Regional Rapid Transit System (RRTS) Train-Between Hyderabad-Vijayawada - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌–విజయవాడ మధ్య ఆర్‌ఆర్‌టీఎస్‌ రైలు!

Published Mon, Jan 9 2023 4:48 AM

Regional Rapid Transit System (RRTS) Train-Between Hyderabad-Vijayawada - Sakshi

సాక్షి, అమరావతి: హైదరాబాద్‌–విజయవాడ మధ్య ఇంటర్‌సిటీ రైల్‌ సర్వీసులు ఆధునిక సొబగులు సంతరించుకోనున్నాయి. ఇప్పటికే ఈ రెండు నగరాల మధ్య వందే భారత్‌ రైలు సర్వీసు ఈ నెల 19న ప్రారంభం కానుంది. తాజాగా హైదరాబాద్‌– విజయవాడ మధ్య అత్యాధునిక రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (ఆర్‌ఆర్‌టీఎస్‌) రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దేశంలో మెట్రో రైలు కంటే మెరుగైన ఇంటర్‌సిటీ మోడల్‌ రైల్వే వ్యవస్థగా ఆర్‌ఆర్‌టీఎస్‌ను ప్రస్తుతం ఢిల్లీ–మీరట్‌ మధ్య నిర్మిస్తున్నారు. ఆ రెండు నగరాల మధ్య ఆర్‌ఆర్‌టీఎస్‌ రైల్వే వ్యవస్థ 2024 చివరకు అందుబాటులోకి రానుంది. తరు­వాత దేశంలో మరో ఏడు ఆర్‌ఆర్‌టీఎస్‌ల ఏర్పా­టుకు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిలో రెండు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మిగిలిన ఐదింటిలో హైదరాబాద్‌–సికింద్రాబాద్‌ మార్గంలో నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది.  

ఏమిటీ ఆర్‌ఆర్‌టీఎస్‌..
ఇంటర్‌సిటీ రైలు సర్వీసుల్లో ఆర్‌ఆర్‌టీఎస్‌ వ్యవస్థ అత్యాధునికమైనది. మెట్రో రైళ్లు ఓ నగర పరిధిలో సేవలందిస్తాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ నగరాల మధ్య ఇంటర్‌సిటీ సర్వీసులుగా ఆర్‌ఆర్‌టీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. విద్య, ఉద్యోగ, వ్యాపార తదితర అవసరాల కోసం ప్రయాణికులు అత్యధికంగా రాకపోకలు సాగించే సమీపంలోని ప్రధాన నగరాల మధ్య ఏర్పాటు చేసే వ్యవస్థే ఆర్‌ఆర్‌టీఎస్‌. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, ఆయా రాష్ట్ర  ప్రభుత్వాలు సంయుక్తంగా ఆర్‌ఆర్‌టీఎస్‌ ఏర్పాటు చేస్తాయి. అందుకోసం ప్రత్యేక కారిడార్‌ ఏర్పాటుచేసి, రైల్వేశాఖతో నిమిత్తం లేకుండా ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి సమాంతరంగా నిర్వహిస్తాయి. తొలిసారిగా 1998–99లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. రెండు దశాబ్దాల తరువాత తొలి ఆర్‌ఆర్‌టీఎస్‌ వ్యవస్థను ఢిల్లీ–మీరట్‌ మధ్య ఏర్పాటు చేస్తున్నారు. 

అత్యున్నత ప్రమాణాలతో ఆధునిక రైలు ప్రయాణం
ఆర్‌ఆర్‌టీఎస్‌ రైళ్లు అత్యాధునిక ప్రమాణా­లతో ప్రత్యేక ప్రయాణ అనుభూతి కలిగి­స్తాయి.  రైల్వే కోచ్‌లలో రెక్లయినర్‌ సీట్లు, విశా­లౖ­మెన నడవా, ప్రతి సీటుకు ప్రయా­ణించే రూట్‌ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా లగేజీ ర్యాక్‌లు, మొబైల్‌­ఫోన్లు/ల్యాప్‌టాప్‌ చార్జింగ్‌ సాకెట్లు ఉంటాయి. సీసీటీవీ కెమెరాలు, డబుల్‌ గేజ్‌ అద్దాల కిటికీలు, ఫైర్‌/స్పోక్‌ డిటెక్టర్లు మొద­లైన ఆధునిక భద్రతా ప్రమాణాలతో కోచ్‌­లను రూపొందిస్తారు. ప్రయాణికుల కోసం  రైల్వే స్టేషన్లలో ప్రత్యేక లాంజ్‌ ఏర్పాటు చేస్తారు. ఆర్‌ఆర్‌టీఎస్‌ వ్యవస్థతో గంటకు 160 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల  వేగంతో ఆధునిక రైలు ప్రయాణ అనుభూతిని ఆస్వాదించవచ్చును. 

మరో రెండింటికి ఓకే..
దేశం మొత్తం మీద రైల్వేశాఖతో నిమిత్తంలేకుండా 1,835 కిలోమీటర్ల మేర మెట్రో, ఆర్‌ఆర్‌టీఎస్‌ లైన్లుగా కేటాయించారు. వాటిలో 824 కిలోమీట్లు మెట్రోరైల్‌ లైన్లు కాగా మిగిలిన 1,011 కిలోమీటర్లను ఆర్‌ఆర్‌టీఎస్‌ పరిధిలోకి చేర్చారు. తరువాత ఢిల్లీ–హరిద్వార్, ఢిల్లీ–అల్వార్, ఢిల్లీ–జైపూర్, ఢిల్లీ–ఛండీగఢ్, రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలోని హైదరాబాద్‌– విజయవాడ, హరియాణలోని ఫరీదాబాద్‌–గురుగావ్, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో–కాన్పూర్‌ మధ్య ఆర్‌ఆర్‌టీఎస్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు. వీటిలో ఢిల్లీ–హరిద్వార్, ఢిల్లీ–అల్వార్‌ ప్రాజెక్టులు ఓకే అయ్యాయి.

వీటి తరువాత ఐదు ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రతిపాదనలు వచ్చాయని ఢిల్లీలోని నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీఆర్‌టీసీ) ఎండీ వినయ్‌కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. ఆర్‌ఆర్‌టీఎస్‌ కారిడార్‌ నిర్మాణానికి ప్రస్తుత అంచనాల ప్రకారం కిలోమీటరుకు రూ.370 కోట్ల వ్యయం అవుతుంది. 2024 చివరకు హైదరాబాద్‌–విజయవాడతోపాటు ఇతర ఆర్‌ఆర్‌టీఎస్‌ల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రూపొందించే ప్రక్రియ చేపడతామని ఎన్‌సీఆర్‌టీసీ వర్గాలు చెప్పాయి.  

Advertisement
Advertisement