోవచ్చు. యూటీఎస్‌ యాప్‌లో ప్రాంతీయ భాషల అప్‌డేట్‌ వెర్షన్‌ను ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ రెండింటిలోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. హార్డ్‌ కాపీ, పేపర్‌లెస్‌ టికెట్‌.. రెండు ఆప్షన్లు ఉన్నాయి. 


యూటీఎస్‌ యాప్‌
ఎన్ని భాషల్లో: తెలుగు, ఇంగ్లిష్, కన్నడం,  మలయాళం, హిందీ, తమిళం, ఒడియా, మరాఠీ
దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న  రైల్వేస్టేషన్లు: 9,120
డౌన్‌లోడ్‌ చేసుకున్నవారు:  10 మిలియన్లకు పైగా
యాప్‌ ద్వారా రోజుకు  బుక్‌ అవుతున్న టికెట్లు: 2.34 లక్షలు
రోజూ వినియోగిస్తున్న ప్రయాణికులు:  14.21 లక్షల మంది

స్టేషన్‌కు 5 కి.మీ. పరిధిలో..
మొబైల్‌లోని జీపీఎస్‌ ఆధా­­రంగా యూటీఎస్‌ యాప్‌ పనిచేస్తోంది. టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలో మొబైల్‌ జీపీఎస్‌ లొకేషన్‌ ఆన్‌లో ఉండాలి. రైల్వేస్టేషన్‌ ఆవరణకు 30 మీటర్ల నుంచి 5 కి.మీ. పరి­ధిలో ఉన్న ప్రయాణికులు మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా యాప్‌ ద్వారా 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరానికి సీజన్‌ టికెట్లను తీసుకోవ­చ్చు. ఎక్స్‌ప్రెస్, మెయిల్, ప్యాసింజర్, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు యూటీఎస్‌ టికెట్‌ బుకింగ్‌ చెల్లుబాటు అవుతుంది.  – అనూప్‌కుమార్‌ సత్పతి,  డీఆర్‌ఎం, వాల్తేరు 

Advertisement

తప్పక చదవండి

Advertisement