మరాఠా మనసు గెలిచిన తెలుగోడు

30 Apr, 2021 10:00 IST|Sakshi

మహారాష్ట్ర పాఠ్యపుస్తకాల్లో తెలుగు గేయం

తొమ్మిదో తరగతి తెలుగు వాచకంలో ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’

విజయనగరం జిల్లా ప్రజాకవి గంటేడ గౌరునాయుడుకు అరుదైన గౌరవం

సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహారాష్ట్రలో మన తెలుగు రచయిత గంటేడ గౌరునాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రాసిన గేయం మరాఠాల మనసులను హత్తుకుంది. తొమ్మిదో తరగతి తెలుగు వాచకంలో ఆయన రాసిన ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’కు అక్కడి ప్రభుత్వం మొదటి పాఠ్యాంశంగా చోటు కల్పించింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన గంటేడ గౌరునాయుడు గిరిజన ఆశ్రమ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్‌ అయ్యారు.

స్థానిక అంశాలకు యాస, భాషలను జోడించి వందలాది కవితలు, కథలు, గేయాలను రాశారు. తాను పనిచేస్తున్న పాఠశాల విద్యార్థులకు ఏటా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఆలపించేందుకు కొత్త పాటను పరిచయం చేయాలని సంకల్పించుకున్నారు. ఆ ప్రయత్నంలో ఆయన కలం నుంచి జాలువారిందే.. ‘పాడుదమా స్వేచ్ఛాగీతం.. ఎగరేయుదమా జాతిపతాకం’ అనే దేశభక్తి గేయం. ఈ గీతాన్ని ఆయన గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల కోసం 1990లో రచించారు. 

మూడు దశాబ్దాలుగా మార్మోగుతున్న గేయం
స్వాతంత్రోద్యమ ఘటనలను, అందులోని సమరయోధులను గుర్తు చేస్తూ.. నాటి సన్నివేశాలు కళ్లముందు కదలాడుతున్నట్టుగా ఈ గేయాన్ని రాశారు. అప్పట్లో ఈ పాట విన్న అనంతపురం జిల్లా కలెక్టర్‌ లెనిన్‌బాబు అనే గాయకుడితో పాడించి రికార్డింగ్‌ చేయించారు. దీనికి ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి సూర్యనారాయణరావు వాద్య సహకారాన్ని అందించారు. అనంతరం జనవిజ్ఞానవేదిక, ప్రజానాట్యమండలి తదితర సంస్థలు, సంఘాలు ప్రారంభ గీతంగా దీన్ని వినియోగించుకున్నాయి. ఇలా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల్లో మూడు దశాబ్దాలుగా ఈ గేయం మార్మోగుతోంది. 

దేశం గొప్పతనం గురించి చెప్పే గేయం
మా రాష్ట్రంలోని తెలుగు వాచకంలో మీరు రాసిన ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’ అనే దేశభక్తి గేయం పాఠ్యాంశంగా చేర్పించాలనుకుంటున్నాం.. ఇందుకు మీ అనుమతి కావాలంటూ మహారాష్ట్ర తెలుగు విభాగం ప్రత్యేక అధికారి తులసి భరత్‌ భూషణ్‌ అడిగేసరికి ఎంతో సంతోషం కలిగింది. దేశం గొప్పతనం గురించి చెప్పే చాలా మాటలు, కథలు, గేయాలు వచ్చాయి. కానీ, గురజాడ మాటల్లో.. దేశమంటే మట్టికాదు మనుషులు. అందుకే నా రచనలో దేశం కోసం మనుషులు చేసిన వీరోచిత పోరాటాలను భావితరాలకు అందించాలనిపించింది. ఆ దిశగా ఎన్నో కవితలు, కథలు రాశాను. అందులో పాడుదమా స్వేచ్ఛాగీతం ఒకటి. 
–గంటేడ గౌరునాయుడు, గేయ రచయిత

చదవండి: సీఎం జగన్‌ నన్ను బతికిస్తున్నాడమ్మా.. 
‘వృథా’కు కట్టడి: మూడంచెల వ్యూహం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు